రాష్ట్ర హక్కుల కోసం పోరాడేది బిఆర్‌ఎస్‌ ఒక్కటే

పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపిలకు మాజీ సిఎం కెసిఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బిఆర్‌ఎస్‌ పార్టీ ఒక్కటేనని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బిఆర్‌ఎస్‌ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. బిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం నాడు ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల ఆఖరులో ప్రారంభమై వారం రోజులపాటు సాగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో రాష్ట్రం తరపున బలమైన వాదనలు వినిపించాలని కెసిఆర్‌ స్పష్టం చేసారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండిరగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌ పార్టీదేనన్నారు.

కాగా నాడైనా..నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బిఆర్‌ఎస్‌ ఎంపీలదేనని స్పష్టం చేశారు. దాదాపు మూడు గంటల పాటు సాగిన సమావేశంలో, పార్లమెంటు ఉభయ సభల్లో, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించాల్సిన విధానాలపై అధినేత కేసీఆర్‌ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ, లోకసభ పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వర్‌ రావు సహా పార్టీ ఎంపీలు రాములు, బీబీ పాటిల్‌, పసునూరి దయాకర్‌, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, కెఆర్‌ సురేష్‌ రెడ్డి, వెంకటేష్‌ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్‌, వద్దిరాజు రవిచంద్ర, మలోత్‌ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, దేవకొండ దామోదర్‌ రావు, గడ్డం రంజిత్‌ రెడ్డిలతో పాటు కేటీఆర్‌, హరీష్‌ రావు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page