- 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం
- వాతావరణ శాఖ హెచ్చరిక
- నగరంలో మళ్లీ పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అగస్టు 4 : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ నెల7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజగిరి, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహమబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 6న రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
నగరంలో మళ్లీ పలు ప్రాంతాల్లో వర్షం
నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం మరోమారు ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పలుచోట్ల కురిసిన వర్షానికి వివిధ పనులపై బయటకు వెళ్లిన నగరవాసులు తడిసి ముద్దయ్యారు. రహదారులపైకి నీరు రావడంతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. కూకట్పల్లి, హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, కేపీహెచ్‌బీ, కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, షేక్‌పేట, లక్డికాపూల్, హిమాయత్‌నగర్, నారాయణ గూడ, లిబర్టీ, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, సైదాబాద్, శంషాబాద్, సాతంరాయి, గగన్‌పహాడ్, తొండుపల్లిలో వర్షం కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్పూర్, బండ్లగూడ జాగిర్, గండిపేట్, మణికొండ, పుప్పల్‌గూడా, ఆరాంఘర్ ప్రాంతాలలోనూ వర్షం కురిసింది. యూసుఫ్‌గూడా ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురియటంతో.. రహదారులన్ని జలమయమయ్యాయి. శ్రీకృష్ణనగర్- బి బ్లాక్ కమ్యూనిటీ హాల్ వీధి, సింధు టిఫిన్ సెంటర్ వీధిలో వరద నీరు పొంగుతోంది. రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు వాన నీటిలో మునిగిపోయాయి. మోకాళ్ల వరకు వరద వస్తుండటంతో.. స్థానికులతో పాటు వాహనాదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అంతవరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కురియటంతో నగరవాసులు తడిసిముద్దయ్యారు. రహదారులపై వర్షం నీరు పొంగటంతో.. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మరోవైపు.. రాష్ట్రంలో రాగల మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రేపు, ఎల్లుండి 30 నుంచి 40 కి. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఈ నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్టు తెలిపారు.