మహిళా సంఘాల నేతలపై పోలీసుల దౌర్జన్యం

దుస్తులు చించేసి లగచర్ల వెళ్లకుండా అడ్డగింత
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌మహిళా సంఘాల జేఏసీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫ్యాక్ట్ ‌ఫైండింగ్‌ ‌కోసం వికారాబాద్‌ ‌జిల్లాలోని లగచర్లకు వెళ్తుండగా బొమ్రాస్‌ ‌పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పెనుగులాటలో మహిళా నేతల దుస్తులను పోలీసులు చించివేశారు. మహిళా సంఘాల జేఏసీ నేతలు సంధ్య, పద్మజా షా, ఝాన్సీ, అనసూయ, సజయ, సిస్టర్‌ ‌లిస్సి, గీత సహా పలువురిపై దాష్టీకానికి పాల్పడ్డారు. మీడియా లేకుండా వెళ్తామని జేఏసీ నేతలు కోరినా పోలీసులు అంగీకరించలేదు. దీంతో జిల్లా ఎస్సీ, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌కోదండరాంతో మాట్లాడినప్పటికి అనుమతించలేదు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లగచర్లలో మహిళలు, గిరిజనులపై జరిగిన సంఘటనకు సంబంధించి వాస్తవాలను ప్రజలకు తెలియజే సేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని జేఏసీ నేతలు ప్రశ్నించారు.

పోలీసులు కూడా తమతో రావొచ్చని చెప్పినప్పటికి మహిళా సంఘాల నేతలను అనుమతించకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా పోలీసులు మహిళలపై దౌర్జన్యాలు, లైంగిక వేధింపులకు పాల్పడకపోతే మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదంటూ నిలదీశారు. పోలీసులు తమను లైంగికంగా వేధించారని, అసభ్యంగా తిట్టారంటూ లగచర్లలో మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అండగా ఉండాలంటూ ఫోన్లు చేసి కోరుతున్నారని వారు తెలిపారు. పోలీసులు, ప్రభుత్వ తీరు చూస్తుంటే అనుమానాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు, దౌర్జన్యాలపై ప్రతి ఒక్కరూ స్పందించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page