పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై ఇరిగేషన్ అధికారులకు సిఎం కేసీఆర్ అభినందనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 : బుధవారం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంపై విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ….‘‘తలాపున కృష్ణమ్మ పారుతున్నా..నాటి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వివక్షతో తాగునీరు సాగునీటికి నోచుకోక దశాబ్ధాల కాలం పాటు ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలు అనేక కష్టాలు, బాధలు, అరిగోసను అనుభవించినయన్నారు. ‘‘కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులను మొదలు పెట్టినట్టే పెట్టాలె….వాటిని ఆదిలోనే ఆపేసి పెండింగులో పెట్టాలె’ ఇదీ నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకుల వైఖరి. వొకనాడు సుసంపన్నంగా వర్థిల్లుతూ ఎంతో చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని సొంతం చేసుకున్న పాలమూరులో గంజి కేంద్రాలను నడిపించిన దుస్థితి నాటి ఉమ్మడి పాలకులది. నాటి వలస పాలనలో పాలమూరులో ఎటుచూసినా వలసలే తాండవించేవి. పాలమూరు అంటే దేశంలోనే వలస లేబర్‌కు పేరుగాంచిన దుస్తితినాడు. పాలమూరు నిండా బొంబాయి బస్సులు క్యూలు కట్టే దుస్థితి వుండేది.’’ అని సిఎం వివరించారు. ‘‘నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కూడా నీరు లేక కరువు తాండవమాడేది. సాగునీరు సంగతి దేవుడెరుగు తాగునీరు కూడా కల్పించలేని నిర్లక్ష్యపూరిత వివక్ష నాటి పాలకులది.’ అని సిఎం తెలిపారు. పాలమూరు జిల్లా ప్రజల బాధలను నాటి ఉద్యమ కాలంలో గోరెటి వెంకన్న వంటి పాలమూరు కవులు పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా అంటూ…చేతానమేడుందిరా తెలంగాణ చేలన్ని బీల్లాయెరా అంటూ పాటలు రాసిన సందర్భాన్ని సమీక్ష సందర్భంగా సిఎం గుర్తు చేశారు. ‘‘వలస పోయిన జనం…అనివార్యమైన పెండ్లికో..చావుకో వొచ్చుడు తప్ప తమ తమ స్వస్థలాలకు రాకపోదురు అంటూ నాడు ఉద్యమ కాలంలో పాటలు రాసి పాడిన సంధర్భాలు మరుద్దామన్నా మరుపురావు.
అరవై ఎకరాలున్న ఆసామీ కూడా అడవులు పట్టుకోని కూలీకి పోయిన దుస్థితినినే ను స్వయంగా చూసి దు:ఖపడ్డ. నీరులేక కరువుతో హృదయ విదారకమైన పరిస్థితి తాండవించేవి. రంగారెడ్డి ఉమ్మడి జిల్లా అత్యద్భుతమైన నేలలకు నెలవు. ఇక్కడి నేలలు కుంకుమ లాగా వుంటవి. అద్భుతమైన పంటలు పండే ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు.పసిడి పంటలతో నాడు సిరులు కురిపించే నేలలు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి పాలనలో సాగునీరు లేక కరువు పాలయింది,’ అని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పోరాడి తెలంగాణ తెచ్చుకున్నంక స్వయం పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. నూతన ప్రభుత్వం తక్షణమే పాలమూరు పరిథిలో నాటి ఉమ్మడి పాలకులు మొదలు పెట్టి పెండింగులో పెట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్ సాగర్ వంటి ప్రాజెక్టులను యుద్దప్రాతిపదికన పూర్తి చేసింది. దాంతో పాలమూరు జిల్లా పచ్చబడడం ప్రారంభమైంది. వలసలు ఆగిపోయినయి. బయటి రాష్ట్రాలనుంచే పాలమూరుకు ఉల్టా వలసలు ప్రారంభమైన చారిత్రక సందర్భం చోటుచేసుకున్నది.’’ అని జరిగిన ప్రగతిని సిఎం వివరించారు. ‘‘మరి చిన్న చిన్న పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటెనే ఇంతగొప్పగా పాలమూరు పచ్చబడ్డదంటే దక్షిణ తెలంగాణ దశ దిశను మార్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసుకుంటే ఇంకెంత గొప్పగా తెలంగాణలో అభివృద్ధి అవుతుందో వూహించుకోవచ్చు..’ అని సిఎం వివరించారు. అదే దార్శనికతతో ఎత్తిపోతలను ప్రారంబించాలని దృఢ సంకల్సంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభిస్తే అనేక అడ్డంకులు ప్రారంభమయ్యాయన్నారు.
