మీరే సిఎంగా ఉన్నా మునుగోడు ఎందుకు వెనకబడ్డది

  • చేనేతపై 5 శాతం జిఎస్టీ ఒప్పుకున్నది మీరే కదా
  • చేనేత సంఘాలకు ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదు
  • సిఎం కెసిఆర్‌కు బండి సంజయ్‌ ‌ఘాటు లేఖ
  • లేఖలో జిఎస్‌టిపై చర్చకు సిద్ధమని సవాల్‌

‌మునుగోడు ఉపఎన్నికల వేళ…సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లేఖ రాశారు. తెలంగాణ ప్రజలు, మునుగోడు వోటర్ల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ‌ప్రశ్నలకు జవాబు చెప్పాలని లేఖలో డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ ఏర్పడ్డ నుంచి మీదే ప్రభుత్వం, మీరే ముఖ్యమంత్రి, తొలిటర్మ్ (2014- 18)మీ పార్టీకి చెందిన ప్రభాకర్‌రెడ్డే ఎమ్మెల్యే! 8 ఏళ్ల మీ పాలనలో మునుగోడును ఏం అభివృద్ధి చేశారో చర్చకు సిద్దమా.అని ప్రశ్నించారు. మీ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి, మా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో బహిరంగ చర్చను నిర్వహిద్దాం. తేది, వేదిక, సమయం ఖరారు చేయండి! దీనికి మీరు సిద్ధమా అని సవాల్‌ ‌చేశారు. జీఎస్టీకి సంబంధించి కేంద ప్రభుత్వం నిర్వహించిన అనేక సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు,మీ సుపుత్రుడు కేటీఆర్‌ ‌పాల్గొని చేనేత ట్రైనింగ్‌పైన 5శాతం జీఎస్టీకి ఒప్పుకున్న మాట వాస్తవం కాదా? మీరు, మీ సుపుత్రుడు ‘డ్రామారావు‘ ఆడుతున్న దొంగనాటకాలను రుజువులతో సహా నిరూపించడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? దీనిపైన మీరు, మీ కుమారుడు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్దమా అని ప్రశ్నించారు.

కేందప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం 40 లక్షల వరకు జీఎస్టీ లేదు. చేనేత కార్మికులపైన మీకు నిజంగా ప్రేమ ఉంటే 20 లక్షలకే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జీఎస్టీ విధిస్తుంది. దీనికి మీరు, చేనేత కార్మికులపై కపట ప్రేమ వలకబోస్తున్న ‘డ్రామారావు‘ సమాధానం చెప్పాలన్నారు. చేనేత సహకార సంఘాలకు క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన తరువాత ఈ 8 ఏండ్లకాలంలో ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. చేనేత కార్మికుల సంక్షేమంపై మీకు ఉన్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు. పోచంపల్లి చేనేత బజారు స్థలం కబ్జా అయ్యిందని అనేక సంవత్సరాలుగా చేనేత కార్మికులు పోరాడుతున్నారు. దీనిపైన మీకు, మీ సుపుత్రుడు ‘డ్రామారావు‘ కు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చారు.

అయినా ఈ సమస్యను పరిష్కరించి కబ్జా స్థలాన్ని వారికి అప్పజెప్పలేదు. ఇదేనా మీకు పద్మశాలీల మీద ఉన్న ప్రేమ అని అన్నారు. చేనేత కార్మికులపై మీప్రభుత్వానికి ప్రేమ ఉంటే టెస్కోకు చైర్మన్‌, ‌డైరెక్టర్‌ ‌లను ఎందుకు నియమించడం లేదని అన్నారు. మీకు నిజం చెప్పకూడదనే శాపం ఏమైనా ఉందా? ఏనాడూ మీరు నిజం చెప్పరు? ప్రతినిత్యం ఝూఠా మాటలతో 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారు. కనీసం మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగానైనా నిజాలు మాట్లాడి ఇప్పటివరకు మీరు మాట్లాడిన ఝూఠా మాటలకు చెంపలేసుకుని క్షమాపణ చెప్పండని బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page