మరో పదిరోజుల్లో జరుగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో సమీకరణాలు,విజయావకాశాలు రోజు రోజు కు మారుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు వెలిబుచ్చిన అభిప్రాయం నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న మునుగోడు ఎన్నిక సందర్భంగా ఆ పార్టీకి గొడ్డలి పెట్టుగా మారింది. రోగి చనిపోయేవరకు ఏం ఫరవాలేదని డాక్టర్లు ధైర్యం చెబుతారు. అలాగే ఏ రాజకీయ పార్టీ అయినా తన స్థోమత సరిపోకున్నా తాను పోటీ చేసే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని చెబుతుంది. కాని, తాము ఓడిపోతామని ముందుగానే ప్రకటించడమన్నది ఒక కాంగ్రెస్‌లో సాధ్యపడుతుంది. ఎందుకంటే నూటా ముప్పై ఏండ్ల వృద్ధ కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి. క్రిందిస్థాయి కార్యకర్త మొదలు సీనియర్ నాయకుడి వరకు ఎవరైనా ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ ఒక్క కాంగ్రెస్ పార్టీకే సొంతం . కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఈ స్వేచ్ఛ మరింత ఎక్కువైంది. ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ దేశంలో అధికారం లో ఉన్న ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైంది.
అందుకు కేంద్రంనుండి మొదలు వివిధ• రాష్ట్రాల్లో పార్టీలో ఏర్పడిన అంతర్గత కలహాలే కారణమన్నది బహిరంగ రహస్యమే. తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే వీటన్నిటికీ అతీతంగా వ్యవహరించి పార్టీకి పూర్వ వైభవాన్ని తెస్తారన్న ఆశ ఆ పార్టీలో ఏర్పడింది. దానికి తగినట్లు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర వివిధ రాష్ట్రాల్లో పార్టీ వర్గాల అసంతృప్తి వాదులందరినీ సంఘటితం చేస్తుందన్న ఆశకూడా ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇక తెలంగాణ విషయానికి వొస్త్తే… వర్గ విభేదాలన్నది కాంగ్రెస్ పార్టీలో సహజమేనన్నది చెప్పకనే చెబుతాయి. పార్టీ తన పూర్వ వైభవాన్ని ప్రదర్శించుకునేందుకు వొచ్చిన ఒకటి రెండు అవకాశాలను ఇప్పటికే జార విడుచుకుంది. హుజురాబాద్, దుబ్బాకలో గట్టి పోటీని ఇవ్వలేకపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడా పార్టీకి మునుగోడు మరో అవకాశంగా మారింది. విచిత్రమేమంటే మునుగోడు కాంగ్రెస్ సిట్టింగ్ నియోజకవర్గం కావడం. కాంగ్రెస్ నుంచి గెలిచిన స్థానిక ఎంఎల్‌ఏ అకారణంగా పార్టీ సభ్యత్వానికి, శాసనసభ్యత్వానికి రాజీనామాచేసి, మరో పార్టీ కండువతో పోటీకి సిద్దపడడమన్నది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారింది. ఎలాగైనా తమ నియోజకవర్గాన్ని కాపాడుకోవాలన్న పట్టుదలతో ఆ పార్టీ రంగంలోకి దిగింది. పోటీలో ఉన్న రెండు ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్, బిజెపిని ఢీ కొనడం కాంగ్రెస్‌కు అంతసులభమేమీ కాదు. అయినా తన శక్తివంచన లేకుండా ప్రచారంలోకి దూసుకుపోతున్నది.
