జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీ లక్ష్యం
కొరోనా ముప్పు ఇంకా తొలగలేదు
మహమ్మారి వల్ల ప్రపంచ దృష్టికి యోగా, అయుర్వేదం
గుజరాత్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
న్యూ దిల్లీ, ఏప్రిల్ 15 : ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలన్న కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల రానున్న 10 ఏళ్లలో దేశంలో రికార్డు స్థాయిలో డాక్టర్ల సంఖ్య పెరుగనుందని ప్రధాని తెలిపారు. గత ఆరేళ్లలో దేశ వ్యాప్తంగా 30,000 ఎంబీబీఎస్ సీట్లు, 24,000 పీజీ సీట్లు పెరిగాయని ప్రధాని మోదీ చెప్పారు. శుక్రవారం నాడు గుజరాత్ భుజ్‌లోని 200 పడకల కెకె పటేల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేసిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ..ప్రతి జిల్లాలో కనీసం ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంగా, వైద్య విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా చూడడం వల్ల దేశంలో 10 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిలో డాక్టర్ల సంఖ్య పెరుగుతుందని అన్నారు. రెండు దశాబ్దాల క్రితం గుజరాత్లో కేవలం తొమ్మిది మెడికల్ కాలేజీలు ఉండేవని, అయితే గత 20 ఏళ్లలో వైద్య విద్య రంగం చాలా అభివృద్ధి చెందిందని, ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఎయిమ్స్, 36కు పైగా వైద్య కళాశాలలు ఉన్నాయన్నారు. గతంలో గుజరాత్‌లోని మెడికల్ కాలేజీల్లో కేవలం 1,000 మంది విద్యార్థులు మాత్రమే అడ్మిషన్ పొందేవారని, ఇప్పుడు ఈ కాలేజీల్లో దాదాపు 6,000 మంది విద్యార్థులు ప్రవేశం పొందుతున్నారని, రాజ్‌కోట్‌లోని ఎయిమ్స్‌లో 2021 నుంచి 50 మంది విద్యార్థులను చేర్చుకోవడం ప్రారంభించిందని మోదీ చెప్పారు.
కొరోనా ముప్పు ఇంకా తొలగ లేదు.. మహమ్మారి వల్ల ప్రపంచ దృష్టికి యోగా, అయుర్వేదం
కొరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు తేలిగ్గా తీసుకోరాదని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. యోగా మరియు ఆయుర్వేదం శాస్త్రాలకు భారతదేశంలో మూలాలున్నాయని, అవి మహమ్మారి సమయంలో ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని అన్నారు. కొరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నందున భారతదేశం నుండి పసుపు ఎగుమతి పెరిగిందని ప్రధాని తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో అత్యధికంగా పౌరులు పాల్గొనేలా చేయడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పాలని మోదీ కచ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గుజరాత్‌లోనూ, దేశంలోనూ పర్యాటకాన్ని పెంచేందుకు సర్దార్ పటేల్‌కు అంకితం చేయబడిన నర్మదా జిల్లాలోని 182 మీటర్ల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి ఆకరణీయ స్థలాలను సందర్శించేలా విదేశీయులను ఒప్పించేందుకు విదేశాల్లో నివసిస్తున్న కచ్ ప్రజల సహాయాన్ని ప్రధాని కోరారు. ఆటో డ్రైవర్లు, టీ అమ్మేవారి వంటి పేదలు జీవనోపాధిని పొందడంలో ఇది సహాయపడుతుందని మోడీ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వొచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లాకు 75 సరస్సులను నిర్మించాలని ప్రధాని పిలుపునిచ్చారు.