రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో భద్రతా ఏర్పాట్లలో పోలీసుల వైఫల్యం
బుధవారం జరిగిన రాహుల్ గాంధీ యాత్రకు భద్రత ఏర్పాట్లు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు. మూడంచెల భద్రతా వలయాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఆయనకు ప్రత్యేకంగా ఎన్‌ఎస్‌జి దళం ఉన్నప్పటికీ, ప్రజలను నిలువరించడంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ కింద డివైడర్‌పై నిలబడిన జనాలు రాహుల్ యాత్రలోకి ఒక్కసారిగా దూసుకు వెళ్లారు. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం, డివైడర్‌కు ఆనుకొని నడవడంతో ప్రజలు రక్షణ వలయంలోకి రావడానికి నివారించలేకపోయారు. మాతృశ్రీ నగర్ వద్ద వేదిక ఏర్పాటు చేసి జనాలను సమీకరించడంతో రాహుల్ యాత్ర అక్కడకు చేరుకునే సరికి రక్షణ సిబ్బంది వారిని దురుసుగా నెట్టివేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త్త వాతావరణం ఏర్పడింది. ప్రజల చెప్పులు, జెండాలు, ప్లకార్డులు, వాటర్ బాటిల్స్ చెల్లాచెదురుగా పడిపోయి రణ రంగాన్ని తలపించింది. అనేకమంది మహిళలు ఈ తోపులాటలో కిందపడి గాయాల పాలయ్యారు. ఒక యువతికి గాయం అయి రక్తం కారడంతో రాహుల్ కాన్వాయ్ లోని అంబులెన్స్ ద్వారా హాస్పిటల్‌కి తరలించారు.
మహారాష్ట్రకు చెందిన మాజీమంత్రి నితిన్ రౌత్ కూడా యాత్రలో పాల్గొని వెంట నడిచారు. అయితే తోపులాటలో కిందపడిపోగగా ఆయన కంటికి గాయం అయ్యింది. కాగా పాదయాత్రలో తనదైన సహజ శైలిలో మానవత్వం చాటుకున్నారు రాహుల్ గాంధీ. రాహుల్‌ను కలిసే క్రమంలో ఓ వృద్ధురాలు కిందపడిపోయింది. ఆమెను చేయి పట్టి లేపి నీళ్లు అందించారు రాహుల్. ఆపై దగ్గరకి తీసుకుని ఆమెకు సపర్యలు చేశారు. ఆమెకు చెప్పులు తన చేతులతో అందించారు. రాహుల్ సపర్యలకు సదరు మహిళ ఆనందంతో చేతులెత్తి మొక్కింది. అయితే అది జాతీయ రహదారి కావడం, రాహుల్ యాత్ర రాకముందే వేలాదిగా జనం అక్కడ గుమి కూడడంతో ఈ సంఘటన జరిగింది. దీంట్లో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ యాత్ర పరిస్థితి తెలిసిన పోలీసులు ముందుగానే వారిని పక్కకు జరిపి ఉండాల్సింది. దీనిని పట్టించుకోకపోవడంతో తమ నాయకుడిని చూడాలని ఆత్రుతతో వొచ్చిన జనాలు గాయాలపాలై వెను తిరగాల్సి వొచ్చింది.
రాహుల్ పాదయాత్ర కొంతమేర రద్దు
ఈ పరిణామాల నేపథ్యంలో రాహుల్ యాత్ర కొంతమేర రద్దయింది. సాయంత్రం నాలుగు గంటలకు మదీనాగూడలోని కెనరా గ్రాండ్ హోటల్ నుండి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా, అక్కడి నుండి ప్రత్యేక కాన్వాయిలో పటాన్ చేరు వెళ్లిపోయారు. అప్పటికే బీహెచ్‌ఈఎల్ చౌరస్తా వద్ద ఇందిరాగాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేయాల్సిన కార్యక్రమం రద్దయింది. అక్కడ రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు పలువురు విద్యార్థులు భరతమాత తదితర దేశ నాయకుల వేషాదరణలో విచ్చేశారు. కానీ ఉదయం జరిగిన ఘటనల నేపథ్యం, సాయంత్రం పూట కావడంతో వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందనే కారణాలవల్ల రాహుల్ యాత్రను రద్దు చేసుకుని వెళ్లే విధంగా అధికారులు మార్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. గంగారం చందానగర్ బిహెచ్‌ఇఎల్ కోడళ్ళలో వందలాదిగా తమ నాయకుడి రాక కోసం ఎదురుచూసిన జనాలు ఒక్కసారిగా నిరాశ, నిస్పృహలకు గురై వెనుదిరిగారు.