ధరణిని తీసేస్తే రైతుబంధు, రైతు బీమా, వడ్లమితే పైసలు ఇచ్చేదెట్లా
గొడ్డలి భుజాన పెట్టుకుని తిరుగుతున్నారు
అందుకే ఆలోచించి వోటేయాలి
ఆగమాగం అయితే వెనక్కి పోతాం
పదేళ్లుగా ప్రశాంతంగా తెలంగాణ
కాంగ్రెస్ వొస్తే మళ్లీ మత కల్లోలాలు తప్పవు
పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ విమర్శలు
రాహుల్ గాంధీ ధరణిని తీస్కపొయి బంగాళాఖాతంలో వేస్తం అంటున్నడని, ఆయనకు ఎవుసం తెల్వదని, అందుకే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తమని మాట్లడతడని, దీనిపై రైతులు సీరియస్గా ఆలోచన చేయాలన్నాని సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ వాళ్లు కుళ్లాగా చెప్తున్నరని, ధరణిని తీసేసేందుకు గొడ్డలి భుజాన పెట్టుకుని రెడీగా ఉన్నరని, మరి ధరిణిని తీసేస్తే రైతుబంధు ఎట్లొస్తది..వడ్లమ్మిన పైసలు ఎట్లొస్తయ్….రైతు చనిపోతే రైతు బీమా ఎట్లొస్తది…అంటూ కెసిఆర్ ప్రశ్నించారు. మళ్లీ ఎమ్మార్వో ఆఫీసు, పహానీ నకల్లు, అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం అనుకుంట తిరగాల్సి వొస్తదని కెసిఆర్ హెచ్చరించారు. ఆఫీసులల్లకు పోతే…ఎన్నెకరాలు ఉందంటరు..ఎంతొస్తదంటరు…రూ.80 వేలు వొస్తయంటే నాకు ఓ రూ.30 వేలు ఇయ్యి సంతకం పెడుతం అంటరని విమర్శించారు.
అంతేనా..కాదా..అంటూ ప్రజలను అడిగారు. అంటే మళ్ల దలారీ రాజ్యం వొస్తదని, ఇయ్యన్నీ ఆలోచించి వోటేయాల్నని సీఎం కేసీఆర్ కోరారు. మంగళవారం పెద్దపల్లి ప్రజా ఆశీర్వాద సభలో కెసిఆర్ మాట్లాడుతూ…ఈ వందేండ్లలో ఈ పదేండ్లే తెలంగాణ ప్రశాంతంగా ఉన్నదని, రాష్ట్రంలో కర్ఫ్యూ లేదు..లొల్లి లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రం మంచిగా ఉన్నదని, అందరం కలిసిమెలిసి బతుకుతున్నామని, అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు తెల్లారితే కర్ఫ్యూ, మతకల్లోలాలు, ఆ పంచాయితీలన్నీ ఎవరు పెట్టారో ఆలోచించాలన్నారు. వోటు అనేది ముఖ్యమని, పాలిటిక్స్ కూడా చాలా ముఖ్యమని, రాయి ఏందో..రత్నం ఏందో గుర్తు పట్టాలని సూచించారు. పార్టీల వైఖరి కూడా చాలా ముఖ్యమని కేసీఆర్ అన్నారు. ఎవరికిపడితే వాళ్లకు వోటేయొదద్దని, ఆగం కావొద్దని, ధరణిని తీసేస్తే మళ్లీ పాత రోజులే వొస్తయని, దలారీ రాజ్యం అయితదని, రిజిస్ట్రేషన్ల కోసం నానా తిప్పలు అయితయని, వెనుకటి లెక్కనే విూ భూమి విూద ప్రభుత్వంలో ఉన్న అధికారులకు పెత్తనం వొస్తదని, వాళ్లు తల్చుకుంటే ఎవరి భూమిని ఎవరి పేరు విూదకైనా మార్చే పరిస్థితులు మళ్లీ వొస్తయన్నారు.