యువత ఒక దశ కాదు.. ఓ విప్లవానికి దిశ!

యువత రేపటి ప్రపంచానికి రూపశిల్పులు. సంకల్పం అభిరుచితో పర్వతాలనైనా కదిలించగలరు. యువత చేతిలో భవిష్యత్తు రూపొందించే శక్తి ఉంది. యువత యొక్క సామర్థ్యానికి అపరిమితమైన, అనంతమైన హద్దులు ఉండవు. ఒక దేశ పురోగతి, అభివృద్ధి ఆ దేశంలోని యువత సహకారంపై ఆధారపడి ఉంటుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితిలో యువత పాత్ర కీలకం. అందువల్ల యువత అభివృద్ధికి వారి జీవితాలకు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. యువత సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారాలు కనుగొనాలి. తద్వారా వారు సమాజం కోసం గొంతు పెంచగలరు. పెరుగుతున్న డిజిటల్‌ యువత: ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌ డేటా ప్రకారం ప్రపంచంలో 808 కోట్ల జనాభా ఉంది.

గత సంవత్సరం కంటే 7.4 కోట్లు పెరిగింది. ఇది యేడాదికి 0.9 శాతం వృద్ధికి సమానం. ప్రపంచ వ్యాప్తంగా 2024 ప్రారంభంలో మొబైల్‌ ఫోన్‌ వినియోగదారుల సంఖ్య 561కోట్లగా ఉంది. జిఎస్‌ఎమ్‌ఎ ఇంటెలిజెన్స్‌ తాజా డేటా ప్రపంచ మొత్తం జనాభాలో 69.4 శాతం మొబైల్‌ ఉపయోగిస్తున్నారని, ఇది గత యేడాది కంటే 13.8 కోట్లు ఎక్కువని తెలిపింది. మొత్తం జనాభాలో 66 శాతం కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. తాజా డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సంఖ్య 535 కోట్లగా ఉంది. ఇంటర్నెట్‌  వినియోగదారులు గత 12 నెలల్లో 1.8 శాతం పెరిగారు. 2023 ప్రారంభం నుండి 9.7 కోట్ల కొత్త వినియోగదారులు చేరారు. కెపియోస్‌ విశ్లేషణ ప్రకారం క్రియాశీల సోషల్‌ మీడియా వినియోగదారుల 500 కోట్ల మార్కును అధిగమించారు. ఈ వినియోగదారు సంఖ్య ప్రపంచ జనాభాలో 62.3 శాతానికి సమానం.

ప్రపంచాన్ని మార్చుతున్న డిజిటలైజేషన్‌: ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్‌ స్థిరమైన అభివృద్ధిని వేగవంతం చేయడానికి అపూర్వమైన అవకాశాలను అందిస్తోంది. మొబైల్‌ పరికరాలు, సేవలు, కృత్రిమ మేధస్సులాంటి డిజిటల్‌ సాంకేతికతలు ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ది లక్ష్యాల (యస్డిజి)ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆర్థిక, సామాజిక, పర్యావరణ పరిమాణాలలో తీవ్ర ప్రభావంతో డిజిటల్‌ టెక్నాలజీలు, డేటా అనేవి 169 యస్డిజి లక్ష్యాలలో కనీసం 70 శాతం లక్ష్యాన్ని చేరుకోడానికి దోహద పడతాయి. డిజిటల్‌ చేరికను పెంపొందించుకోవాల్సిన తక్షణ అవసరం ఉన్నప్పటికీ యువత ఎక్కువగా ‘‘డిజిటల్‌ స్థానికులు’’గా గుర్తించబడుతోంది.

డిజిటల్‌ స్థానికులు అంటే డిజిటల్‌ టెక్నాలజీ ఉనికితో లేదా సమాచార యుగంలో పెరిగిన వ్యక్తి  అని అర్థం. వీరు సాంకేతికతను సమాజ సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 2022లో 15 నుండి 24సం. వయస్సున్న వారిలో 75 శాతం మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది తరాల అంతరం తగ్గుతుందనే సంకేతాలుకు నిదర్శనం. 2020లో యువత (71 శాతం), మిగిలిన జనాభా (57 శాతం) మధ్య డిజిటల్‌ అందుబాటు రేటు మధ్య వ్యత్యాసం కేవలం14 శాతం పాయింట్లు మాత్రమే ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

 

ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో ఈ వయస్సు ఉన్న వ్యక్తులు పెద్దవారు లేదా అంతకంటే తక్కువ వయస్సు గల వ్యక్తుల కంటే ఎక్కువగా కనెక్ట్‌ అయ్యారు. సాపేక్ష పరంగా అతిపెద్ద అంతరం తక్కువ ఆదాయ ఆర్థిక వ్యవస్థలలో గమనించబడిరది. ఇక్కడ 39 శాతం మంది యువకులు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. మిగిలిన జనాభాలో 23 శాతం మాత్రమే ఉన్నారు. ఇతర వయో వర్గాల కంటే ఎక్కువ రేటుతో డిజిటల్‌ స్వీకరణ, ఆవిష్కరణలలో యువత అగ్రగామిగా ఉన్నారు. అయినప్పటికీ అసమానతలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి తక్కువ ఆదాయ దేశాలలో యువతుల మధ్య మగవారితో పోలిస్తే తరచుగా ఇంటర్నెట్‌, డిజిటల్‌ నైపుణ్యాలకు తక్కువ అందుబాటులో ఉంది.

యస్డిజి సాధన కోసం 2030 గడువు సమీపిస్తున్నందున ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి డిజిటల్‌ ఆవిష్కరణలో యువకుల పాత్ర చాలా అవసరం. మొబైల్‌ పరికరాలు, సేవలు, కృత్రిమ మేధస్సు వంటి డిజిటల్‌ సాంకేతికతలు సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ ముందుకు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తాయి. యువత కొత్త సాంకేతికతలను స్వీకరించడంలో, ఆవిష్కరింప జేయడంలో ముందంజలో ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ ట్రెండ్‌లను రూపొందించే వినియోగదారులుగా, డెవలపర్‌లగా అతిపెద్ద జనాభాను ఏర్పరుస్తారు.

సవాళ్లు పరిష్కారాలు: రాజకీయ సంక్షోభం, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న అసమానతలు, అధ్వాన్నంగా పర్యావరణ సంక్షోభం లాంటివి  ప్రపంచంలో 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో అడ్డంకులుగా ఉంటాయి. పెరుగుతున్న సంఘర్షణలతో కూడిన వాతావరణ మార్పుల యొక్క పెరుగుతున్న ప్రభావాలు, స్థిరమైన అభివృద్ధిని సాధించడంలో పురోగతిని తిప్పికొట్టగల భయంకరమైన పోకడలకు దోహదం చేస్తున్నాయి.  స్థిరమైన అభివృద్ధి కోసం అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల ఆర్థిక కట్టుబాట్లను తప్పక నెరవేర్చాలి. యస్డిజి సాధించడానికి ఇన్నోవేటివ్‌ ఫైనాన్సింగ్‌ మెకానిజమ్స్‌ కూడా కీలకం. వీటికి యువత డిజిటల్‌ మార్గాలు ద్వారా పరిష్కరించాలి.

డి.జె మోహనరావు
యం.ఎస్సీ(ఫిజిక్స్‌) టీచర్‌, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా,ఆంధ్రప్రదేశ్‌,8247045230

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page