స్వయానా పాలమూరు జిల్లా రాజకీయ నాయకులే వందలాది కేసులు పెట్టడం నిజంగా దురదృష్టకరమన్నారు. ‘‘ఇటువంటి నేతలు వుండడం పాలమూరు జిల్లా ప్రజలకు శాపం లా పరిణమించింది. రాజకీయాలు ప్రజల జీవితాలను గుణాత్మకంగా మార్చే దిశగా వుండాలి తప్ప..ఇట్లా వారిని జీవితాలను చిన్నాభిన్నం చేసే దిశగా తమ స్వార్థం కోసం ప్రజల జీవితాలను బలిపెట్టే దిశగా వుండకూడదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో సరిగ్గా అదే జరిగింది..’’ తలెత్తిన అడ్డంకుల గురించి వాటి కారణాల గురించి సిఎం వివరించారు. ‘‘అయినా మొక్కవోని పట్టుదలతో ధృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టింది. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సవాలుగా స్వీకరించారు. ఎన్ని అడ్డంకులనెదుర్కునేందుకయినా సిద్ధ పడి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్నిపూర్తిచేసేందుకు కంకణం కట్టుకున్నారు. వొక వైపు నిర్మాణం పనులను మరోవైపు న్యాయం సాధించేందుకు ప్రజలకు సాగునీరు తాగునీరు ను అందించేందుకు తీవ్రమైన కృషిని కొనసాగిస్తూ అడ్డంకులను దాటే ఎత్తుగడలు వ్యూహాలను అమలు పరుస్తూ కొనసాగించిన వారి కృషి ఫలించింది. ఆఖరికి ధర్మమే గెలిచింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రావడంతో పాటు పలు అడ్డంకులు తొలగి పోయాయి. ఇది ఎంతో శుభ సందర్భం. ఇది తెలంగాణ కు పండుగరోజు. దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీరు సాగునీరు కష్టాలు తొలగిపోయిన శుభ సందర్భం కన్నా మనకు మరో గొప్ప వేడుక వుంటదని నీననుకోను.’’ అని సిఎం హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన ఇరిగేషన్ శాఖ ప్రన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్‌ను, సిఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను, ఇఎన్సీ మురళీధర్‌ను, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డిని, సీఈలు రమణారెడ్డిని, హమీద్ ఖాన్‌ను సిఎం అభినందించారు. ‘‘మనందరి కృషికి దైవ కృప కూడా తోడు కావడం వల్లనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు వో కొలిక్కి వొచ్చాయి.
నాటి ఉద్యమ కాలంలో కృష్ణా నదిలో బాచుపల్లి వంటి ప్రదేశాల్లో నిలబడి నాణేలు వేసి నీటికోసం మొక్కుదు. ఇట్లా మనం అనేక మొక్కులు మొక్కిన ఫలితమే ఈ విజయం. ఇందుకోసం మనందరం కూడా దేవుని మొక్కలు చెల్లించుకోవాల్సి వున్నది. అందులో భాగంగా కృష్ణమ్మ ఎత్తిపోతల జలాలతో దేవుండ్ల పాదాలు కడుగుతామని నాతో సహా మనందరం మొక్కిన మొక్కులను తీర్చుకోవాల్సి వున్నది. అందుకు ఈ రెండు ఉమ్మడి జిల్లాల నుంచి వస్తున్న సర్పంచులు ఎంపీటీసీలు, ప్రజలు సభకు వొస్తున్నప్పుడు కలషాలు తెచ్చుకోవాలె. తెచ్చుకున్న కలషాల ద్వారా కృష్ణా జలాలను తీసుకపోయి స్వామి పాదాలకు అభిషేకం చేయాలి. దేవునిగుడిలో కొబ్బరికాయ కొట్టి పూలుచల్లి అర్చన చేయాలి. పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి సంబురాలు జరుపుకోవాలి. ఈ విజయాన్ని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి.’’ అని సిఎం తెలిపారు. ఈ నెల 16 నిర్వహించే పాలమూరు ఎత్తిపోతల ప్రారంభ కార్యక్రమాన్ని స్వయంగా ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అందుకు తగిన ఏర్పాట్లు మంత్రులు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించాలి’’ అని సిఎం కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన స్ఫూర్తితో పాలమూరు రంగారెడ్డిని ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఇంజనీర్లకు సిఎం స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మితమైన రిజర్వాయర్ల నుంచి నీల్లను తరలించే కాల్వల నిర్మాణం పనులకోసం టెండర్లు పిలవాలని సిఎం ఆదేశించారు. అందుకోసం అవసరమైన భూ సేకరణ కోసం నోటిఫికేషన్ ఇచ్చి గతంలో అనుసరించిన పద్దతులనే అనుసరించాలని అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు. అచ్చంపేట ఉమామహేశ్వరం పనులు ప్రారంభించాలన్నారు. అదే సందర్భంలో రంగారెడ్డి జిల్లా పరిథిలో చేపట్టాల్సిన కాల్వల నిర్మాణం పనులకు సంబంధించి మహేశ్వరం ఇబ్రహీం పట్నం ప్రాంతాల్లో మంత్రులు ఇరిగేషన్ అధికారులతో కలిసి పర్యవేక్షించాలని సిఎం ఆదేశించారు. పర్యావరణ అనుమతులతో పాటు అనేక అడ్డంకులను అధిగమించి చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను యుద్దప్రాతిపదికన సంపూర్ణంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం దృఢ చిత్తంతో వున్నదని సిఎం పునరుద్ఘాటించారు.
