చందమామరావే…జాబిల్లి రావే…కొండెక్కి రావే…గోగి పూలు తేవే….ఇవన్నీ చిన్నప్పుడు మనం అందరం అమ్మ నోటి నుండి విన్నాం. అయితే నిజంగా చందమామ రాదు. మనమే అక్కడకు వెళ్ళాలి. 1969 వరకూ ఇది ఒక స్వప్నం. కల నిజమైన వేళ : ‘‘మనిషికి ఇదొక చిన్న అడుగే కానీ, మానవాళికి గొప్ప ముందడుగు’’ చంద్రుని మీద కాలుమోపిన తర్వాత నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ అన్న మాట ఇది. 1969 జులై 20న నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుని మీద అడుగుపెట్టారు. అమెరికా వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఎడ్విన్‌ బజ్‌ ఆల్డ్రిన్‌ 20 జూలై 1969న చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి మానవులుగా చరిత్రకెక్కారు.

అంతర్జాతీయ చంద్ర దినోత్సవం: అపోలో 11 మిషన్‌లో భాగంగా నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రునిపై దిగిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూలై 20 న అంతర్జాతీయ చంద్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. అంతర్జాతీయ చంద్ర దినోత్సవం చరిత్రలో మానవుడు మొదటిసారిగా చంద్రునిపై అడుగుపెట్టిన రోజుగా గుర్తించబడుతుంది. అంతర్జాతీయ చంద్ర దినోత్సవం యొక్క మొదటి ప్రపంచ వేడుక 20 జూలై 2022న జరిగింది.

అంతరిక్ష పరిశోధనలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి స్థిరమైన చంద్ర అన్వేషణను నిర్వహించడం ఎంత కీలకమో సాధారణ ప్రజలకు తెలియజేయడం లక్ష్యం. మూన్‌ విలేజ్‌ అసోసియేషన్‌ ప్రకారం అంతర్జాతీయ చంద్ర దినోత్సవం 2024 చంద్రుని యొక్క స్థిరమైన వినియోగం, అన్వేషణ, చంద్ర గ్రహంపై చుట్టుపక్కల కార్యకలాపాల నియంత్రణల ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం, ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ చంద్ర దినోత్సవం 2024 యొక్క థీమ్‌ ‘‘నీడలను ప్రకాశవంతం చేయడం.’’  మామ మీద మనిషి చరిత్ర: సోవియట్‌ యూనియన్‌ ద్వారా చంద్రునిపై ల్యాండ్‌ చేయడానికి మానవజాతి యొక్క ప్రయత్నాలు అంతరిక్షంలోకి ప్రారంభించబడ్డాయి.

1960ల చివరి నాటికి చంద్రునిపైకి మనిషిని పంపాలని అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌. కెన్నెడీ జాతీయ లక్ష్యం ప్రకటించిన ఎనిమిది సంవత్సరాల తర్వాత గ్రాండ్‌ అపోలో 11 మిషన్‌ జరిగింది. జూలై 20, 1969న, అపోలో 11 ఇద్దరు వ్యోమగాములను చంద్రుని ఉపరితలంపైకి తీసుకువెళ్లింది. 16 జూలై 1969 ఉదయం 9:32 గంటలకు  కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుండి ముగ్గురు వ్యోమగాములతో అపోలో 11 టేకాఫ్‌ అయింది. నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మిషన్‌ కమాండర్‌. మూడు రోజుల తర్వాత జూలై 19న అంతరిక్ష నౌక చంద్ర కక్ష్యలోకి ప్రవేశించింది. ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఆల్డ్రిన్‌లతో కూడిన చంద్రుని మాడ్యూల్‌ ‘‘ఈగిల్‌’’ మరుసటి రోజు ప్రధాన కమాండ్‌ మాడ్యూల్‌ నుండి విడిపోయింది.

ఈగిల్‌ చంద్ర ఉపరితలాన్ని తాకినప్పుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌ తన చారిత్రక సందేశాన్ని టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లోని మిషన్‌ కంట్రోల్‌కి ఈగిల్‌ దిగింది అనే సమాచారాన్ని పంపాడు. రాత్రి 10:56 గంటలకు ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుని ఉపరితలంపై అడుగు పెట్టాడు. శాస్త్ర సాంకేతిక రంగంలో సాధించిన అత్యంత అద్భుతమైన విజయం అది. తెలుసుకున్న నిజాలు: అపోలో 11 మిషన్‌ చంద్రుడు వేడిగా ఏర్పడిరదని అది కనీసం 800 మిలియన్‌ సంవత్సరాల పాటు మాగ్మాటిక్‌ గా యాక్టివ్‌గా ఉందని తెలిపింది. ఆ ప్రాజెక్టు ఫలితం మరెన్నో విజయాలకు, ఆవిష్కరణలకు నాంది పలికింది. ఆ మిషన్‌ కోసం అభివృద్ధి చేసిన సాంకేతికత ప్రస్తుతం మనకు నిజజీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. (నేడు అంతర్జాతీయ చంద్ర దినోత్సవం)
డి.జె మోహనరావు
యం.ఎస్సీ(ఫిజిక్స్‌) టీచర్‌, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా,ఆంధ్రప్రదేశ్‌,8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page