పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 1: 76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసి, వారి జీవితాల్లో నవ శకానికి నాంది పలికిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జిన్నారం, గుమ్మడిదల బిఆర్ఎస్ పార్టీ మైనార్టీల సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు భారీ ర్యాలీతో ఘన స్వాగతంపలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. 65 సంవత్సరాలు పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం బిజెపిలు మైనార్టీల సంక్షేమానికి పాటుపడిన దాఖలాలు లేవన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం సీఎం కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించడంతోపాటు, పూర్తి పారదర్శకతతో పథకాలు రూపొందించారని తెలిపారు. ప్రధానంగా ఆడపిల్లల వివాహాలు పేదవాళ్లకు భారం కాకూడదన్న సమున్నత లక్ష్యంతో షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారని తెలిపారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 200 పైగా మైనార్టీ గురుకులాలను ప్రారంభించి విద్యార్థి దశనుండే అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం జరిగిందని తెలిపారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధికి నిధులు అందిస్తూ ఆర్థిక అభ్యున్నతికి కృషి చేశారని తెలిపారు. పటాన్ చెరు నియోజకవర్గం వ్యాప్తంగా సొంత నిధులతో 100కు పైగా మసీదులు ఆశిర్ఖానాలు ఈద్గాలు నిర్మించడంతోపాటు మైనార్టీ ఫంక్షన్ హాళ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వారి అభివృద్ధికి కృషి చేసిన పాపాన పోలేదని విమర్శించారు.కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తమ స్వప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య గొడవలను సృష్టిస్తోందని అన్నారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడినంతరం పది సంవత్సరాలుగా రాష్ట్రంలో గొడవలు, మత కల్లోహాలు లేని పరిపాలన అందించిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు బలపరచాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం గుమ్మడిదలలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుమార్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నరసింహారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మురళీ, ప్రభాకర్ రెడ్డి, శంకర్, మైనారిటీ విభాగం మండలాల అధ్యక్షులు గౌస్, ఖదీర్, మెరాజ్ ఖాన్, మోయిన్, పార్టీ అధ్యక్షులు షేక్ హుస్సేన్, మైనార్టీ మత పెద్దలు, పాల్గొన్నారు.