మొయినాబాద్ ఘటన మునుగోడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల కింది వరకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలుపు తమదేనంటే తమదని ధీమాను వ్యక్తం చేస్తూ వొచ్చాయి. అయితే మొయినాబాద్ సంఘటన ఒక్కసారే అన్ని పార్టీలను కుదిపేసింది. ఈ ఘటన ఆయా పార్టీల అంచనాలను తలకిందులు చేసేదిగా మారింది. ఇతర పార్టీల సంగతి ఎలాఉన్నా మునుగోడులో ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోటీ విస్తృతంగా సాగుతున్నది. ఈ మూడు పార్టీలు కూడా ఎవరికి వారు తమదే గెలపని, మిగతా రెండు పార్టీలు రెండవ స్థానంలో ఉంటాయని చెప్పుకుంటున్నాయి. అయితే ఇక్కడ ఎన్నికల తేదీ ప్రకటించక ముందు నుండే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన ఈ పార్టీలు ఆరోపణలు, తిట్ల పురాణాలకే పరిమితంకాగా మొయినాబాద్ ఘటన మొత్తం వాతావరణాన్నే మార్చేసింది. ఈ ఘటనతో ఇప్పుడు బిజెపి, టిఆర్‌ఎస్ మధ్య పోటీ తీవ్రతరమవడానికి కారణంగా మారింది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఉప ఎన్నిక ద్వారా తమ సత్తా చూపించుకోవాలన్న లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న భారతీయ జనతాపార్టీకి ఈ ఘటన కునుకులేకుండా చేసింది. పోటీ తీవ్రతరంగా మారుతున్న క్రమంలో అధికార టిఆర్‌ఎస్ రచించన ఉచ్చులో బిజెపి చిక్కుకు పోయింది. ఉచ్చు చిక్కుముడిని విప్పదీసుకునేందుకు బిజెపి ఇప్పుడు నానా తంటాలు పడాల్సి వొస్తుంది.
తన నిజాయితీని నిరూపించు కోవడానికి ఆ పార్టీ ఉన్నత న్యాయస్థానం తలుపులు తట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత రెండు మూడు రోజులుగా మీడియాలో విస్తృత ప్రచారమవుతున్న ఆడియో టేపులు బిజెపిని వేలెత్తి చూపుతున్న నేపథ్యంలో కేంద్ర స్థాయి నాయకుల నుండి, రాష్ట్ర నాయకులకు ఎన్నికల కన్నా ఈ అంశమే ప్రధానమయింది. అనూహ్యంగా స్కైలాబ్‌లా వొచ్చి మీదపడిన ఈ నింద నుండి బయటపడేందుకు ఆ పార్టీ పడరాని తంటాలు పడాల్సి వొస్తుంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొయినాబాద్ ఘటనకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ తడిబట్టలతో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి పాదాలముందు ప్రమాణం చేశారు. తమను ఈ కేసులో ఇరికించిన టిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా తనలాగా స్వామి ముందు ప్రమాణం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఇటీవల జరిగిన సంఘటనలు మాత్రం బిజెపిని వేలెత్తి చూపేవిగా ఉన్నాయంటున్నాయి టిఆర్‌ఎస్ శ్రేణులు. టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలను కొనుగోలు కోసం వొచ్చినట్లుగా చెబుతున్న ఇద్దరు స్వామీజీలతోపాటు, మరో హైదరాబాద్ వ్యక్తి సెల్‌ఫోన్ సంభాషణ బిజెపికి వ్యతిరేకంగా ఉండటం ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద చిక్కును తెచ్చిపెట్టింది.
అందులో స్పష్టంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రకు సంబంధించన సంభాషణ దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎన్నికల తర్వాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండదని జోస్యం చెప్పడం, ఆ పార్టీ ఎంపి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌లు తరుచూ టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏలు పలువురు తమ సంప్రదింపులో ఉన్నట్లుగా పలు సందర్భాల్లో చెప్పడాన్ని ఈ సంఘటనకు టిఆర్‌ఎస్ శ్రేణులు అన్వయిస్తున్నాయి. అయితే నిందితులుగా భావిస్తున్న వారి చర్చ కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా కాంగ్రెస్ నుండి వొచ్చేవారి గురించి, వివిధ రాష్ట్రాల్లో ఆకర్ష్ పథకాన్ని ఎలా అమలు పర్చబోతున్న విషయాలపైన కూడా సాగడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే బిజెపి మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నది. ఆడియో టేపులు టిఆర్‌ఎస్ సృష్టించినవని, వాస్తవంగా ఎంఎల్‌ఏలను కొనడానికి వొచ్చిన వారిగా చెబుతున్న వారితో తమ పార్టీకి ఎలాంటి సంబంధాలు లేవని బిజెపి ఘోషిస్తున్నది. ఏదియేమైనా ఇప్పుడు ఈ కేసు న్యాయస్థానం పరిధిలోకి చేరిపోయింది. వాస్తవమేంటన్నది న్యాయస్థానంలో నిగ్గు తేలనున్నప్పటికీ మొయినాబాద్ ఘటన మునిగోడులో ఎన్నికలో ఏ మేరకు ప్రభావం చూపనుందన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చగా మారింది. అన్ని పార్టీలు ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
దీనిపైనే రాష్ట్ర భవిష్యత్ తేలనుందన్న భావన అందరిలో ఏర్పడింది. అలాంటి స్థితిలో ఇక్కడ ఎన్నికల ప్రచారం నవంబర్ ఇకటవ తేదీన ముగియనుంది. మధ్యలో కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. తీవ్రంగా పోటీ పడుతున్న బిజెపి, టిఆర్‌ఎస్ పోటాపోటీగా బహిరంగ సభలను నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ముందుగా టిఆర్‌ఎస్ అదినేత కేసిఆర్ బహిరంగ సభ అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సభ జరుపాలనుకున్నారు. కాని కొండ విరిగి మీద పడ్డట్లు కొత్త ఎపిసోడ్ వెలుగులోకి వచ్చేసరికి బిజెపి వెనక్కు తగ్గింది. భారీ స్థాయి బహిరంగ సభ బదులుగా మండలాల్లో ముఖ్యనేతలతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ ప్లాన్ మార్చుకుంది. ఇది ఒక విధంగా బిజెపి శ్రేణును నిరాశ పరుస్తున్న అంశం. విచిత్రమేమంటే ఈ ఎపిసోడ్‌తో ఎలాంటి సంబంధంలేకపోయినా కాంగ్రెస్ ప్రచారంలో కొంత వెనకబడింది. వాస్తవంగా రాష్ట్రంలో రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న క్రమంలో ఎంతో ఉత్సాహంగా ప్రచార కార్యక్రమం ఇక్కడ జరుగాల్సి ఉండగా, రాహుల్‌తో పాదయాత్రలో పాల్గొనేందుకు పలువురు ముఖ్యనాయకులు వెళ్లడంతో పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఒంటరి పోరు చేస్తుంది. ఈ మొత్తం పరిణామాన్ని బేరీజు వేసుకుని మునుగోడు వోటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.