ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 16 : భారత ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో దేశంలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని కేంద్ర ప్రభుత్వం అందించిన పలు సంక్షేమ పథకాలు బీద ప్రజలకు అర్హులైన లబ్ధిదారులకు అందించిన ఘనత భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కే దక్కుతుందని కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. సోమవారం కల్వకుర్తి నియోజకవర్గం లో ఆయన పర్యటించారు. కడ్తాల్ మండల కేంద్రం బిజెపి పార్టీ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి ప్రారంభించారు. అనంతరం కల్వకుర్తిలో ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించి.. కల్వకుర్తి పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన తాను ఏడుసార్లు శాసనసభ, పార్లమెంట్ స్థానాలకు ప్రజల చేత ఎన్నుకోబడి మోదీ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు బీద ప్రజలకు అందించామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి పైసా, ప్రతి పథకము నేరుగా ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా ఒక్క ఆన్లైన్ దరఖాస్తు తో పేద ప్రజల అకౌంట్ కు చేరవేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. తన శాఖలో నల్గొండ జిల్లా కు చెందిన నవీన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్క ఆన్లైన్ దరఖాస్తు తో రెండు కోట్ల సబ్సిడీ పొందారాని గుర్తు చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి రూపాయి నేరుగా లబ్ధిదారులకే అందుతుందని ఇప్పటివరకు మత్స్య శాఖ పాడి పరిశ్రమ శాఖ ద్వారా రెండున్నర లక్షల కోట్ల మేర లబ్ధిదారులకు సబ్సిడీ రూపంకుగా చేరిందన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్ల రూపాయలను అందించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా రాలేదని బహిరంగ సభలో చెబుతుంటారని అ క్కడే ఉన్న చంద్రదాన గ్రామపంచాయతీ సర్పంచ్ కుమార్ తో కేంద్రమంత్రి చెప్పించారు. మహిళలు కూడా ఇంటికే పరిమితం కాకుండా దేశంలో రాజకీయాలను శాసించాలని ఉద్దేశంతో 33% మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలోనే బిజెపికి ఒకే ఒక్క ఆమనగల్ మున్సిపాలిటీ దక్కిందని ఎస్టి గిరిజన నాయకుడు చైర్మన్ అవడం ఆచారి కార్యకర్తల కృషి ఎంతో ఉందని మంత్రి చెప్పారు. ప్రపంచ దేశాలు భారతదేశ ప్రధాని మోదీ గొప్పతనాన్ని చెప్పుకుంటున్నాయని దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన జీ 20 సదస్సులో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన అగ్రనేతలు భారత్ కు వచ్చి తమ దేశ గొప్పతనాన్ని వివరించడం జరిగిందన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ ఘట్కరి శాఖ నుంచి వేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానీ దే అన్నారు. కరోనా సమయంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ ను కనుగొని ఉచితంగా మందులు సరఫరా చేసి ఇతర దేశాలకు కూడా పంపించిన ఘనత తమదేనని అన్నారు. ఇందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమై బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం లో ఒకే సిద్ధాంతాన్ని ఒకే పార్టీని నమ్ముకొని నియోజకవర్గ ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేస్తూ 40 సంవత్సరాలుగా పోరాడుతున్న ఆచారి ఆరోసారి మీ ముందుకు వస్తున్నారని ఆయనను ఆశీర్వదించి కల్వకుర్తి ప్రజలు గెలిపిస్తే తాను నరేంద్ర మోదీ కి చెప్పి కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కంకణ బద్ధులవుతామన్నారు. మాజీ మంత్రి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దోకే బాస్ బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు లోపాయి కారి ఒప్పందంతో పనిచేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆమె అన్నారు. మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని తాను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి కల్వకుర్తిలో కనబడుతుందని ఎద్దేవా చేశారు. బీసీ నాయకుడు బహుజనుల బిడ్డ ఆచారిని కల్వకుర్తి ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, తాలూకా మండల గ్రామ అధ్యక్షులు నాయకులు నేతలు బండేలా రామచంద్రారెడ్డి, ఎన్నం శేఖర్ రెడ్డి, లాయర్ కృష్ణయ్య, రాంపాల్ నాయక్, మాజీ ఎంపీపీ వీరయ్య, రెడ్యా, రాందాస్, నరసింహ, లక్ష్మణ్, శ్రీశైలం యాదవ్, విజయ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.