ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 25 : యాదాద్రి ఆలయ పునఃప్రారంభ వేడుకల్లో భాగంగా చేపట్టిన పంచకుండాత్మక యజ్ఞం, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజైన శుక్రవారం ప్రధానాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివార్లకు పూజలతో పాటు బాలాలయంలో రుత్విక బృందం పంచకుండాత్మక యాగం నిర్వహించారు.
ఇదిలావుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 28న యాదాద్రి రానున్నారు. ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ వైదిక పర్వాల్లో ఆయన పాల్గొంటారని సమాచారం. 28న ప్రధానాలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బాలాలయంలో వేద పండితులు ఐదు రోజులుగా పంచకుండాత్మక సుదర్శన యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం యాదాద్రిలో అడుగుపెట్టినప్పటి నుంచి కొండపైకి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగొచ్చే వరకు పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.