ముస్లింలు ఇలాంటి పార్టీలకు వోటేయొద్దు.. ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్య
హైదరాబాద్, జూన్ 27 : ఉత్తర్‌ప్రదేశ్‌లో 2 లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీకి పరాభవం తప్పలేదు. అజంగఢ్, రాంపూర్ రెండు స్థానాల్లో ఓటమి పాలైంది. ఇక్కడ రెండు చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సమాజ్ వాది పార్టీపై ఓటమిపై ఎంఐఎం ఛీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ స్పందించారు. ఎస్పీ ఓటమి, అఖిలేష్ యాదవ్ పై ఆయన సెటైర్లు వేశారు. బీజేపీని ఓడించే సామర్థ్యం సమాజ్ వాదీ పార్టీకి లేదని యూపీ బైపోల్ రిజల్ట్ నిరూపించిందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రాంపూర్, అజంగఢ్ లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు సమాజ్ వాద్ పార్టీ అసమర్ధతను బయట పెట్టాయ న్నారు. అసమర్ధ పార్టీలకు మైనార్టీ వర్గాలు ఓట్లు వేయకూడదన్నారు. పార్టీ ఓటమికి అఖిలేష్ యాదవ్ కారణమని ఆయన ఆరోపించారు.
అహంకార ధోరణితో ప్రజల్లోకి వెళ్లలేదని మండిపడ్డారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో.. బీజేపీని ఓడించే దమ్ము సమాజ్‌వాదీ పార్టీకి లేదని స్పష్టం అవుతోందని అన్నారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలు.. సమాజ్‌వాదీ పార్టీకి బిజెపీని ఓడించే దమ్ము లేదని నిరూపించాయి. అసలు ఆ పార్టీకి అంత మేధో నిజాయితీ లేదని తేలింది. ఇలాంటి అసమర్థ పార్టీలకు దయ చేసి మైనారిటీలు ఓట్లు వేయకండి అని ఒవైసీ పిలుపు ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి బీజేపీ బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారో అంటూ అఖిలేష్ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఒవైసీ. అంతేకాదు రాంపూర్, ఆజాంఘడ్ ఉప ఎన్నికల్లో ఓటమికి ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌నే బాధ్యుడిగా విమర్శించారు. అఖిలేష్ యాదవ్ అహంభావి. కనీసం.. ప్రజలను కూడా కలవలేకపోయాడు. దేశంలోని ముస్లింలు తమకంటూ ఒక రాజకీయ గుర్తింపు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ పేర్కొన్నారు.