– సిపిఐ పార్లమెంట్ సభ్యులు పి. సందోష్ కమార్
హిమాయత్ నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మోదీ, పదేళ్ల బిజెపి పాలనలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారో చెప్పాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఎఐవైఎఫ్) మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సిపిఐ పార్లమెంట్ సభ్యులు పి. సందోష్ కమార్ నిలదీశారు. యువజన, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బిజెపి, ఆ పార్టీ బి-టీమ్ వ్యవహారిస్తున్న తెలంగాణ రాష్ట్రంలోని బిఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాలను గద్దె దించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నదని పిలుపునిచ్చారు. రెండు రోజుల పాటు జరిగే ఎఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు హైదరాబాద్, హిమాయత్ నగర్, తేరాపంత్ హాల్ ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మహాసభ ప్రారంభ సమావేశానికి సందోష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలోని బిజెపి, ఆ పార్టీకి బిటీమ్ వ్యవహారిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించితేనే దేశ, యువతకు భవిష్యత్తు ఉంటుందన్నారు. మోదీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై గౌరవం, విశ్వాసం లేదని దుయ్యబట్టారు. మణి పూర్ మత ఘర్షణలు కొనసాగుతున్నాయని, ఎంతో మంది ఆస్తులను నష్టపోయారని, ప్రాణాలను కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ -హమాస్ యుద్దం నేపథ్యంలో అక్కడి పరిస్థితులను తెలుసుకుని ,ఇజ్రాయెల్ దేశానికి మద్దతు పలికిన ప్రధాని మోదీకి, సొంత దేశంలోని మణిపూర్ ఘటనపై మాట్లాడే తీరిక, స్పందించే సమయం లేదని ఎద్దేవా చేశారు. రెండు నుండి మూడు గంటల పాటు ప్రసంగించే ప్రధాని మోడీకి నిరుద్యోగ సమస్యలు, వారికి ఇచ్చిన హామీ మేరకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాల భర్తీపై నోరువిప్పరని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతోందని, యువత ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం నుండి మొదలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తొలి,మలి దశ ఉద్యమంలో యువత ముఖ్యపాత్ర ఉన్నదని, ఇందులో యువజన సమాఖ్య ముఖ్యభూమిక పోషించిందని గుర్తు చేశారు. ఆ ఉద్యమ స్పూర్తితో యువత ముందుకెళ్లాలని , దేశ, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు సభాధ్యక్షత వహించిన ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ యువజన వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. నిరుద్యోగ భృతి, జాబ్ కేలండర్ అమలు చేయడంలో బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ఈ మహాసభలో ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర స్వాగతం పలుకగా, ఎఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. తిరుమలై, ప్రముఖ సామాజిక కార్యకర్త, మహసభల ఆహ్వాన సంఘం ఛైర్మన్ మోటూరి కృష్ణ ప్రసాద్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఇ.టి నర్సింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఛాయా దేవి, సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్, ప్రజా నాట్య మండలి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాస్, పల్లె నర్సింహ, ఎఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ నిర్లేకంటి శ్రీకాంత్, కనుకుంట్ల శంకర్, సురేష్, సత్యప్రసాద్, లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు.
భారీ ప్రదర్శన: ఎఐవైఎఫ్ రాష్ట్ర ద్వితీయ మహాసభల సందర్భంగా హైదరాబాద్ లో ఆదివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్ వైఎంసిఎ నుండి హిమాయత్ నగర్ మహాసభలు జరిగే సభ ప్రాంగణం తెరపంత్ భవన్ వరకు ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎర్ర టీషర్టులను ధరించి, చేతిలో ఎఐవైఎఫ్ జెండాలను చేతబూని వైఎంసిఎ నుండి ప్రదర్శనగా బయల్దేరారు. ముందు వరుసలో ప్రజా నాట్య మండలి ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ బృందం డప్పు సప్పుళ్లు, ఆలపించిన గేయాలు ప్రత్యేక ఆకర్షణగానిలిచింది. “ జిందాబాద్ జిందాబాద్ ఎఐవైఎఫ్..జిందాబాద్…కోన్ బచాయేగా దేశ్ కో – హమ్ బచాయింగే” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ యువత ప్రదన్శలో పాల్గొన్నది. వైఎంసిఎ నుండి మొదలైన ఈ ప్రదర్శన నారాయణగూడ, హిమాయత్ నగర్ మీదుగా సభా స్థలి వరకు సాగింది. ఈ ప్రదర్శనలో ఎఐవైఎఫ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు పి. సందోష్ కమార్ , సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఈ.టి.నర్సింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి చాయాదేవి, ఎఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. తిరుమలై, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ, కె.ధర్మేంధ్ర తదితరులు పాల్గొన్నారు.