రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

  • వానాకాలం వొచ్చినా రైతులకు రైతు బంధు ఇవ్వలేదు..ఇంకా ఎప్పుడిస్తారు
  • రైతులకు రైతు బంధు లేదు.. ఉద్యోగులకు జీతాలు లేవు
  • ఎనిమిదేళ్ల మీ పాలనలో తెలంగాణ దివాలా
  • సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 22 : ‌ధనిక రాష్ట్రంగా ప్రారంభమైన స్వరాష్ట్ర ప్రస్థానం ఎనిమిదేళ్ల కేసీఆర్‌ ‌పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్ధితికి చేరుకుందని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. సకాలంలో జీతాలు ఇవ్వకుంటే వాళ్ల కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రశ్నించారు. జూన్‌ ‌నెల కూడా ముగుస్తున్నా…ఇంత వరకు వారికి మే నెల జీతం కూడా ఇవ్వని తమరి నిర్వాకాన్ని ఏమని ప్రశ్నించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు, రైతులకు రైతుబంధు నిధులు ఇవ్వకపోవడంపై బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో హోంగార్డులు, మోడల్‌ ‌స్కూల్‌ ‌సిబ్బందికి వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. మోడల్‌ ‌స్కూళ్లలో టీచింగ్‌, ‌నాన్‌ ‌టీచింగ్‌ ‌సిబ్బంది జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. వారు కూడా మే నెల జీతాల కోసం చెకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారని తెలిపారు. వారికి నెల జీతం ఇవ్వలేని దుస్థితి ప్రభుత్వానికి ఎందుకు వొచ్చిందని టీపీసీసీ చీఫ్‌ ‌లేఖలో నిలదీశారు.

తొలకరి మొదలై… వానాకాలం పంటకు సమయం ఆసన్నమైనా ఇంత వరకు రైతుబంధు నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. ఈ సారి రైతుబంధు ఉంటుందా…ఉంటే ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. అసలు ఇస్తారా లేదా అని పేద రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ‘వి•రేమో బీఆర్‌ఎస్‌… ‌వీఆర్‌ఎస్‌ అం‌టూ ప్రజలకు కనిపించకుండా, అసలు రాష్ట్రంలోనే ఉన్నారో లేదో తెలియకుండా కాలక్షేపం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ ‌దుష్ట పాలనలో రాష్ట్ర ఖజానా దివాలా తీసిందని, అప్పులు తెచ్చుకుంటే తప్ప పూట గడవని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకుని వొచ్చారని ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని రేవంత్‌ ‌రెడ్డి తన లేఖలో డిమాండ్‌ ‌చేశారు.

లేని పక్షంలో ఆయా వర్గాలకు అండగా కాంగ్రెస్‌ ‌కార్యచరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం, రైతులకు రైతుబంధు నిధులు ఇంకా విడుదల చేయలేకపోవడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి అద్దం పడుతుందన్నారు. సిబ్బందికి వెంటనే జీతాలు అందించాలని డిమాండ్‌ ‌చేశారు. సకాలంలో జీతాలు ఇవ్వకుంటే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విందులు, విలాసాలు, విదేశీ యాత్రలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. పూట గడవని హోం గార్డుల పరిస్థితి గురించి మాత్రం ఆలోచించడంలేదని లేఖలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page