- నాలుగు రోజుల్లో మూడు సార్లు పెంపు
- హైదరాబాద్‌లో లీటరు పెల్రు ధర రూ. 110.91, డీజిల్ ధర రూ.97.23
- పెంపును సమర్థించుకుంటూ పార్లమెంటులో కేంద్రమంత్రి ప్రకటనపై సర్వత్రా నిరసనలు
న్యూ దిల్లీ, మార్చి 25 : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్‌పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రో, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడోసారి. తాజా పెంపుతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.97.81, డీజిల్ ధర రూ.89.07కు చేరాయి. ముంబైలో పెట్రోల్ రూ.112.51, డీజిల్ రూ.96.70గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ రూ.112.51 (84 పైసలు), డీజిల్ రూ.96.70గా (85 పైసలు) ఉన్నాయి. చెన్నైలో 76 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.103.67, డీజిల్ రూ.93.71, కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.34 (84 పైసలు), డీజిల్ రూ.91.42 (80 పైసలు)కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసల చొప్పున అధికమయ్యాయి. దీంతో పెట్రోలు ధర రూ.110.91, డీజిల్ రూ.97.23కు చేరాయి. కాగా, దేశంలో గతేడాది నవంబర్ 4వ తేదీ తర్వాత మొదటిసారిగా మార్చి 22న పెట్రోల్, డీజిల్ ధరలు అధికమయ్యాయి. మార్చి 23న కూడా చమురు కంపెనీలు ధరలు పెంచాయి.
తాజా పెంపుతో మూడు రోజుల్లోనే లీటరు పెట్రోల్, డీజిలు ధరలు రూ.2.40 చొప్పున పెరిగాయి. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిపోవడంతో చమురు కంపెనీలు లీటరు డీజిలుపై రూ.13.1 నుంచి రూ.24.9 వరకు, పెట్రోలుపై రూ.10.6 నుంచి రూ.22.3 వరకు వడ్డించే అవకాశం ఉన్నదని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సమర్థించుకొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదలకు అనుగుణంగానే ఈ ధరలను పెంచామని, ఒకవిధంగా చూస్తే తాము పెంచిన ధరలు తక్కువేనని చెప్పుకొచ్చారు. ఈ మేరకు గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘ఏప్రిల్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య అంతర్జాతీయ విపణిలో ద్రవ సహజవాయువు(ఎల్‌ఎన్‌జీ) ధరలు 37 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.
కొరోనా సంక్షోభం, ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ పరిస్థితి వొచ్చింది. అయినప్పటికీ, బంకుల్లో మేము పెట్రో ధరలను 5 శాతం మాత్రమే పెంచాం’ అని పురి తెలిపారు. వంటగ్యాస్ సిలిండర్ ధర పెంపుపై కూడా వివరణ ఇచ్చారు. ‘ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2022 మధ్య అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధర 285 శాతం పెరిగింది. అయితే, గడిచిన ఆరు మాసాల్లో 37 శాతం మాత్రమే పెంచాం’ అని పేర్కొన్నారు. వినియోగదారులకు అందుబాటు ధరలోనే పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పెట్రోపెంపుపై పార్లమెంట్‌లో పురి ఇచ్చిన వివరణపై సోషల్‌వి•డియాలో నెటిజన్లు పెద్దయెత్తున మండిపడుతున్నారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికే కేంద్రం కావాలనే పెట్రో రేట్లను ఇంతకాలం స్థిరంగా కొనసాగించిందని, ఎన్నికలు ముగియగానే మళ్లీ బాదుడు మొదలుపెట్టిందని విమర్శిస్తున్నారు. కేంద్రమంత్రి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.