‘‘వసుధైవ కుటుంబకం’- ఈ రెండు పదాల్లో యావత్ ప్రపంచాన్నీ ఏకం చేసే లోతైన తాత్త్వికత దాగి ఉంది. ‘‘ప్రపంచమంతా ఒకే కుటుంబం’’ అన్నదే ఈ రెండు మాటల విశాల భావన. ప్రాదేశిక సరిహద్దులు, భాషలు, భావజాలాలకు అతీతంగా మనమంతా ఒకే సార్వజనీన కుటుంబంగా పురోగమించేలా మనల్ని ప్రోత్సహిస్తూ అందరినీ ప్రపంచ ప్రజానీకం మమేకమయ్యే విశ్వ దృక్పథమిది. భారత జి-20 అధ్యక్షత నేపథ్యంలో ఈ దృక్పథం ప్రాతిపదికగానే మానవాలి-కేంద్రక పురోగమనానికి ఈ భావనే ఒక పిలుపుగా రూపొందించబడింది. ఒక భూమి నివాసులుగా మన గ్రహాన్ని తీర్చిదిద్దుకోవడానికి మనమంతా ఏకమయ్యాం. ఒకే కుటుంబంగా అభివృద్ధి సాధనలో పరస్పరం మద్దతిచ్చుకుంటాం. ఉమ్మడి భవిష్యత్తు.. ఏకైక భవిష్యత్తు- అన్నది ఈ పరస్పరం అనుసంధానమైన కాలంలో తోసిపుచ్చలేని వాస్తవం.
మహమ్మారి అనంతర ప్రపంచక్రమం అంతకుముందున్న ప్రపంచానికి ఎంతో భిన్నమైనది. ఈ మేరకు సంభవించిన మార్పులలో ముఖ్యమైనవి మూడున్నాయి:
మొదటిది- ప్రపంచ జిడిపి-కేంద్ర దృక్పథం నుంచి మానవ-కేంద్రీకృత దృక్పథానికి మారడం అవసరమనే అవగాహన పెరగడం.
రెండోది- ప్రపంచ సరఫరా శ్రేణిలో ప్రతిరోధకత, విశ్వసనీయతల ప్రాముఖ్యాన్ని ప్రపంచం గుర్తిస్తుండటం.
మూడోది- అంతర్జాతీయ వ్యవస్థలలో సంస్కరణల ద్వారా బహుపాక్షికతకు ఉత్తేజమిచ్చే దిశగా సామూహిక గళం వినిపిస్తుండటం.
ఈ మూడు రకాల మార్పులకు సంబంధించి జి-20కి భారత అధ్యక్షత ఉత్ప్రేరక పాత్ర పోషించింది. ఈ మేరకు ఇండోనేషియా నుంచి 2022 డిసెంబరులో మేము అధ్యక్ష బాధ్యతను స్వీకరించిన వేళ ఆలోచన దృక్పథంలో మార్పులకు జి-20 ఉత్ప్రేరకం కావాల్సి ఉంటుందని నేన్కొ వ్యాసంలో రాశాను. వర్ధమాన, దక్షిణార్థ గోళ దేశాలుసహా ఆఫ్రికా ఖండంలోని బడుగు దేశాల ఆకాంక్షలను ప్రధాన స్రవంతిలో చేర్చాల్సిన నేపథ్యంలో ఇదొక ప్రత్యేక అవసరం.
ఈ మేరకు జి-20కి మా అధ్యక్షత కింద తొలి కార్యాచరణలో భాగంగా దక్షిణార్థ గోళ దేశాల గళం వినిపించేందుకు నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో 125 దేశాల ప్రతిని ధులు పాల్గొన్నారు. దక్షిణార్థ గోళ దేశాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడంలో ఇదొక కీలక కసరత్తు. అంతేకాకుండా మా అధ్యక్షత సమయాన ఆఫ్రికా దేశాలనుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు పాల్గొనడంతోపాటు ఆఫ్రికా సమాఖ్యకు జి-20 శాశ్వత సభ్యత్వం కల్పించే ప్రతిపాదన కూడా వచ్చింది.
