రాష్ట్రంలో శాంతిభద్రతలు శూన్యం

సీఎం రేవంత్‌ ‌డైరక్షన్‌లోనే మా ఎమ్మెల్యేలపై దాడి..
ఎమర్జెన్సీ కన్నా దారుణంగా పరిస్థితులు
హౌజ్‌ అరెస్టులతో మా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది
సిఎంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి కారణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు అన్నారు. శాంతి భద్రతలు అదుపు తప్పడానికి చేసిందంతా చేసి ఇపుడు హైదరాబాద్‌, ‌తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ ‌గురించి రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అరికెపూడికి బందోబస్తు ఇచ్చి దాడులు చేయించారని, పోలీసులను అడ్డం పెట్టుకొని తమ ఎమ్మెల్యేపై దాడి చేసినపుడు రేవంత్‌కు, డీజీపీకి లా అండ్‌ ఆర్డర్‌ ‌గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై ఎందుకు చర్య తీసుకోలేదని నిలదీశారు. ఇది గాంధీ చేసిన దాడి కాదని, రేవంత్‌ ‌రెడ్డి చేసిన దాడిగా అభివర్ణించారు. శుక్రవారం కోకాపేటలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…తమను ఈరోజు హౌస్‌ అరెస్ట్ ‌చేశారని, గురువారం అరికెపూడిని ఎందుకు హౌస్‌ అరెస్టు చేయలేదంటూ ప్రశ్నించారు. గురువారం నాటి దాడికి కారణం సీఎం, డీపీజీదే బాధ్యత లని, చెయ్యాల్సింది చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నరని విమర్శించారు. రాష్ట్రంలో అసలు లా అండ్‌ ఆర్డర్‌ ఉం‌దా అని ప్రశ్నించారు.

 

హత్యాయత్నం చేసిన అరికపూడి గాంధీని, అనుచరులను బందోబస్తు మధ్య ఇంటికి పంపారని, తమకు నీళ్లు కూడా ఇవ్వకుండా గంటల పాటు తిప్పి, దాడులు చేసిన వాళ్లను పోలీసు స్టేషన్‌లో కూర్చోబెట్టి బిర్యానీలు తినిపిస్తూ రాచ మర్యాదలు చేశారని ఆరోపించారు. గురువారం నాటి దాడికి కర్త, కర్మ, క్రియ అంతా రేవంత్‌ ‌రెడ్డేనని, ఆయన డైరెక్షన్‌లోనే ఎమ్మెల్యే కౌశిక్‌ ‌రెడ్డి ఇంటిపై దాడి జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని పాడుచేయొద్దని, పోలీసుల గౌరవాన్ని తగ్గించవద్దని తాము సంయమనం పాటించామని, తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు, కార్యకర్తలను గురువారం సాయంత్రం నుంచి ఎక్కడిక్కడ హౌజ్‌ అరెస్టులు చేస్తున్నరని దుయ్యబట్టారు.

 

ఫోన్లు చేసి పోలీసు స్టేషన్లకు రావాలని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇంత దుర్మార్గమా..అంటూ హరీష్‌ ‌రావు వాపోయారు. సిఎం హౌజ్‌ అరెస్టులతో తమ ఆత్మ విశ్వాసం పెరుగుతుందే తప్ప తరగదన్నారు. ఎమర్జెన్సీ కన్నా దారుణంగా రాష్ట్ర పరిస్థితులు తయారయ్యాయన్నారు. తన అసభ్య, సంస్కార హీనమైన భాషను మార్చుకోకుండా యూ ట్యూబ్‌ ‌చానళ్లకు నీతులు చెబుతున్నాడని సింను ఎద్దేవా చేశారు. కోమటి రెడ్డి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని, బిఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలను కొట్టాలని చెప్పడం దారుణమన్నారు. తొమ్మిది నెలల్లో పాలనపై కాకుండా పైసలపై దృష్టి పెట్టడం వల్లే శాంతి భద్రతలు పాతాళానికి పోయాయన్నారు.

