- బడులు, గుడులు కట్టించి స్వంత ఊరు రుణం తీర్చుకోండి
- అమెరికా పర్యటనలో ఎన్నారైలతో కెటిఆర్ ముఖాముఖి
ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 23 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకంపై ఎన్ఆర్ఐలతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధిలో వారందరి భాగస్వామ్యం ఉండాలన్నారు. ‘మీకు మించిన బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరూ ఉండరు. తెలంగాణ గురించి వి•రే గొప్పగా ప్రచారం చేయగలరు. అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం. మనం చదువుకున్న పాఠశాల అభివృద్ధికి మన వంతుగా సహాయం చేయాలి’ అని కెటిఆర్ అన్నారు. గుడులు కట్టించే వారు గుడులను కట్టించండి.. బడులు కట్టించే వారు బడులు కట్టించండి.. లైబ్రరీలు కట్టించే వారు లైబ్రరీలు కట్టించండి.. దీని వల్ల స్థానికుల నుంచి వొచ్చే కృతజ్ఞత మరిచిపోలేనిదిగా ఉంటుందన్నారు. విద్యావ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణలో కేవలం మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. అలా వైద్య విద్యతో పాటు స్కూల్ ఎడ్యుకేషన్‌ను పటిష్టం చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. రూ. 7,230 కోట్లతో తెలంగాణలోని 26 వేల పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకరణం కట్టుకుందని కేటీఆర్ తెలిపారు. ‘ఈ విద్యా యజ్ఞంలో వి•రు కూడా పాలు పంచుకోవాలి. నా మాతృభూమి కోసం, నా గ్రామం, పట్టణం కోసం.. నేను ఏదైనా చేయాలి.. చేస్తే బాగుంటుందని, అవసరమైతే నా తల్లిదండ్రుల పేరు వి•దో, నా గ్రాండ్ పేరెంట్స్ పేరు మీదో ఏదో చేయాలనుకుంటే ఈ విద్యాయజ్ఞంలో పాల్గొనే అవకాశం ఉంది.
మీ మీద ఆధారపడి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కాదు. విద్యా రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రయివేటు వ్యక్తుల సహకారం కోసమే ఇది’ అని కెటిఆర్ చెప్పారు. మీకు ఇష్టమున్న పాఠశాలను ఎంపిక చేసుకొని అభివృద్ధి చేయొచ్చన్నారు. ఇది ఒక అద్భుత అవకాశం అని కేటీఆర్ పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నా మని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కనీస సదుపాయాలపై దృష్టి సారించామని స్పష్టం చేశారు. దేశానికి నిధులు సమకూరుస్తున్న నాలుగో అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ‘కొరోనా సమయంలోనూ 14 శాతం వృద్ధిరేటు నమోదు చేశాం. దేశ జనాభాలో తెలంగాణ 12వ స్థానంలో ఉంది. తెలంగాణ ఏర్పడే నాటికి కరెంట్ కోతలతో తెలంగాణ అల్లాడుతుంది. కరెంట్ సమస్యను సీఎం కేసీఆర్ తొలి ఆరు నెలల్లోనే పరిష్కరించారు.
విద్యుత్ వ్యవస్థాపక సామర్థ్యం 7 వేల మెగావాట్ల నుంచి 16 వేల మెగావాట్లకు పెంచాం’ అని మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా తెలిపారు. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నామని, ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును నాలుగేండ్ల లోనే పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తున్నామని, తద్వారా తెలంగాణ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, పంజాబ్‌తో సమానంగా వరి ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఒకప్పటి కరువు నేల నేడు దేశానికి అన్నపూర్ణగా మారిందన్నారు. ఇదంతా కేసీఆర్ సమర్థవంతమైన పాలన వల్లే సాధ్యమైందన్నారు. టీఎస్ ఐపాస్ చట్టం అమలు చేసిన తర్వాత తెలంగాణకు పరిశ్రమలు తరలివచ్చాయని, ప్రపంచ స్థాయి కంపెనీలు తమ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.