రాష్ట్ర‌ అభివృద్ధిలో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

ఖ‌మ్మం క‌లెక్ట‌రేట్ లో అధికారులు ప్ర‌ముఖుల‌తో ముఖాముఖి

ఖమ్మంటౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్25 : రాష్ట్ర‌ అభివృద్ధిలో ప్ర‌తిఒక్క‌రూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, గవర్నర్ ప్రిన్సిప‌ల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ, మునిసిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ప్రముఖులు, కళాకారులు రచయితలు, క్రీడాకారులతో గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌ ముఖాముఖి స‌మావేశం నిర్వహించారు. ఖమ్మం జిల్లా ప్రాముఖ్యత‌, సంస్కృతి, సంప్రదాయాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ కు వివ‌రించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ  పద్మశ్రీ అవార్డు గ్రహీత  వనజీవి రామయ్య లాగే తాను పర్యావరణ వేత్తగా తన కెరీర్ ను ప్రారంభించానని, ప్రకృతి దైవంతో సమానమనే భావన మన అందరిలో ఉండాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు బాగుందని ప్రశంసించారు.  జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో న్యూట్రిషన్ గార్డెన్ చాలా బాగుందని, కొత్తగూడెం జిల్లాలో పాఠశాలల్లో మెడిసినల్ మొక్కలు పెంచుతున్నారని, ఖమ్మం జిల్లాలోను ఇది అమలు చేయాలని గవర్నర్ సూచించారు.  ఖమ్మం జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో అవకాశం ఉందని, సార్ నాథ్ లాగా బౌద్ద స్థూపం అభివృద్ధి కావాలన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్ టూర్ చాలా బాగున్నాయని, క్షేత్రస్థాయి పర్యటనలతో  పిల్లలు పాఠ్య పుస్తకాల కంటే మెరుగ్గా నేర్చుకుంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల ఎడ్యుకేషన్ టూర్ నిర్వహించాలని గవర్నర్ సూచించారు.

ప్రకృతి విపత్తులను మ‌నం ఆపలేమని, విపత్తుల సమయంలో ప్రాణ నష్టం జ‌ర‌గ‌కుండా ప్రజలకు చేపట్టిన పునరావాస చర్యలు, బాధితుల‌కు పరిహారం అందజేసి ఆదుకున్న విధానం అభినందనీయమని గవర్నర్ కొనియాడారు. వ‌ర‌ద‌ల్లో ప్రజలు కోల్పోయిన‌ ఆధార్ కార్డు, పాన్ కార్డు, చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లను  అందించేందుకు క్యాంప్ లు నిర్వహించ‌డంపై పట్ల కలెక్టర్ ను అభినందించారు.

కార్యక్రమంలో ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో యువకులైన కలెక్టర్లు ఉండటం అదృష్టమని, వారి నాయకత్వంలో జిల్లాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని అన్నారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ  ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు అధికంగా ఉన్న‌ డెంగ్యూ, అనిమియా కేసులను తగ్గించామన్నారు. జిల్లా ఖమ్మం ద‌వాఖానాలో ఉచిత‌ వైద్య పరీక్షలకు  డయాగ్నొస్టిక్ హబ్ ఏర్పాటు చేశామని తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా శాంపిల్స్ కలెక్షన్ కోసం పీహెచ్‌సీల వద్ద సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లాలో  బ్రెస్ట్ క్యాన్సర్, సర్జికల్ క్యాన్సర్ ముందుగానే గుర్తించి అవసరమైన శిక్షణ అందించామని అన్నారు.

జిల్లాలో 1512 ప్రభుత్వ పాఠశాలల్లో 1,53,967 మంది విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా  31 కోట్లతో పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన పనులు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.  పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య స్ఫూర్తితో మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు జిల్లాలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గం ఎర్రుపాలెం మండలంలో  20 వేల మంది మహిళా సంఘాల సభ్యులతో ఇందిరా మహిళా డైరీ ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో రాబోయే మూడేళ్ల‌లో మిర్చి సాగు విస్తరణకు, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో మిర్చి చిల్లింగ్ కేంద్రాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అధికంగా ఖమ్మం జిల్లాలోనే ఆయిల్ పామ్ సాగవుతోంద‌ని అన్నారు.

వనజీవి రామయ్య మాట్లాడుతూ చెట్లను మనం కాపాడితే చెట్లు మనల్ని కాపాడతాయని అన్నారు. భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆదాయం లభించే విధంగా ఎర్రచందనం, శ్రీ గంధం మొక్కలు పెంచుతున్నామని అన్నారు. నంది అవార్డు గ్రహీత కవి దేవేంద్ర మాట్లాడుతూ  బాల కార్మికులపై రాసిన గీతానికి నంది అవార్డు 2003 సంవత్సరంలో లభించిందని  తెలిపారు. సీనియర్ స్టేజ్ ఆర్టిస్ట్ పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గత 50 ఏళ్లుగా కళాకారుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. జిల్లాలో ఉన్న నాటక రంగ సంస్థలకు ఆర్థిక సహాయం అందజేయాలని  కోరారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చంద్రమోహన్ మాట్లాడుతూ,1870 వరద  ప్రభావిత కుటుంబాలకు గవర్నర్ అందించిన నిధులతో సహాయం అందించామని అన్నారు.

అనంతరం అంతర్జాతీయ క్రీడాకారిణీ పవిత్రా చారీ, అంతర్జాతీయ సెయిలర్ పి. అఖిల్, స్టేజీ ఆర్టిస్ట్ తాటి కొండల నరసింహా రావు, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు కవి ప్రసెన్ సాహిత్య, సీనియర్ ఆర్టిస్ట్ ఎన్. రవి, కవి మువ్వా శ్రీనివాస రావు,  వ్యాఖ్యాత, తెలుగు టెక్స్ట్ బుక్ రచయిత కన్నెగంటి వెంకటయ్య,  కవి, ఫైవెర్ అప్ ఫ్రంట్ అవార్డు గ్రహీత ఇబ్రహీం నిర్గున్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పీసర ప్రభాకరరెడ్డి,   సీనియర్ డ్యాన్స్ మాస్టర్ ఆచార్య ఎస్. మాధవరావు లతో గవర్నర్ కు తాము సంబంధిత రంగాల్లో అందిస్తున్న సేవల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, డిఇఓ సోమశేఖర శర్మ, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page