- గౌరవెల్లి నిర్వాసితులను నట్టేట ముంచిన కెసిఆర్
- నిర్వాసితుల ఆందోళనకు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మద్దతు
సిద్దిపేట: బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభ ఖమ్మంలో పెట్టడం వెనుక ఉన్న మతలాబు ఏంటని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలదని దేశాన్ని దోచుకు తినేందుకే కేసీఆర్ కొత్త ప్లాన్ వేసిండని ఆరోపించారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల పట్ల సర్కారు అవలంబిస్తున్న వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. భూనిర్వాసితులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేటలో చేపట్టిన ఆందోళనలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గౌరవెల్లి భూ నిర్వాసితుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించకుండా పనులకు అడ్డుపడుతుంది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని మండిపడ్డారు. కుర్చీ వేసుకుని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న సీఎం.. 8 ఏండ్లుగా ఎందుకు జాప్యం చేస్తున్నారని పొన్నం ప్రశ్నించారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ అసమర్దత వల్లే యాసంగి పంటకు నీళ్లు అందడం లేదని ఆరోపించారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి త్వరగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిస్కారం కోసం 100 మంది రైతులతో వెళ్లి సీఎస్ కు వినతి పత్రం ఇస్తామని పొన్నం ప్రకటించారు.