 

మీడియాకు లీకులు ఇవ్వడం ద్వారానో, చిట్‌ ‌చాట్‌ ‌లలో చెప్పడం ద్వారానో శాంతి భద్రతలు అదుపులోకి రావన్నారు. సీఎం నోరు అదుపులో పెట్టుకోక బజారు భాష మాట్లాడుతున్న తీరుతో రాష్ట్రంలో ప్రశాంతతను మంట గలుపుతున్నారని హరీష్‌ ‌రావు విమర్శించారు. ఫిరాయింపులపై దిల్లీలో ఒక్క మాట, గల్లీలో ఒక్క మాట మాట్లాడుతున్నాడని,  డ్రామాలతోనే రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటున్నదన్నారు. తమ మీద ఉన్న కక్ష తెలంగాణ మీద చూపవొద్దన్నారు. అన్నిట్లో నెంబర్‌ ‌వన్‌గా ఉన్న తెలంగాణను సీఎం నియంతృత్వ పోకడలతో నిర్వీర్యం చేయవొద్దని హితువు పలికారు. ఆదర్శంగా ఉండాల్సిన డీజీపీ రాజకీయ కుట్రలో భాగమై ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూడటం దుర్మార్గమని అన్నారు. గుడ్డిగా రేవంత్‌ ‌రెడ్డిని ఫాలో కావొద్దని విచక్షణతో పని చేయాలని, చట్టం ప్రకారం నడుచుకోవాలని డీజీపీని కోరారు. రాహుల్‌ ‌గాంధీ దేశం బయట స్వేచ్ఛ స్వాతంత్య్రాల గురించి లెక్చర్లు ఇవ్వడం కాదని, తన పార్టీ కాంగ్రెస్‌ ‌పాలిస్తున్న తెలంగాణలో ప్రజలపై విధిస్తున్న ఆంక్షల మీద మాట్లాడాలని సవాల్‌ ‌విసిరారు.

 

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు, పీఏసీ నియామకంపై  దృష్టి మరల్చేందుకు వ్యక్తుల మధ్య కొట్లాటలాగా చేస్తున్నారని, హైడ్రాతో హైడ్రామా చేస్తున్నారని ఆరోపించారు. రైతు బంధు గురించి అడిగితే కాళేశ్వరం ప్రాజెక్టు అంటున్నారని అన్నారు. ఖమ్మం, హైదరాబాద్‌లో తమను కాంగ్రెస్‌ ‌వాళ్లు రాళ్లతో కొట్టవొచ్చునని, వారు విసిరే రాళ్లే అధికారంలోకి బిఆర్‌ఎస్‌ ‌రావడానికి పునాది రాళ్లు అవుతాయి జాగ్రత్త అని అన్నారు. 16వ ఆర్థిక సంఘం గురించి వారు తప్పుడు లెక్కలు చెబితే, తాము బాధ్యతాయుతంగా బలమైన వాదనను వినిపించామన్నారు. నీటి ప్రాజెక్టులకు, మిషన్‌ ‌భగీరథకు, రాష్ట్ర అభివృద్దికి నిధులు కావాలని కోరామని, రాజకీయం కాదు, రాష్ట్రం ముఖ్యమని భావించి వాస్తవాలు లెక్కల రూపంలో చెప్పామన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకున్నడన్నరు.

 

పీఏసీకి ఎన్నిక జరిగిందని రేవంత్‌ ‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదదమని, ఎలక్షన్‌ ‌కాదు, సెలక్షన్‌ ‌ద్వారా జరిగిందని, రాజ్యాంగం ప్రకారం ఎన్నిక పెట్టాలి కానీ, అలా జరగలేదని అన్నారు. ఆదానికి ఓల్డ్ ‌సిటీ అప్పజెప్పుతానని మాట మార్చాడని, కరీంనగర్‌ ‌నుంచి వొచ్చి హైదరాబాద్‌లో నీ పెత్తనం ఏంటని గాంధీ కౌశిక్‌ ‌రెడ్డిని ప్రశ్నించారని, దానికి సమాధానంగానే కౌశిక్‌ ‌రెడ్డి మాట్లాడారు తప్ప, సెటిలర్ల మీద కౌశిక్‌ ‌కామెంట్‌ ‌చేయలేదని హరీష్‌ ‌రావు స్పష్టం చేశారు.

 

తొక్కిసలాటలో తనకు భుజం నొప్పి మొదలైందని, ఎమ్మారై స్కాన్‌ ‌తీసి 15 రోజుల పాటు ఫిజియోథెరపీ సూచించారని హరీష్‌ ‌రావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బిఆర్‌ఎస్‌ ‌నాయకులను అరెస్టులను చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆదిలాబాద్‌ ‌నుంచి అలంపూర్‌ ‌వరకు మహిళలని కూడా చూడకుండా అరెస్టులు చేయడం దుర్మార్గమని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page