- ముర్ము అభ్యర్థిత్వాన్ని స్వాగతించిన బీహార్ సిఎం నితీశ్
- ఇది తమకెంతో గర్వకారణమన్న ఒడిషా సిఎం నవీన్ పట్నాయక్
- ముర్ము ఎంపికను స్వాగతించిన జార్ఖండ్ ముక్తి మోర్చా
న్యూ దిల్లీ, జూన్ 22 : అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము (64)కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. సీఆర్‌పీఎఫ్ కమాండోల ‘జెడ్ ప్లస్’ భద్రతను ఆమెకు కల్పించినట్లు కేంద్రం బుధవారం వెల్లడించింది. జెడ్ ప్లస్ రక్షణ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే రెండవ అత్యున్నత స్థాయి సెక్యురిటీ. ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. జూలై 18న రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. కాగా, కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఎంపికైన సంగతి తెలిసిందే.
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడం పట్ల బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత పదవికి గిరిజన మహిళను ఎంపిక చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ద్రౌపది ముర్ము ఎంపిక గురించి ప్రధాని మోదీ మంగళవారం సాయంత్రం తనకు తెలిపారని వెల్లడించారు. ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తామని జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అధికారికంగా బుధవారం ప్రకటించారు. ఇదిలావుంటే ద్రౌపది ముర్ము ఎంపికను బిజూ జనతాదళ్(బీజేడీ), జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీలు స్వాగతించాయి.
’ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వంపై నాతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించినప్పుడు నేను చాలా సంతోషించాను. ఒడిశా ప్రజలకు ఇది నిజంగా గర్వకారణం’ అని బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు. మారాష్టాన్రికి గవర్నర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల జార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎం సంతోషం వ్యక్తం చేసింది. దేశ అత్యున్నత పదవికి గిరిజన మహిళను ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తున్నామని జేఎంఎం అధికార ప్రతినిధి మనోజ్ పాండే తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఆయన ఆకాంక్షించారు.