మహిళలకు సాధికారతకు ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ కృషి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 01 : మహిళలకు సాధికారత కల్పించటంతో పాటు ఆదాయాన్ని కల్పించే ఉద్దేశ్యంతో ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం ఎన్.కె.ఎన్.ఆర్ గార్డెన్స్ లో ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన టైలరింగ్ శిక్షణ తరగతుల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని ఖార్డు సంస్థ ద్వారా శిక్షణ తీసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖార్డు సంస్థ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు సేవ చేస్తున్న సుమన్ దంపతులను అభినందిస్తూ కూకట్పల్లి నియోజకవర్గంలోని ఖార్డు సంస్థ ద్వారా శిక్షణ తీసుకున్న వారందరికీ తన సొంత నిధులతో 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మహిళలు స్వయం సమృద్ధి సాధించి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఇందుకు అనుగుణంగానే ప్రత్యేకంగా మహిళల కోసం ఖైత్లాపూర్ లో 4 వేల గజాలు స్థలంలో భవన నిర్మాణం చేపట్టి అక్కడే మహిళా బ్యాంకు ఏర్పాటు చేస్తామని అన్నారు. మహిళలకు శిక్షణ తరగతులు కూడా అక్కడే నిర్వహిస్తామని అన్నారు. దీనికి మదర్ తెరిసా మహిళా భవనంగా నామకరణం కూడా చేస్తామని ప్రకటించారు. ఈనాడు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందు ఉండి దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ విధంగా ప్రజలకు తన వంతు సహాయం చేయడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. తన సొంత నిధులతో 44 లక్షల రూపాయల రెండు అంబులెన్స్లను ప్రజలకు అందుబాటులో ఉంచామని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు వంటి బ్యాగు కిట్లను అందించామని తెలిపారు. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు నిత్యవసరాలు అందించి ఆపద ఉన్నప్పుడు తన వంతు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఖార్డు స్వచ్ఛంద సంస్థ సుమన్ దంపతులు కూడా కూకట్పల్లి నియోజకవర్గంలో నిరుపేదలు ఎక్కువ నివసించే ప్రాంతంలో తమ వంతుగా నిత్యవసరాలు అలాగే మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముద్దం నరసింహ యాదవ్, పగుడాల శిరీష బాబురావు, పండాల సతీష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page