మోదీపై మరోసారి స్వరం పెంచిన కెసిఆర్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై స్వరం పెంచారు. బిజెపి, టిఆర్‌ఎస్‌ ‌దోబూచు లాడుతున్నాయని, ఈ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌కు కాదని జవాబు చెప్పినట్లుగా కెసిఆర్‌ ‌మాటలున్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య గతంలో అనేక విభేదాలు వొచ్చినా, ఏనాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికూడా అనని విధంగా వికారాబాద్‌ ‌సభలో ప్రధాని నరేంద్రమోదీపైన కెసిఆర్‌ ‌తీవ్రమైన ఆరోపణ చేయడం దేశ రాజకీయ రంగాన్ని విస్మయం కలిగించేదిగా ఉంది. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, తెలంగాణలో తెరాస ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సఖ్యతతో వ్యవహరించిన ఈ రెండు ప్రభుత్వాలు ఇప్పుడు ఉప్పులో నిప్పులా తయారయినాయి. తెలంగాణలో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బిజెపి చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ రెండు ప్రభుత్వాలకు మధ్య అగాధం పెరిగింది.

నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఇరు పార్టీల నాయకులు నిత్యం ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటం పరిపాటయింది. తెలంగాణ ప్రాంతం••ఓ•• కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ సవతితల్లి ప్రేమను కనబరుస్తున్నాడంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌పలు దఫాలు ఆరోపణలు చేసిన విషయం తెలియందికాదు. తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తున్న పన్నులకు తగినట్లుగా రాష్ట్రానికి సమకూర్చాల్సిన నిధుల్లో కేంద్రం కోత విదిస్తూ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నదంటూ లెక్కలతో సహా చెప్పినప్పటికీ, కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకులు మాత్రం కేంద్రం నిధులన్నిటినీ తమ పథకాలకు వినియోగించుకుంటూ కేంద్రంపై అబాండం వేస్తున్నారని తెరాస నాయకులను దుయ్యబట్టమన్నది నిత్యం జరుగుతున్నది. ఈ తగవు చివరకు ప్రధాని స్వయంగా రాష్ట్ర పర్యటనకు వొచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలువాల్సిన ముఖ్యమంత్రి ముఖం చాటేసేవరకు వొచ్చింది. ఇటీవల కాలంలో ప్రధాని పలు దఫాలుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రరాజధాని హైదరాబాద్‌కు వొచ్చినా, ముఖ్యమంత్రి ఏదో కారణాలతో ఆయన్ను కలవకపోవడం ఇరువురి మధ్య దూరాన్ని మరింత పెంచినట్లు అయింది. దానికి తోడు బిజెపికి ప్రత్యమ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాలుకూడా మోదీ, కెసిఆర్‌ల మధ్యే కాకుండా కేంద్ర, రాష్ట్ర సంబంధాల పట్ల, కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఇది కొత్తగా ఏర్పడిన తెలంగాణరాష్ట్ర ఎదుగుదలకు ఆటంకంగా మారుతున్నది. ఫలితంగా పాలనా వ్యవహారాలపై ప్రభావం చూపిస్తున్నది.

అర్థిక వనరులను సమకూర్చుకోవడానికి భవిష్యత్‌లో ఉపయోగకరంగా ఉండాల్సిన అనేక ప్రభుత్వ స్థలాలను మార్కెట్‌లో పెడుతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానుండగా ఈ రెండు పార్టీల మధ్య పట్టుదలలుకూడా పెరిగాయి. రానున్న ఎన్నికలతో కెసిఆర్‌ ఇం‌టికే పరిమితం అవుతాడని బిజెపి అంటుండగా, నరేంద్రమోదీ మళ్ళీ గుజరాత్‌కు వెళ్ళాల్సిందేనని, కేంద్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని కెసిఆర్‌, ఆయన మంత్రివర్గం జ్యోష్యం చెబుతున్నారు. ఈ వివాదం ఇలా ఉండగా గతంలో వివిధ పార్టీలనుండి టిఆర్‌ఎస్‌లో చేరినట్లుగానే ఇప్పుడు బిజెపిలోకి వరుసలు ప్రారంభమైనాయి. టిఆర్‌ఎస్‌కు చెందిన పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్‌పిటిసీలు ఇటీవల బిజెపి తీర్థం పుచ్చుకోవడం, అటు కాంగ్రెస్‌నుండి ముదిగోడు ఎంఎల్‌ఏ ‌చేరుతుండడం, ఆయనతోపాటు పెద్ద జాబితానే ఉన్నట్లు బిజెపి వర్గాలు చెబుతుండడం చూస్తుంటే రాష్ట్రంలోని రాజకీయ రంగంలో పెద్ద మార్పులు జరిగే అవకాశం కనిపిస్తున్నది. ఈ నేపథ్యం కెసిఆర్‌ ‌ప్రసంగం సంచలనం కలిగిస్న్నుది. ఒక విధంగా కేంద్ర, రాష్ట్ర విభేదాలు దీనితో పరాకాష్టకు చేరుకోనున్నట్లు స్పష్టమవుతున్నది.

తెలంగాణకు ప్రధాన శత్రువు ప్రధాని నరేంద్రమోదీనే అని కెసిఆర్‌ ‌బహిరంగంగా విమర్శించడం ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అంతటితో ఆగకుండా బిజెపిపై మరింత తీవ్రంగా విరుచుకు పడ్డాడు. గుంటనక్కల్లా పొంచి ఉన్నారని, కైలాసం ఆటలో పాములా మింగకుండా జాగ్రత్తపడాలని, పీక్కుతినడకుండా చూడాలని, వారి మాటలు నమ్మితే తర్వాత మీరే గోసపడుతారంటూ ఆయన ప్రజలను హెచ్చరించిన తీరు ప్రత్యక్ష యుద్ధాన్ని తెలియజేస్తున్నది. ఎనిమిదేళ్ళ కాలంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఒరగబెట్టింది ఏమీలేదని దుయ్యబట్టారు. సంస్కరణలపేరున ప్రజలకు శఠగోపం పెట్టి షావుకార్లను నింపుతున్నారని, దాదాపు ఇరవై లక్షల కోట్ల రూపాయలు అలా బడా వ్యాపారులకు దోచిపెట్టారంటూ ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంనుండి కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎంత అన్న ప్రశ్నకు నేటివరకు కేంద్రంనుండి సమాధానం లేదని, వాస్తవంగా ఆ విషయం తేలకుండా అడ్డుకుంటున్నదికూడా బిజెపియేనంటూ ఆయన బిజెపి తప్పిదాల జాబితాను ఏకరువు పెట్టారు. ఉజ్వల భవిష్యత్‌ను నిర్మించి, దేశం పురోగతిని సాధించాలంటే మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం ఒక్కటేమార్గం అంటూ ఆయన మోదీపైన, కేంద్ర ప్రభుత్వ విధానాలపైన నిప్పులు చెరగటంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడిని రగిలిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page