రామగుండంలో విషాదం

  • అమ్మా ఆడుకుని వొస్తామని చెప్పి…అనంత లోకాలకు
  • చెరువులో ఈతకు వెళ్లి మృత్యువాత పడిన ముగ్గురు పిల్లలు
  • అంబేద్కర్‌ ‌జయంతి రోజునే దుర్ఘటన

రామగుండం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14: అమ్మా…. ఈ రోజు అంబేద్కర్‌ ‌జయంతి..పాఠశాలకు సెలవు, పరీక్ష లేదు. నేను దోస్తులతో కలసి ఆడుకునేందుకు వెళ్తా, నాన్నకు చెప్పకు త్వరగానే వొస్తా. నిన్న పరీక్ష బాగా రాశాను మా సార్‌ ‌మెచ్చుకున్నాడు..వొచ్చిన తర్వాత రేపటి పరీక్షకు చదువుకుంటా.. అని ఒకరు, అమ్మా…వొచ్చే ఎండాకాలం సెలవుల్లో మనం ఈ గుడిసె స్థలంలో కొత్త ఇల్లు కట్టుకుందాం. ఇంకా మూడు పరీక్షలయిపోతే సెలవులే, మా దోస్తులు పిలుస్తున్నారు మేము క్రికెట్‌ ఆడుకునేందుకు వెళ్తున్నాం..బాయ్‌..అని ఇంకొకరు, అమ్మా…నేను ఎప్పుడు స్నేహితులతో కలవనని, వాళ్లతో ఆడుకునేందుకు వెళ్లడం లేదని మా ఫ్రెండ్స్ ఆటపట్టిస్తున్నారు. ఈ ఒక్క రోజు కొంచెం సేపు వాళ్లతో ఆడుకుని వొస్తా..వొచ్చిన తర్వాత చదువుకుంటా అమ్మ..అని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారులు ముగ్గురు చెరువులో మునిగి చనిపోవడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

బడి ఉన్నా మీరు బతికేవాళ్లు బిడ్డా అని వారి తల్లిదండ్రులు పిలల్లలను తలుచుకుంటూ ఏడుస్తున్న తీరు అందరినీ కంట తడిపెట్టించింది. మరణంలోనూ స్నేహబంధాన్ని వీడని తీరు అందరినీ కలిచివేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంత పరిధిలోని న్యూ పోరట్‌పల్లికి చెందిన చిన్నారులు సాయిచరణ్‌(13), ‌విక్రమ్‌(13), ఉమా మహేశ్‌(12) ‌మేడిపల్లి ఇందిరమ్మ కాలనీ సమీపంలో ఉన్న చెరువులో మునిగి మృత్యువాత పడ్డారు. సాయిచరణ్‌ ‌దుర్గయ్యపల్లి ప్రభుత్వ పాఠశాలలో 8 వతరగతి చదువుతుండగా, ఉమా మహేశ్‌ అదే పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. విక్రమ్‌ ఎన్టీపీసీ శ్రీ చైతన్య పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. అంబేద్కర్‌ ‌జయంతి సందర్భంగా పాఠశాలకు సెలవు దినం కావడంతో క్రికెట్‌ ఆడుకునేందుకు వెళ్లిన విద్యార్థులు పక్కనే ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. లోతు అంచనా వేయలేకపోయిన ఆ ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు నీట మునిగి పోయారు.

వారు చెరువులోకి వెళ్లడాన్ని గమనించిన మరో బాలుడు వాళ్లు ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో స్థానికులు నీట మునిగిన వారిని వెలికి తీసి కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే ఆ ముగ్గురు విగతజీవులుగా మారారు. సాయిచరణ్‌ ‌తండ్రి మేకల రాములు, విక్రమ్‌ ‌తండ్రి మామిడి రమేశ్‌ ‌కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుండగా, ఉమా మహేశ్‌ ‌తండ్రి సోయం జనార్దన్‌ ఆటో డ్రైవర్‌. ‌ముగ్గురు చిన్నారులు ఒకే కాలనీకి చెందిన వారు కావడంతో ఆ కాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతదేహాలను గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించి శవపంచనామ నిర్వహించారు. ఈ ఘటనపై ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page