చండీఘడ్,జూలై18 : జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌లో అకాలీదళ్ ఎమ్మెల్యే మన్‌ప్రీత్ సింగ్ అయ్యాలీ పాల్గొనలేదు. ఆ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు ఆయన తన ఫేస్‌బుక్‌లో ఓ వీడియో ద్వారా తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థి ముర్ము లేదా విపక్ష అభ్యర్థి యశ్వంత్‌కు ఓటు వేయడం లేదని ఆయన ఆ వీడియోలో వెల్లడించారు. 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ కారణమని, అందుకే ఆ పార్టీకి ఓటు వేయడం లేదని అన్నారు. పంజాబ్ సమస్యల్ని కాంగ్రెస్ పరిష్కరించలేదన్నారు.
అధికారంలో ఉన్న బీజేపీ కూడా పంజాబ్ సమస్యల్ని పట్టించుకోలేదని, ఎందుకు అలా జరిగిందో తెలియదన్నారు. ద్రౌపది ముర్ము నామినేషన్‌కు ముందు సిక్కు వర్గీయులను ఎవరూ కలవలేదని ఆయన అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో అకాలీదళ్ పార్టీ ముర్ముకు మద్దతు పలికిన విషయం తెలిసిందే. అకాలీదళ్ పార్టీ తరపున పంజాబ్ అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ పార్టీకి లోక్‌సభలో ఇద్దరు ఎంపీలు ఉన్నారు.