దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటివరకు చేపట్టిన పాదయాత్రను పరిశీలిస్తే చాలా వరకు ఆయా పార్టీలకు లేదా నాయకుడికి కలిసిరావడాన్ని చూస్తున్నాం. ఈ పాదయాత్రల ద్వారా వారు జనంతో మమేకం కావడం, వారి ఈతిబాధలను తెలుసుకుని తాము అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం సహజంగా జరుగుతున్న విషయం. అయితే అధికారంలోకి వొచ్చిన తర్వాత ఆ పార్టీలు లేదా ఆ నాయకులు తమ హామీలను అటకెక్కించడం అంతే సాధారణమైపోయింది. దీంతో మళ్ళీ ప్రజల్లో పాలకపక్షంపై వ్యతిరేకత రావడం, ప్రతిపక్షాలు దాన్ని తమ రాజకీయ లబ్ధికి అనుకూలంగా మార్చుకోవడం కూడా అంతే సహజం. ప్రజలుకూడా ఎప్పటికప్పుడు మార్పును కోరుకుంటుండడంతో మరో పార్టీ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఏదైతేనేం పాదయాత్రలన్నది ప్రతిపక్షాలకు అనుకూల ఆయుధాలుగా మారుతున్నాయి. ఉమ్మడి ఆంధప్రదేశ్‌నే తీసుకుంటే ఆనాటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పక్షాన డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి.
ఆంధ్ర, తెలంగాణలో ఆయన జరిపిన సుదీర్ఘ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రిని చేసింది. ముఖ్యంగా ఈ యాత్ర ఆయనకు ఎంతో మంది అభిమానులను తెచ్చిపెట్టింది. ఆయన అకాలంగా మరణించినప్పుడు ఆ వార్తను తట్టుకోలేక కొందరు ఆత్మహత్యచేసుకున్నారంటే ఆయన్ను ఏ మేరకు అభిమానించారన్నది స్పష్టమవుతున్నది. ఆ తర్వాత అదే తరహాలో రాష్ట్ర విభజన నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు 2013లో పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఆయన 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఏపికి ముఖ్యమంత్రి అయ్యారు. తండ్రిలాగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2017 నుండి 2019 వరకు విడుతల వారీగా రెండు రాష్ట్రాల్లో పాదయాత్రలు చేసి అనేక మంది అభిమానులను సంపాదించుకోగలిగాడు. అది ఆయనకు కలిసివచ్చింది. ఆయన ఏపి ముఖ్యమంత్రిగా అఖండ మెజార్టీని సాధించుకోవడానికి దోహదపడింది.
ఈ పాదయాత్రల పరంపర మనకు మహత్మాగాందీ నుండి సంక్రమించాయనే చెప్పవచ్చు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆరోజు అంటే 1930లో గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం మొదలు, స్వాతంత్య్రం వొచ్చిన తర్వాత వినోభాబావే చేపట్టిన భూదాన ఉద్యమం ఒకటి. విచిత్రమేమంటే అదికూడా తెలంగాణనుండే ప్రారంభం కావడం. ఆ తర్వాత కాలంలో 1983లో అప్పటి యంగ్‌టర్క్ నాయకుల్లో ఒకరు, దివంగత మాజీ ప్రధాని చంద్రశేఖర్ కన్యాకుమారి నుంచి దిల్లీ వరకు ఆరు నెలలపాటు సుమారు నాలుగు వేల కిలోమీటర్లకు పైగానే పాదయాత్ర చేసారు .. యాత్రలు చేపట్టిన వారంతా ఏదోవిధంగా తమ లక్ష్యాన్ని సాధించుకున్నవారే. ఇప్పుడు జాతీయ కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టారు. నూటా ఆరవై రోజుల్లో పన్నెండు రాష్ట్రాలను చుట్టుముట్టి సుమారు 3500 కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర కొనసాగించే కార్యక్రమం కొనసాగుతున్నది. ఈ యాత్రకు ఆయన భారత్ జోడోగా నామకరణం చేశారు.
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న అనేక రాజకీయ పార్టీల మధ్య ఉన్న విద్వేషాలు , వైషమ్యాలు, మతఘర్షణలు ఒక వైపు, మరో వైపున ప్రజల బాధలు, కష్టాలు, కన్నీళ్ళకు కారణాలు, వాటి పరిష్కారమార్గాల అన్వేషణే ఈ యాత్ర ప్రధాన లక్ష్యంగా రాహుల్ చెబుతున్న మాట. విద్వేష రాజకీయాలనుంచి ఈ దేశాన్ని, యువతను రక్షించుకోవాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెబుతున్నారు. యువతే మన దేశ భవిష్కత్. వారికి సరైన ఉపాధి, భవిష్యత్ చూపిస్తే దేశ భవిష్యత్‌ను వారే నిర్మిస్తారంటూ ఆయన ఈ పాదయాత్ర సందర్భంగా చేస్తున్న ప్రసంగాలు యువతను, ప్రజలను ఆకర్షిస్తున్నాయి. దేశాన్ని పూర్వంలాగా, అందమైనదిగా తీర్చిదిద్దాలంటున్న ఆయన మాటలు భవిష్యత్‌లో భారత్ జోడో లక్ష్యం నెరవేర్చేదిగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. ఆయన పాదయాత్రల్లో లక్షలాది మంది పాల్గొంటున్న తీరుకు గతంలో ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిర అన్నట్లు రాహులే భారత్, భారతే రాహుల్ అన్న నినాదాలు ప్రబలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతున్నది .
– ప్రజాతంత