పరస్పర సంధానిత ప్రపంచమంటే వివిధ రంగాల్లో మన సవాళ్లు కూడా పరస్పరం ముడిపడి ఉంటాయి. ఇక 2030 గడువుతో సాధించాల్సిన లక్ష్యాలకుగాను మనమిప్పుడు మధ్య కాలంలో ఉన్నాం. అయినప్పటికీ సుస్థిర ప్రగతి లక్ష్యాల (ఎస్‌డిజి) దిశగా పురోగమనం లేదన్న ఆందోళన చాలా దేశాల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఎస్‌డిజి’ల ప్రగతిని వేగిరం చేయడంపై జి-20 కూటమి 2023 కార్యాచరణ ప్రణాళిక అన్నిదేశాలనూ భవిష్యత్తువైపు నడిపిస్తుంది. ప్రకృతితో సామరస్యపూరిత జీవనశైలి భారతదేశంలో ప్రాచీన కాలం నుంచీ కొనసాగుతున్నదే. అదే సమయంలో ఈ ఆధునిక యుగంలోనూ వాతావరణ కార్యాచరణకు మా వంతు సహకారం అందిస్తున్నాం.
ప్రగతికి సంబంధించి దక్షిణార్థ గోళంలోని అనేక దేశాలు వివిధ దశలలో ఉన్నాయి. అందువల్ల వాతావరణ కార్యాచరణ పరిపూరక ఉపకరణం కావడం తప్పనిసరి. లక్ష్యసాధన ఆకాంక్షలు నెరవేరాలంటే ఇందుకు తగినట్లు వాతావరణ నిధుల సమీకరణ, సాంకేతికత బదిలీ కూడా అవశ్యం. ‘‘పరిస్థితి చక్కబడాలంటే మనం ఏం చేయకూడదు?’’ అనే నిర్బంధాత్మక ధోరణి నుంచి మనం పూర్తిగా బయటపడాలన్నది మా దృఢ విశ్వాసం. కాబట్టి అలాంటి వైఖరికి భిన్నంగా వాతావరణ మార్పులతో పోరాటంపై చేయాల్సింది ఏమిటనే దిశగా నిర్మాణాత్మక ఆలోచనలపై మనం దృష్టి సారించాలి.
సుస్థిర, ప్రతిరోధక నీలి ఆర్థిక వ్యవస్థ కోసం చెన్నై ‘హెచ్‌ఎల్‌పి’లు మన మహా సముద్రాలను ఆరోగ్యకరంగా ఉంచ డంపై దృష్టి పెడతాయి.హరిత ఉదజని ఆవిష్కరణ కేంద్రం తోపాటు పరిశుభ్ర-హరిత ఉదజని కోసం అంతర్జాతీయ పర్యావరణ వ్యవస్థ మా జి-20 అధ్యక్షత నుంచి ఆవిష్కృ• •మవుతుంది.
మేము 2015లో అంతర్జాతీయ సౌర కూటమికి నాంది పలికాం. నేడు ప్రపంచ జీవ ఇంధన కూటమి ద్వారా వర్తుల ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలకు తగినట్లు ఇంధన పరివర్తనకు శ్రీకారం చుట్టడంలో ప్రపంచానికి మేం మద్దతిస్తాం. వాతావరణ ఉద్యమానికి ఊపునివ్వడంలో వాతావరణ కార్యాచరణను ప్రజాస్వామ్యీ కరించడం ఉత్తమ మార్గం. వ్యక్తులు తమ దీర్ఘకాలిక ఆరోగ్యం ప్రాతిపదికగా రోజువారీ నిర్ణయాలు తీసుకున్న రీతిలోనూ మన భూమి దీర్ఘకాలిక ఆరోగ్యంపై ప్రభావం ప్రాతిపది కగా జీవనశైలిపై నిర్ణయాలు తీసుకోవచ్చు. మానవ శ్రేయస్సుకు యోగాభ్యాసం ఒక అంతర్జాతీయ ఉద్యమంగా రూపొందిన తరహాలోనే మనం కూడా ‘సుస్థిర పర్యావరణం కోసం జీవనశైలి’ (లైఫ్)తో ప్రపంచవ్యాప్తంగా కదలిక తెచ్చాం. వాతావరణ మార్పుల ప్రభావం నేపథ్యంలో ఆహారం-పౌష్టిక భద్రతకు హామీ ఇవ్వడం ఎంతో కీలకం. ఈ హామీ ఇవ్వడంతోపాటు వాతావరణ-అనుకూల వ్యవసాయం వృద్ధికి చిరుధాన్యాలు లేదా ‘శ్రీ అన్న’ కూడా తోడ్పడతాయి. ప్రస్తుత అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరం నేపథ్యంలో మనం చిరుధాన్యాలను అంతర్జాతీయ ప్రజానీకం కంచాల్లోకి తీసుకెళ్లగలిగా. ఆహార భద్రత-పౌష్టికతపై దక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలు కూడా ఇందుకు సాయప డతాయి.
