మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 04 : ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూసే పేదల మనిషి అని, దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తున్నారని, ఈ విషయంలో అనేక పథకాలు రూపొందించి వాటిని విజయవంతంగా కొనసాగించడం జరుగుతోందని, పేదల పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మేడ్చల్ నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు గృహలక్ష్మీ పథకంకు చెందిన ఉత్తర్వులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రణాళికబద్దంగా ఆయా కార్యక్రమాలు చేపట్టి వాటిని విజయపథంలో దూసుకెళ్ళేలా చేయడం జరుగుతోందన్నారు. అలాగే గృహలక్ష్మీ పథకం కింద దరఖాస్తులు చేసుకొన్న వారు ఎలాంటి ఆందోళన చెందవద్దని మరో విడతలో వారికి కూడా వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ లు, గృహలక్ష్మీ పథకం కింద రూ.3 లక్షలు అందచేయడం జరుగుతుందని, ఈ విషయంలో ఎలాంటి నిరాశకు గురికావద్దని తెలిపారు. దీంతో పాటు మేడ్చల్ నియోజకవర్గంలో 26 వేల డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయని అందులో పది శాతం స్థానికులకు అందేలా అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మేడ్చల్ నియోజకవర్గంలో చేపడుతన్న కార్యక్రమాలన్నీ విజయవంతమవుతున్నాయని ఇది ఎంతో సంతోషకరమని ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారం వల్ల సాధ్యమవుతుందని వారిని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఒక్కరినీ ధనవంతులను చేయాలనే మంచి సంకల్పంతో దళితబంధు, గృహలక్ష్మీ, బీసీబంధుతో పాటు అనేక రకాల పథకాలతో పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి అని అన్నారు. దళితబంధు పథకం లబ్ధిదారులకు, బీసీ బంధు పథకం ద్వారా తన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందచేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం గృహలక్ష్మీ పథకం కింద మొదటి విడతగా మూడువేల మందికి లబ్ధి చేకూర్చడం జరిగిందని, వీటితో పాటు ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధు వంటి పథకాలు సైతం నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, రోడ్లు భవనాల శాఖ ఈఈ శ్రీనివాసమూర్తి, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..