మిగతా పార్టీలకన్నా ముందుగానే తన అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులతో సమానంగా ధనవ్యయం చేయలేకపోయినా, పై రెండు పార్టీలమాదిరిగా అంగ బలాన్ని కూడా ప్రదర్శించలేకపోతున్నది. ముఖ్యంగా స్థానిక నాయకత్వమే అభ్యర్థికి సహకరించకపోవడంతో గెలుపు ప్రశ్నార్థకంగా మారుతున్నది. నల్లగొండ అనగానే గుర్తుకు వొచ్చేది కోమటిరెడ్డి బ్రదర్స్. వీరిద్దరూ గత రెండున్నర దశాబ్ధాలుగా ఇక్కడ తిరుగులేని కాంగ్రెస్ నాయకులు. పిసిసి అధ్యక్షులుగా రేవంత్‌రెడ్డి ఎంపికైనప్పటినుండి వీరిలో ఆసంతృప్తి మొదలయింది. అన్నదమ్ములిద్దరిలో ఎవరికి ఆ పదవి అప్పగించినా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువొస్తామని వారు బహిరంగంగానే ప్రకటించడం ఒకటైతే అప్పటినుండి పార్టీ కార్కక్రమాలపట్ల అంటీ ముట్టనట్లుగా వీరు వ్యవహరిస్తూ వొస్తున్నారు.
మునుగోడు శాసనసభ్యుడిగా కొనసాగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక వైపు రేవంత్‌రెడ్డి నాయకత్వంకింద పనిచేయాల్సిరావడం ఇష్టంలేకపోవడం, మరో పక్క తన ఆర్థిక లావాదేవీలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పంచన చేరడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే అప్పటికే రేవంత్ రెడ్డితో విభేదిస్తున్న ఆయన సోదరుడు భువనగిరి ఎంపి అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైఖరిలో కూడా మార్పు వొచ్చింది. ముదిగోడు ఎన్నికలకు సంబంధించి పార్టీ ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరు కాకపోవడమేగాక, పార్టీలోని ముఖ్యనేతలు అద్దంకి దయాకర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ లాంటివారితో వివాదపడ•డం, వారిని పార్టీనుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడమన్నది ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారింది. వీటన్నిటికి పరిష్కార మార్గంగా పార్టీ అధిష్టానం అయన్ను పార్టీ స్టార్ క్యాంపెయిన్ హోదా కల్పించి శాంతింపజేసింది. మునుగోడులో కాంగ్రెస్ ప్రత్యర్థి, బిజెపి అభ్యర్థి తన సోదరుడు కావడంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పక్షాన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే విషయాన్ని అయన సస్పెన్స్‌లో పెట్టారు.
నాయకులు, కార్యకర్తలు, మీడియా వొత్తిడితో ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించడంతోపాటు, అభ్యర్థిని స్రవంతి తలనిమిరి ఆశీర్వదించడంతో ఇక ఆయన రాకతో కాంగ్రెస్‌కు బలం ఏర్పడుతుందనుకున్నారు. కాని, ఆయన కుటుంబ సభ్యులతో ఈ నెల 15న అస్ట్రేలియా చెక్కేశారు. తిరిగి ఎన్నికలు అయిన తర్వాత అంటే నవంబర్ ఏడున అంటే ఎన్నిక ఫలితాలు వెలువడిన మరుసటి రోజున రాష్ట్రానికి చేరుకోనున్నట్లు తెలుస్తున్నది. అయితే ఆస్ట్రేలియాలో ఆయనను రిసీవ్ చేసుకోవడానికి వొచ్చిన వారితో ఓడిపోయే స్థానానికి ప్రచారం చేయలేకనే వొచ్చానని ఆయన చెప్పినట్లుగా సోషల్ మీడియాలో రావడం ఆ పార్టీ వర్గా)కు పెద్ద షాక్ ఇచ్చింది. తాను ప్రచారం చేస్తే మరికొన్ని వోట్లు ఎక్కువ వొస్తాయేమోగాని గెలిచే అవకాశాలు లేవని స్పష్టంచేసినట్లు సోషల్ మీడియా కథనాలు. ఎన్నికలకు ముందే ఆయన జోస్యం చెప్పడంపట్ల రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామలను చూస్తుంటే తమ్ముడి బాటలోనే అన్న పయనించే అవకాశాలు లేకపోలేదన్న టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తున్నది.