రసకందాయంలో కాంగ్రెస్‌ ‌రాజకీయం

  • అధిష్టానం వద్దకు చేరిన అసమ్మతి పంచాయతీ
  • జగ్గారెడ్డి తరహాలోనే మరి కొందరు సీనియర్లపై చర్యలు ?

ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో రాజకీయం రసకందాయానికి చేరుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభించిన ధిక్కార స్వరం బలం పుంజుకుంటున్న తరుణంలో అధిష్టానం ఆయనపై చర్యలు తీసుకోవడంతో మరింత ముదిరి పాకాన పడ్డట్లయింది. కాంగ్రెస్‌ ‌పార్టీ అధిష్టానం జగ్గారెడ్డిని పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌బాధ్యతల నుంచి తప్పించి పార్టీలో అసమ్మతి వాదులను ప్రోత్సహించేది లేదని గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. అయితే, ఆయన దారిలోనే పార్టీ సీనియర్లు మాజీ మంత్రి శశిధర్‌ ‌రెడ్డి, మాజీ ఎంపి విహెచ్‌ ‌వంటి మరికొందరు నేతలు రేవంత్‌ ‌రెడ్డి వ్యవహార శైలికి వ్యతిరేకంగా సమయం దొరికినప్పుడల్లా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. జగ్గారెడ్డిని పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌బాధ్యతల నుంచి తప్పించిన విధంగానే అదే బాటలో నడుస్తున్న మరి కొందరు సీనియర్లపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని గాంధాభవన్‌ ‌వర్గాలు పేర్కొంటున్నాయి.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీలో అసమ్మతి బలం పుంజుకుంటే పార్టీకి భారీ నష్టం జరుగుతుందనే అభిప్రాయంలో ఉన్న కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటి నుంచే అసమ్మతి వాదులను నియంత్రణలో ఉంచాలనీ, ఆ దిశగానే మరి కొందరు సీనియర్లపై చర్యలు తీసుకుంటుందనే ప్రచారం పార్టీ వర్గాలలో జోరుగా సాగుతోంది. కాగా, జగ్గారెడ్డిపై కాంగ్రెస్‌ ‌పార్టీ అధిష్టానం చర్యల నేపథ్యంలో అసమ్మతి పంచాయతీ దిల్లీకి చేరింది. ఇప్పటికే టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి దిల్లీకి చేరి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానానికి నివేదిక ఇవ్వడానికి సిద్ధమయ్యారు. జగ్గారెడ్డితో పాటు పార్టీలోని మరికొందరు సీనియర్లు అసమ్మతి సమావేశం నిర్వహించిన విషయం ఆయన ప్రధానంగా అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకు రానున్నట్లు సమాచారం.

కాగా, ఇదే తరుణంలో పార్టీలోని కొందరు సీనియర్లు సైతం దిల్లీకి చేరుకున్నారు. రేవంత్‌ ‌రెడ్డి పార్టీలో ఒంటెద్దుపోకడలు పోతున్నారనీ, సీనియర్ల సూచనలు, సలహాలు పాటించడం లేదని వారంతా అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే, గత రెండు రోజులుగా దిల్లీలో మకాం వేసిన రేవంత్‌రెడ్డికి గానీ, అసమ్మతి నేతలకు గానీ, కాంగ్రెస్‌ అధిష్టానం ఇంకా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. దీంతో అధిష్టానం ఎవరికి ముందుగా అపాయింట్‌మెంట్‌ ఇస్తుందో, ఎవరు ఎవరి మీద బలంగా ఫిర్యాదు చేసుకుంటారో ఆతదుపరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీ నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page