కేసీఆర్ కు దమ్ముంటే… తెలంగాణలో చేసిన అభివృద్ధి శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి
నా దిల్లీ పర్యటన మీడియా సృష్టే
నన్ను హైకమాండ్ పిలవనేలేదు
కేసీఆర్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ
బండి సంజయ్ కుమార్ ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే17 : ‘‘ప్రజా సమస్యలపై, ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నంచే మీడియాను కేసీఆర్ ప్రభుత్వం నిషేధిస్తోంది. ఉద్యమించే నాయకులను అరెస్ట్ చేసి బెదిరిస్తోంది. మరో 5 నెలలు ఆగండి… తెలంగాణ ప్రజలే కేసీఆర్ సర్కార్ ను నిషేధించబోతున్నారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు… తెలంగాణ సబ్బండ వర్గాలు అల్లాడుతుంటే….. వందల కోట్ల ప్రజా ధనంతో సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. చివరకు బీజేపీ ఎదుగుతుంటే ఓర్వలేక తమ పార్టీ వార్తలు రాయొద్దంటూ ప్యాకేజీలు ఇచ్చే దుస్థితికి కేసీఆర్ చేరుకున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ కు దమ్ముంటే…తన పాలనలో తెలంగాణలో చేసిన అభివృద్ధిపై శాఖల వారీగా శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ లోని నిజాం కాలేజీ మైదానంలో ‘‘ఖేలో భారత్- జీతో భాగ్యనగర్’’ పేరిట నిర్వహించిన క్రీడల పోటీల ఫైనల్ మ్యాచ్ ను చూడడానికి వచ్చిన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ..ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖేలో ఇండియా పేరుతో బీజేపీ ప్రాతినిధ్యం
వహిస్తున్న అన్న పార్లమెంట్ నియోజకవర్గాల్లో క్రీడల పోటీలు నిర్వహిస్తున్నాం.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి రాజధానిలో క్రీడలను ప్రోత్సహించాలనే మంచి ఆలోచనతో రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ‘‘ఖేలో భారత్ – జీతో భాగ్యనగర్’’ పేరిట పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. యువతకు క్రీడా స్పూర్తి చాలా అవసరం.. క్రీడా స్పూర్తితో ఏ రంగంలోనైనా సమిష్టిగా పనిచేస్తే రాణించవచ్చని ఈ క్రీడలు చాటి చెబుతున్నాయి అని పేర్కొంటూ నరేంద్రమోదీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోంది. యూపీఏ హయాంతో పోలిస్తే క్రీడల బడ్జెట్ ను 8 రెట్లు అధికంగా కేటాయించేవారు. గతంలో క్రీడల్లో సెలెక్ట్ కావాలన్నా, అవార్డులు ఇవ్వాలన్నా పైరవీలు ఉండేవి. అని బండి సంజయ్ అన్నారు .’’పంట నష్టోయిన రైతులు ఏడుస్తున్నరు. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు బాధపడుతున్నరు. నిలువ నీడ లేక పేదల అల్లాడుతున్నరు. కానీ అవసరం లేకపోయినా సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టుకున్నడు. ప్రగతి భవన్ కట్టుకున్నడు… ఇక్కడి ప్రజలను ఆదుకోవాలని చెబుతుంటే… పంజాబ్ పోయి అక్కడి రైతులకు పైసలిస్తడు… మహారాష్ట్ర వాడికి ఉద్యోగాలిచ్చి లక్షల జీతాలు ఇస్తున్నడు. హైకోర్టు తిడితే ఏపీకి పారిపోయినోడిని పట్టుకుని వచ్చి మళ్లీ ఇక్కడ చీఫ్ అడ్వయిజర్ పోస్టులిచ్చిండు…అని బండి సంజయ్ కేసీఆర్ పాలనను తూర్పారపట్టారు.కేసీఆర్ కు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే చెప్పాలి…. ఏ శాఖ ఏ రకమైన అభివృద్ధి చేసిందో వివరాలతో సహా శ్వేత పత్రం విడుదల చేయాలి అని బండి సంజయ్ డిమాండ్ చేసారు.