సాంకేతిక పరిజ్ఞానంలో పరివర్తన సర్వసాధారణమే.. అదే సమయంలో అది సార్వజ నీనం కూడా కావాలి. లోగడ సాంకేతిక పురోగమన ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందలేదు. అయితే, అసమానతల విస్తరణలోగాక తొలగింపులో సాంకేతికత వినియోగం ఎంత ప్రయోజనకరమో కొన్నేళ్లుగా భారత్ ససాక్ష్యంగా నిరూపించింది. ఉదాహరణకు? ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సదుపాయం లేదా డిజిటల్ గుర్తింపు లేని కోట్లాది ప్రజలను డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలు (డిపిఐ) ద్వారా ఆర్థిక సార్వజనీనతలో భాగస్వాములను చేయవచ్చు. ఈ మేరకు ‘డిపిఐ’ ఆధారిత పరిష్కారాలకు నేడు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్ధమాన దేశాలు సార్వజనీన వృద్ధి సాధనలో ‘డిపిఐ’ని స్వీకరించి, తమకు తగిన స్థాయిలో వాటిని రూపొందించుకునేలా మేం చేయూతనిస్తాం.
భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ కావడం యాదృచ్ఛికమేమీ కాదు. బలహీన/అట్టడుగు వర్గాలు మన పురోగమన పయనాన్ని నడిపించగలిగేలా మేము అమలు చేసిన సరళ, అనుసరణీయ, సుస్థిర పరిష్కారాలు శక్తినిచ్చాయి. అంతరిక్షం నుంచి క్రీడారంగం వరకుబీ ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రతిరోధకత దాకా.. భారత మహిళలు వివిధ రంగాల్లో ముందంజ వేశారు. మహిళల నేతృత్వంలో ప్రగతికి వారు సరికొత్త అర్థం చెప్పారు. ఈ విధంగా లింగపరంగా డిజిటల్ విభజన తొలగింపు, శ్రామిక శక్తిపరంగా అంతరం తగ్గింపుసహా నాయకత్వం-నిర్ణయాత్మకతలో మహిళలు కీలక పాత్ర పోషించేలా ఇవి ప్రోత్సహిస్తున్నాయి.
భారతదేశానికి జి-20 అధ్యక్షత కేవలం ఉన్నతస్థాయి దౌత్య కర్తవ్యం మాత్రమే కాదు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా, వైవిధ్యానికి నమూనాగా యావత్ ప్రపంచం మా అనుభవా లను పంచుకునేందుకు ద్వారాలు తెరిచాం. వివిధ అంశాల్లో విజయసాధన అన్నది నేడు భారతదేశ సహజ లక్షణంగా మారింది. ఇందుకు జి-20 అధ్యక్ష బాధ్యత మినహాయింపు కాబోదు. ఇప్పుడీ బాధ్యత ప్రజాచోదక ఉద్యమంగా రూపొందటమే ఇందుకు కారణం. ఈ మేరకు దేశవ్యాప్తంగా 60 నగరాల్లో 200కుపైగా సమావేశాలు, సదస్సులు నిర్వహిం చబడ్డాయి. వీటితోపాటు మా అధ్యక్ష బాధ్యతలు ముగిసేలోగా వీటిలో పాలుపంచుకున్న 125 దేశాలకు చెందిన 1,00,000 మందికిపైగా ప్రతినిధులకు మా ఆతిథం రుచి చూ పాం. ఇప్పటిదాకా ఏ దేశమూ ఇంత భౌగోళిక వైవిధ్యంతో జి-20 అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది లేదు.
భారతదేశ జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం, ప్రగతిపై ఇతరుల నుంచి ప్రశంసలు వినడం ఒక అంశమైతే, అంతకన్నా ముందే వాటిని ప్రత్యక్షంగా అనుభవించడం పూర్తిగా భిన్నం. మా జి-20 ప్రతినిధులు దీనికి ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను.మా జి-20 అధ్యక్షత ప్రధానంగా విభజన రేఖల తుడిచివేతకు, అడ్డంకులను ఛేదనకు, విభేదాలకు భిన్నంగా ప్రపంచంలో సామరస్యం దిశగా సహకార బీజాలు వేయడానికి కృషి చేస్తుంది. ‘ఎవరికివారే యమునాతీరే’ పరిస్థితికన్నా ఉమ్మడి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవడమే మా లక్ష్యం. ఆ దిశగా ప్రతి స్వరం వినిపించేలా, ప్రతి దేశం సహకరించేలా అంతర్జాతీయ వేదిక విస్తరణకు మేం శపథం చేశాం. తదనుగుణంగా మా కార్యాచరణ, ఫలితాలు చెట్టాపట్టాలతో సాగుతున్నాయని నేను ఘంటాపథంగా చెప్పగలను.