*-పీఆర్,ఆర్&బి శాఖల ఈఈలను ఆదేశించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు*
ప్రజాతంత్ర కథనానికి స్పందన
మణుగూరు, ప్రజాతంత్ర, జనవరి 14 :మణుగూరు-ఏటూరునాగారం ప్రధాన రహదారులతో పాటు, నియోజకవర్గంలోని ఇతర ప్రధాన రహదారులు, గ్రామాలలో రహదారులపై ఉన్న గుంతలు పూడ్చి రహదారులకు మరమ్మతు పనులు వెంటనే చేయించాలని పీఆర్,ఆర్&బి శాఖల ఈఈలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశించారు.
“ప్రమాదకరంగా బీటీపీఎస్ రహదారి అనే వార్తలు ప్రజాతంత్ర దినపత్రిక ప్రచురించింది”. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆదివారం మధ్యాహ్నం ఫోన్ లో పీఆర్, ఆర్&బి శాఖల ఈఈలతో మాట్లాడారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని, గోతులు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరితగతిన మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మేడారం జాతర ప్రారంభమవుతున్న నేపథ్యంలో మణుగూరు, ఏటూరునాగారం ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ పెరుగుతుందని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని పనులను పూర్తి చేయాలని అన్నారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగా గ్రామాలలో పలు చోట్ల రహదారులు కోతకు గురి కాగా, మరి కొన్ని చోట్ల వరదప్రవాహానికి రహదారులు కొట్టుకుపోవడం జరిగిందని అలాంటి రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని అన్నారు.