వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న స్కూళ్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్రంలో బడి గంటలు మోగాయి. ఎండలు తగ్గకున్నా జూన్ 12 కావడంతో స్కూళ్లు తెరుచుకున్నాయి. వేసవి సెలవులు ముగియడంతో నెలన్నర నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ చిన్నారులందరూ బాల సైనికుల్లా బడి బాట పట్టారురు. వేసవి సెలవుల తర్వాత రాష్ట్రంలోని 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు సోమవారం తెరుచుకొన్నాయి. దీంతో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు తిరిగి బడిబాటపట్టారు. ఇన్నాళ్లు సెలవుల్లో ఆటలు పాటలతో గడిపిన చిన్నారులంతా సోమవారం నుంచి చదువుల ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసి, విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ పటిష్ఠ కార్యాచరణను సిద్ధం చేసింది. నూతన విద్యాసంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలతో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (సైట్)లకు అధికారులు వేర్వేరు ప్రణాళికలను రూపొందించారు. వాటిని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు సమర్పించి ఆమోదం తీసుకున్నారు. నిరుడు 1-8 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి దాన్ని 9వ తరగతికి విస్తరించనున్నది.