తద్వారా దక్షిణ తెలంగాణలోని పల్లె పల్లెకు తాగునీరు, సాగునీరు అందనున్నదన్నారు. తెలంగాణ వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని, సమ్మిళిత సమగ్ర వ్యవసాయరంగాభివద్ధిని సాధించి,తెలంగాణ రైతన్నల లోగిల్లు బంగారు పంటలతో తులతూగి తద్వారా మనం ఆశించిన లక్ష్యంగా పెట్టుకున్న బంగారి తెలంగాణ లక్ష్యం సంపూర్ణం కానున్నదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మంచి హృదయం తో పని చేస్తే ప్రకృతి కూడా కరుణిస్తదని, దేవుడు కూడా దయచూపిస్తాడనేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాధించిన విజయమే సాక్ష్యం అని సిఎం అన్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ఎత్తిపోతలకు వినయోగించే బాహుబలి పంపుల వివరాలను సిఎం కేసీఆర్ గారికి ఇరిగేషన్ అధికారులు వివరించారు. ప్రపంచంలోనే మరెక్కడా వినియోగించని విధంగా 145 మెగావాట్ల సింగిల్ పంపులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ పంపులను బిగించే బోల్టు బరువు 12 కిలోలుంటుందనీ, దాని రూటర్ 80 టన్నులుంటుందనీ,తెలిపారు. 240 టన్నుల బరువుండే దాదాపు 50 పంపులను ఈ ఎత్తిపోతల కోసం వినియోగిస్తున్నట్టు ఇంజనీర్లు వివరించడంతో సమావేశం ఆశ్చర్యపోయింది. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…ఇంకా ఎన్నో వింతలు విశేషాలు ఆశ్చర్యంగొలిపే అంశాలు నమ్మశక్యం గాని సాంకేతిక అంశాలున్నాయని తెలిపారు.
బాహుబలి వంటి భారీ పంపులను బిగిస్తున్నప్పుడు చూడడానికే భయం గొలిపే పరిస్థితులుంటాయని సిఎం వివరించారు. తాను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా చూసానని సిఎం వివరించారు. ఇటువంటి క్లిష్ట పరిస్తితులను దాటుకుంటూ అటు ఇరిగేషన్ శాఖ అధికారులు ఇటు విద్యుత్ శాఖ అధికారులు పడుతున్న శ్రమను మరోసారి సిఎం కేసీఆర్ అభినందించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రాడార్ లో వచ్చే చెరువులను నింపే దిశగా అనుసంధానిస్తే కాల్వల పనులను చేపట్టాలని సిఎం అన్నారు. ఉత్తర తెలంగాణ నిర్మించిన చెక్ డ్యాంలో అద్భుత ఫలితాలనిస్తున్నాయని సిఎం తెలిపారు. దేశంలోని మొత్తం రాష్ట్రాల్లో వొక్క తెలంగాణ లో మాత్రమే భూగర్భ జలాలు విపరీతంగా పెరిగినాయని అందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమన్నారు. అదే విధానాన్ని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్భంలోనూ అనుసరించాలని సిఎం అన్నారు. ఇన్నాల్లూ మహారాష్ట్ర ఎగువనించి వస్తెనే కృష్ణా గోదావరి నదుల్లో ఎగువనుంచి వరదవచ్చేదనీ ఇప్పుడు తెలంగాణలో చేపట్టిన హరితహారం తో పరిస్థితులు మారాయన్నారు. రాష్ట్రం పరిథిలోని నదీపరీవాహక ప్రాంతాల్లోనే వర్షాలు కురిసి నదుల్లో ప్రవాహం పెరుగుతున్న సందర్భాన్ని సిఎం వివరించారు.అదే సందర్భంగా నీటిని ఎత్తిపోసేందుకు పంపులను నడిపేందుకు కీలకమైన విద్యుత్ వ్యవస్థల నిర్మాణం పై జెన్కో ట్రాన్స్ కో సిఎండీ ప్రభాకర్ రావు తదితర విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తాగునీరు తరలింపుకోసం చేపట్ట వలసిన చర్యల కోసం మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి తదితర అధికారులతో సిఎం సీమీక్షించారు.