.నిరుద్యోగ యువతను కేసీఆర్ దగా చేశారు
•ఎన్నిచేసినా తండ్రీకొడుకుల ఉద్యోగం ఊడిపోవడం ఖాయం..
•కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ ప్రజలను మోసం చేశాయి
•బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని..ఏ వర్గం కూడా నేడు బీఆర్‌ఎస్‌కు వోటు వేసేందుకు సిద్ధంగా లేరని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘ఎన్నికల ప్రచారంలో కేసీఆర్, కేటీఆర్ కాలుకు బలపం పట్టుకొని తిరుగుతూ మరీ ప్రజలను ప్రలోభాలు, మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నిచేసినా తండ్రీకొడులకుల ఉద్యోగం ఊడిపోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ సందెట్లో సడేమియా మాదిరిగా దూరుదామని ప్రయత్నం చేస్తోంది. కర్ణాటకలో రైతులను, మహిళలను, యువతను, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలూ యువత, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ వర్గానికి చెందిన ప్రజలను మోసంచేశాయి. అందుకే ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారు. కర్ణాటకలో చేదు అనుభవాలు ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి తీసుకు రావాలన్నా లక్ష్యంగా విస్తృతంగా కార్యకర్తలు, నాయకులతో ప్రచారం కొనసగిస్తున్నాం. బిజెపికి చెందిన బిసి ముఖ్య మంత్రి కావడం ఖాయం. బిసి ముఖ్య మంత్రి అంటే అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి. అభివృద్ధి సంక్షేమం సమదృష్టితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రధాన అంశం. 60 లక్షలకు పైగా యువత ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రంగా మారారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉస్మానియా కేంద్రంగా ఉద్యమించిన యువత.. నేడు స్వరాష్ట్రంలో మోసానికి గురయ్యారు. నిరుద్యోగులు, యువత పల్లెల్లో, పట్టణాల్లో, వాడవాడలా కేసీఆర్ ప్రభుత్వ మోసాలను వివరిస్తూ.. వారిని ఓడించడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి ఆగమైన యువత…. కూలీలుగా మారలేక, బతుకు భారంగా మారి, ఆత్మాభిమానం చంపుకోలేక ధీనస్థితిలో ఉన్నారు. కొలువుల సాధనే లక్ష్యంగా ఉద్యమిస్తే.. కొలువుల అంశాన్ని అడ్డంపెట్టుకుని అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్… అసెంబ్లీ వేదికగా లక్షా 90 వేల ఉద్యోగ ఖాలీ లు భర్తీ చేస్తామని చెప్పింది. ఉద్యోగాలివ్వకుండా మోసం చేసింది. పదవీవిరమణ పొందిన ఉద్యోగ ఖాలీ లతో కలిపి మొత్తం రాష్ట్రంలో మొత్తం 3లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. టీఎస్ పీఎస్సీ లో 25 లక్షల మంది పేర్లు నమోదు చేసుకుని, ఉద్యోగాల కోసం వెంపర్లాడుతున్నారు. తెలంగాణలో లక్షా 91,126 ఉద్యోగాలు ఖాలీలున్నాయని పీఆర్సీ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 50 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు.. ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది.
డీఎస్సీ వేయకుండా నియామకాలు జరపకపోవడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడంతో పేద పిల్లల చదువులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. మిషన్ భగీరథ, హార్టికల్చర్ శాఖలో దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఎస్సీ, ఎస్టీ వెల్పేర్ డిపార్ట్ మెంట్ లో నో వర్క్ పేరిట ఉద్యోగాలను ఊడగొట్టింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానమే ఉండదని చెప్పిన బీఆర్‌ఎస్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యకుండా మోసం చేసింది. ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు రాజకీయ ఉద్యోగాలను మాత్రం రెగ్యులరైజ్ చేసుకున్నారు. కాని, పేద యువతపై మనసురాలేదు. తెలంగాణ ఏర్పడేనాటికి ఉద్యోగ ఖాళీలు… భర్తీ చేసిన ఉద్యోగాల లెక్కలు చెప్పకుండా… ట్విట్టర్ పిట్ట మసిపూసి మారేడుకాయ చేసిన చందంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా దగా చేశారు. గత బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి సంబంధించి ఊసేలేదు. కొలువులు ఇవ్వని, నిరుద్యోగ భృతి ఇవ్వని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త కమిషనరేట్లు, గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారు. దానికనుగుణంగా ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి.
కాని చేయకుండా మోసం చేశారు. 1200 మంది నిరుద్యోగులు ఉద్యమంలో బలిదానమయ్యారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో నిరుద్యోగ యువతను కేసీఆర్ దగా చేశారు. విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య విషయంలోనూ… ప్రేమ కారణంతోనే చనిపోయారంటూ అపవాదు మోపారు. ఉద్యోగాలు రావాలంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోవాల్సిన అవసరం ఉంది. రూ. 2వేల పెన్షన్ ఇచ్చి… 50 వేల జీతం పొందే మీ పిల్లలు జీతాలు కోల్పోతున్నారు. అది తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. 18 సార్లు పరీక్షలు వాయిదాపడి ఆవేదనతో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్ ను నమ్మితే పరీక్షలు వాయిదాలు తప్పితే … పిల్లలకు న్యాయం జరగదు. నమ్మించి మోసం చేసిన కేసీఆర్ కొలువు పోవాలంటే బీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా వోటు వేయాలి. కేసీఆర్ సీఎం కొలువు పోతేకాని, విద్యార్థులు, యువతకు ఉద్యోగాలు రావు. వాగ్ధానాల్లో వదురుబోతు.. కేసీఆర్.. గాలం ఇస్తే చిక్కే చేపపిల్లలం కాదు.. పథకాలు పారేస్తే వోట్లు వస్తాయనేందుకు ఫూల్స్ కాదు.. షూటర్లం అంటూ ప్రజలు నిరూపించుకోవాలి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలతో పాటు, ఆ పార్టీలను తోలుబొమ్మలా ఆడిస్తున్న మజ్లిస్ పార్టీని తరిమి పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలని పిలుపునిస్తున్నాం.
సకల జనుల విజయ సంకల్ప సభ(బహిరంగ సభ లు) నవంబరు 18వ తేదీ గద్వాలలో జరగనుంది. అదే రోజు నల్గొండలో, వరంగల్ లో.. మొత్తం మూడు బహిరంగ సభలు ఉంటాయి. అనంతరం సికింద్రాబాద్లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమవుతారు. కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును కాపాడుకోవడమే బిజెపి లక్ష్యం. బీసీ కులగణనపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తాం.. బీసీ సీఎం అంటే బీసీల కోసం మాత్రమే పనిచేసే వ్యక్తి కాదు… సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని నిర్లక్ష్యం చేయబడిన, అధికారానికి దూరంగా నెట్టివేయబడిన వర్గాలను అధికారానికి చేరువచేయడమే బిజెపి లక్ష్యం. అన్ని వర్గాలకు సమన్యాయం, సమదృష్టితో పనిచేసేది బిజెపి. నవంబరు 18న కేంద్రమంత్రి అమిత్ షా చేతుల మీదుగా బిజెపి మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు.