- కీసరలో కాంగ్రెస్ రెండ్రోజుల చింతన్ శిబిరం
- పతాకావిష్కరణతో ప్రారంభించిన సిఎల్‌పి నేత భట్టి
- శిబిరానికి దూరంగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1: చింతన్ శిబిర్ తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకు రోడ్ మ్యాప్‌గా ఉంటాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌పై రెండు రోజులపాటు ఈ శిబిర్‌లో చర్చిస్తామన్నారు. చింతన్ శిబిర్‌లో అందరి నేతల అభిప్రాయాలు తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. అన్ని కమిటీలతో సమగ్రంగా చర్చిస్తామని వెల్లడించారు. బుధవారం మేడ్చల్ జిల్లా కీసరలోని బాల వికాస కేంద్రంలో పీసీసీ నవసంకల్ప మేథోమధన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలను చింతన్ శిబిర్‌లో చర్చిస్తామని స్పష్టం చేశారు.
ప్రజలకు ఉపయోగపడే అంశాలపై అన్ని కమిటీలతో చర్చించి నివేదిక తయారు చేస్తామని వెల్లడించారు. ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ వల్ల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరు కాలేదని భట్టి స్పష్టం చేశారు. రెండు రోజులపాటు చింతన్ శిబిర్ కమిటీ సమావేశం కొనసాగుతుందని తెలిపారు. ఉదయపూర్ డిక్లరేషన్‌పై చర్చించడమే ప్రధాన అజెండాగా రెండ్రోజుల పాటు చింతన్ శిబిర్ కమిటీ సమావేశం కొనసాగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించి 6 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసిన పీసీసీ… అన్ని అంశాలపై చర్చించిన నివేదికను ఏఐసీసీకి పంపించనున్నట్లు వెల్లడించారు. పార్టీలో సంస్థాగతంగా మార్పులు, ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా చింతన్ శిబిర్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయం, పార్టీ బలోపేతం, యువత, ఆర్థికం, సామాజిక న్యాయం, రాజకీయం వంటి 6 అంశాలపై సమగ్రంగా చర్చించేలా పీసీసీ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి..తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలనే లక్ష్యంతో ఈ మేథోమథన సదస్సును నిర్వహిస్తున్నట్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి రాకపోవడంలో ఎలాంటి వివాదం లేదని భట్టి తెలిపారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంఛార్జి మాణికం టాగూర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్సులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికలకే లక్ష్యంగా నవసంకల్ప మేథోమధన శిబిరం కొనసాగుతుందని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉదయ్‌పూర్‌లో తీసుకున్న అంశాలపై ఈ శిబిరంలో తీర్మానం ఉంటుందని పేర్కొన్నారు. కీసరలో నిర్వహిస్తున్న చింతన్ శిబిర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చిన తర్వాత రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది ఆర్థిక నిపుణులతో చర్చించిన తర్వాతనే ప్రకటించామని తెలిపారు. రాష్ట్ర అర్థిక పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుందని మండిపడ్డారు. కేసీఆర్ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని అంశాలను పొందుపర్చి ఏఐసీసీకి నివేదిస్తామన్నారు. జిల్లాల వారీగా కూడా చింతన్ శిబిర్ నిర్వహిస్తామన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్‌ని జనంలోకి తీసుకెళ్లడం కోసమే ఈ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.