ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా..అహంకారం దరి చేరనీయ
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వేములవాడను అన్ని విధాలా అభివృద్ధి
రాజకీయాలకు అతీతంగా సమష్టిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి
వేములవాడ ‘కృతజత’ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్
కుల, వృత్తి సంఘాల నాయకులకు మంత్రి సన్మానం
వేములవాడ, ప్రజాతంత్ర, జూలై9 : తాను ప్రజలు తయారు చేసిన కార్యకర్తనని, కింది స్థాయి నుండి ఎదిగిన వ్యక్తినని, ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, కుల సంఘాల నాయకులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. తనను గెటిపించిన వారికి సాయం చేయడం బాధ్యతగా భావిస్తానే తప్ప ఎన్నడూ అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించనని స్పష్టం చేశారు. తన బాధ్యతను ఎన్నడూ వారిపై పెట్టనని, కానీ వారి బాధ్యతలను తాను మోసేందుకు సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ అన్నారు.
కేంద్ర మంత్రిగా ఉన్నందున వేములవాడ నియోజకవర్గ అభివృద్దికి ఎక్కువ నిధులు తీసుకు వొచ్చి అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సిద్ధమని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసుకుందామని సంజ్ అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు కృతజతలు తెలిపేందుకు వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభకు బండి సంజయ్ హాజరై వివిధ కుల, వృత్తి సంఘాల నాయకులను సన్మానించారు.
ఈ సందర్భంగా సభకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ…తనను భారీ మెజారిటీతో గెలిపించిన అందరికీ రెండు చేతులు జోడిరచి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. నరేంద్ర మోదీని ప్రధాన మంత్రిని చేయడంలో అందరి భాగస్వామ్యం ఉందన్నారు. భారీ మెజారిటీతో తనను గెలిపించినందునే తనకు ప్రధాని మోదీ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారని, ప్రజల నమ్మకాన్ని తాను ఎన్నడూ వమ్ము చేయనని అన్నారు.
కొన్ని పార్టీలకు బాంబు పేలుళ్లు లేవని, అర్ధరాత్రి నక్సలైట్ల హత్యల్లేవని బోర్ కొడుతుందట అంటూ ఎద్దేవా చేశారు. అవేమీ లేకుండా చేసిన వ్యక్తి మోదీ అని, ఒకవేళ మోదీ ప్రభుత్వం లేకుంటే 370 ఆర్టికల్ రద్దు చేసే సాహసం ఎవరూ చేసేవాళ్లు కారన్నారు. మొన్నటి వరకు పార్లమెంట్ చేసే చట్టాలు జమ్మూకాశ్మీర్‌లో వర్తించేవికాదని, భారతీయ జెండా ఎగిరేది కాదని, అందుకే 370 ఆర్టికల్‌ను రద్దు చేసినమని, ఇప్పుడు అక్కడ అభివృద్ది శరవేగంగా జరుగుతుందని, అయోధ్యలో రామ మందిర నిర్మాణం మోదీ సర్కార్ తోనే సాధ్యమైందన్నారు.
ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తరువాత అభివృద్ది, ప్రజా సంక్షేమమే బీజేపీ ధ్యేయమన్నారు. కేంద్రం వేములవాడ ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు సానుకూలంగా ఉన్నానని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సహకరించలేదని అన్నారు.ఈ సారి తాను కేంద్ర మంత్రినయ్యానని, వెంటనే రాజన్న ఆలయ అభివృద్ది కోసం కేంద్ర పర్యటన, సాంస్క్రతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశానని, ఆయన కూడా సానుకూలంగా ఉన్నారన్నారు.
నియోజకవర్గంలోని ఎమ్మెల్యే సహా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొండగట్టు, రాజన్న ఆలయాలను అభివృద్ది చేసి తీరుతానని ఆన్నారు. ఈ విషయంలో అందరూ కలిసి రావాలని బండి కోరారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కువ నిధులు తీసుకుని వొచ్చి అభివృద్ధి చేస్తానని, అందరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెన్నమనేని వికాస్, జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ, బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్ తదితరులు ఉన్నారు.