అమెరికాలో మరోమారు విగ్రహం ధ్వంసం
వాషింగ్టన్, ఆగస్ట్ 19 : భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ధ్వంసం చేశారు. రెండు వారాల్లో ఇలాంటి సంఘటన జరుగడం ఇది రెండోసారి. న్యూయార్క్ నగరంలో మరోసారి గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నెల 16న ఈ సంఘటన జరిగింది. తెల్లవారుజామున రెండు కార్లలో వచ్చిన ఆరుగురు వక్తులు శ్రీ తులసి మందిర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని పెద్ద సుత్తితో పగులకొట్టి ధ్వంసం చేశారు. అనంతరం విరిగిన విగ్రహం, అక్కడి రోడ్డుపై విద్వేష పదాలు రాశారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. 25-30 మధ్య వయసున్న ఆరుగురు వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారు అక్కడి నుంచి కార్లలో పారిపోయినట్లు చెప్పారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
కాగా, న్యూయార్క్ రిచ్‌మండ్ హిల్స్‌లోని శ్రీ తులసి మందిర్ వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం రెండు వారాల్లో ఇది రెండోసారి. ఈ నెల 3న కూడా దుండగులు అక్కడి గాంధీ విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. తాజాగా ఈ నెల 16న ఆ విగ్రహాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్‌కుమార్ ఈ సంఘటనను ఖండించారు. నేరస్థులను త్వరలో పట్టుకుని చట్టం ప్రకారం శిక్ష విధిస్తామని తెలిపారు. విద్వేష శక్తులను ఓడించడంలో విజయం సాధిస్తామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో మరో గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఈ ఏడాది జులై 14న కెనడాలో కూడా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది.