సఫాయి అన్నా మీకు సలాం..అధికారులు, సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నా..
సర్వేక్షన్‌లో సిద్ధిపేటకు క్లీన్ సిటీ అవార్డుతో కార్మికులకు సన్మానం
జాతీయ స్థాయిలో సిద్ధిపేటకు అవార్డు వొచ్చినా
అభినందించే సంస్కృతిలేని కాంగ్రెస్ ప్రభుత్వం:ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సఫాయి కార్మికులకు సలాం అని…మునిసిపల్ అధికారులు, సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నాననీ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. స్వచ్ సర్వేక్షన్‌లో దక్షిణ భారతదేశంలోనే సిద్ధిపేటకు క్లీన్ సిటీ అవార్డు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సన్మానించారు. స్వీటు తినిపించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ… ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..ఈ సంక్రాంతి మీతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. క్లీనెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియాగా సిద్ధిపేట అవార్డు(చెత్త సేకరణలో సమర్ధవంతంగా నిర్వహణ)సాధించడం మన అందరికీ గర్వకారణమన్నారు. ఇందుకు కృషి చేసిన మునిసిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందికి అభినందలన్నారు. పారిశుద్ధ్య కార్మికుల వల్లే అవార్డు వచ్చిందనీ, ఈ అవార్డు కార్మికులు, ప్రజలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు సామాజిక వైద్యులనీ, శు(సి)ద్ధిపేట స్ఫూర్తి నిరంతరం కొనసాగాలనీ, ప్రజల భాగస్వామ్యం లేనిది, అనుకున్న లక్ష్యం నెరవేరడం సాధ్యం కాదనీ, సిద్ధిపేట వారి సొంత ఇంటిగా భావించి శుద్దిపేటగా నిలబెట్టారన్నారు. వైద్యులు రోగాలు వచ్చిన తర్వాత చికిత్స అందిస్తే, పారిశుద్ధ్య కార్మికులు రోగాలు రాకుండా కాపాడుతున్న సామాజిక వైద్యులు అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో రోడ్లు క్లీన్‌గా ఉంటాయనీ, అక్కడ పరిశుభ్రత బాగుంటుందని అంటుంటారనీ, నిజమే అక్కడ క్లీన్‌గా ఉంటాయన్నారు. అయితే, అది అధికారులు లేదా అక్కడి ప్రజా ప్రతినిధుల ఘనత మాత్రమే కాదు, ప్రజల గొప్పతనం కూడా అన్నారు. చెత్త వేయడం సఫాయి వారు వచ్చి తీయటం కాదు. అసలు చెత్తను అక్కడి ప్రజలు రోడ్ల మీద వేయరు. చాక్లెట్ కవర్ అయినా జేబులో పెట్టుకొని వెళ్లి డస్ట్ బిన్‌లో వేస్తారన్నారు. సిద్దిపేట ప్రజలు కూడా అలా ఉన్నతంగా ఆలోచించే స్థాయికి వెళ్లారనీ, ఒకనాడు ఒక ఆటో డ్రైవర్ తమ్ముడు మాట్లాడే వీడియో చూసా. కొత్తగా సిద్దిపేటకు వచ్చిన ఓ ప్యాసింజర్‌కు చాక్లెట్ కవర్ అయినా, చిత్తు కాగితం అయినా డస్ట్ బిన్‌లోనే వేస్తాం అని చెప్పడం చూశానని అన్నారు. అది విన్నప్పుడు నాకు కడుపు నిండిన సంతోషం కలిగింది. ప్రజల్లో ఇంత పెద్ద మార్పు రావడం వెనుక అధికారులు, ప్రజా ప్రతినిధుల కృషి ఉంది. మీకు అభినందనలు అన్నారు. ఒకప్పుడు సిద్ధిపేట అంటే పందులు, చెత్త చెదారం, ఎక్కడ చూసినా దుర్గందం, దుర్వాసన. ఇప్పుడు సిద్ధిపేట అంటే స్వచ్చత, పరిశుభ్రత, పచ్చదనం, సిద్ధిపేట నేడు శుద్ధిపేటగా మారిందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు కష్టం నేడు సిద్దిపేట పరిశుభ్ర పట్టణమైందన్నారు. భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీలకు, అత్యుత్తమ పట్టణాలకు అవార్డులు ప్రకటిస్తున్నారంటే అందులో సిద్దిపేట పేరు ఉండాల్సిందేననీ, అవార్డు రావడంలో ప్రజల భాగస్వామ్యం ఒక వైపు… ప్రజాప్రతినిధులు చొరవ ఒక వైపు… కార్మికుల కష్టం మరో వైపు ఉందన్నారు. సిద్దిపేట ప్రజల సహకారం ఎంతో గొప్పది… ఈరోజు వారు ప్రతి పనిలో అందిస్తున్న కృషితోనే అందుకున్న ప్రతి ఫలం అన్నారు. అవార్డు అంటే సిద్దిపేట… సిద్దిపేట అంటే అవార్డు అనే స్థాయిలో సిద్దిపేట చేరింది అంటే అది మీ అందరి కృషి ఉందన్నారు. చేయి… చేయీ కలిపి… సమిష్టి కృషి చేసి నేడు సిద్దిపేట ఆదర్శ పట్టణంగా చేసుకున్నామన్నారు. నడుద్దాం… నడుస్తూ చెత్తను వేరు చేద్దాం అంటూ కలిసి కట్టుగా కౌన్సిలర్స్ తెచ్చిన చైతన్యం ఈ అవార్డు కు నిదర్శనమనీ, ఈ కార్యక్రమం కొనసాగాలన్నారు. ఇది ఇలాగే కొనసాగాలి. దేశంలోనే పరిశుభ్రమైన పట్టణం ఏది అంటే తెలంగాణలో ఉన్న సిద్దిపేట అని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరాలన్నారు. రాష్ట్రంలో ఒకే ఒక్క మున్సిపాల్టీకి జాతీయ స్థాయి అవార్డు ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి అభినందనలు తెలపని పరిస్థితి అని, బిఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ అవార్డు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పిలిచి అభినందించే సంస్కృతి ఉండేదన్నారు. 2023 సంవత్సరంలో దేశం లో 4416మున్సిపాల్టీలో 9స్థానంలో హైదరాబాద్ నిలిస్తే.. మన దక్షిణ భారత దేశంలో సిద్దిపేట ఫస్ట్ నిలిచిందన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరుపున అభినందన ట్వీట్, ప్రెస్‌నోట్ కూడా నోచుకోలేని దుస్థితిలో ఉన్నామనీ, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి… మనం ప్రజల వైపు నడుద్దామని ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్‌పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, వైస్ ఛైర్మన్ జంగిటి కనకరాజు, కమిషనర్ సంపత్‌కుమార్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, మునిసిపల్ అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.