పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 17: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని పటాన్చెరువు పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది.ఈ మేరకు మంగళవారం పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ కు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి, ఏకగ్రీవ తీర్మానం కాపీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పటాన్చెరు పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఎన్నికలో తన వెన్నంటే నిలవడం సంతోషకరంగా ఉందన్నారు. నాయి బ్రాహ్మణ కుటుంబాలు ఏకగ్రీవంగా తెలపడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో నాయి బ్రాహ్మణుల సంక్షేమం కోసం పెద్దపీట వేయడంతో పాటు, హెయిర్ సెలూన్లకు ప్రతినెలా ఉచితంగా 250 యూనిట్లు విద్యుత్ అందించడం జరుగుతుందని తెలిపారు. దీంతోపాటు బీసీ బందు పథకం ద్వారా అరువైన వారందరికీ స్వయం ఉపాధి కోసం ఎలాంటి షరతులు లేకుండా లక్ష రూపాయలు ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ బిఆర్ఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, గూడెం మధుసూదన్ రెడ్డి, నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షులు శ్యామ్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి వినోద్, నారాయణ, చంద్రయ్య, నర్సింగరావు, వెంకటేష్, నిరంజన్, దినేష్ కుమార్, విష్ణు, పద్మనాభం, శివ, తదితరులు పాల్గొన్నారు.