–మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి పి.సబితా ఇంద్రారెడ్డి
– 50 వేల మందితో భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు
-గులాబీ వనంగా మహేశ్వరం
-సబితమ్మ నామినేషన్ కు వేలాదిగా తరలివచ్చిన జనహాని
– దారి పొడవునా పూల జల్లులు
-సబితమ్మ కు మద్దతుగా వేలాదిగా కదిలిన యువతరం
-ఐదు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ
మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 10: ప్రజల ఆశీర్వాదంతో మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని, మీ ఆశీస్సులతో మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు చేవెళ్ల కౌకుంట్ల గ్రామంలోని ఇంద్రారెడ్డి సమాధిని నామినేషన్ పాత్రలతో సందర్శించి, విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడి నుండి కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి, వేలాది మందితో భారీ ర్యాలీగా మహేశ్వరం చేరుకొని.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు ఎగం మల్లేశం, దయానంద్ గుప్తా, జెడ్పీ చైర్మన్ తీగల అనిత రెడ్డి, తనయులు కార్తీక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మీ ఆశీర్వాదంతో మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న, ఒక అడబిడ్డగా ఆశీర్వదించి, గెలిపించండి, మీ సేవకురాలిగా సేవ చేస్తానన్నారు. రియర్ ఎస్టేట్ లీడర్లకు, ఒక ప్రజా నాయకురాలికి మధ్య జరుగుతున్న పోరాటం, ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. ఐదు ఏళ్ళుగా కనిపించని ఈ నాయకులు, ఎన్నికలు రాగానే ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పారా చూట్ నాయకులకు మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. కాంగ్రెస్ వాళ్లు వస్తే మోసళ్ళు వస్తాయి, కరెంటు ఉండదన్నారు. 24 గంటల విద్యుత్ తో నేడు రాష్టం సస్యశ్యామలంగా మారిందన్నారు.మరొక సారి కేసీఆర్ ని గెలిపిస్తే రూ.400లకే వంట గ్యాస్ సీలిండర్, ప్రతి ఒక్కరికి రూ.5 లక్షల భీమా, ప్రతి గృహిణికి నెలకు రూ.3వేల రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు.
జడ్పీ చైర్మన్ తీగల అనిత రెడ్డి మాట్లాడుతూ.. పట్లోళ్ల, తీగల కుటుంబాలు ఏకమైనాయి మహేశ్వరంలో బిఆర్ఎస్ కు తిరుగులేదన్నారు. నామినేషన్ కు తరలి వచ్చిన అశేష జనాన్ని చూస్తేనే సబితా ఇంద్రారెడ్డి విజయం ఎప్పుడో ఖాయమైందన్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గములో జరిగిన అభివృద్ధి చూసి బిఆర్ఎస్ పార్టీని ఆదరించాలని అన్నారు.
15 ఏళ్లుగా ప్రజల మధ్యలోనే ఉన్న సబితా ఇంద్రారెడ్డి పనితీరు చూసి అభివృద్ధికి పట్టం కట్టలన్నారు. బిఆర్ఎస్ జాతీయ అధికార ప్రతినిధి కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ఎక్కడైనా నామినేషన్ వేసే స్థలంలోనే పార్టీల వాళ్ళు కనిపిస్తారు, కానీ ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గములో ఊరు, వాడ ఏకమై గులాబీ పండుగ వాతావరణం నెలకొందన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలకు, యువతకు, పార్టీ శ్రేణులకు, అభిమానులకు సబితా ఇంద్రారెడ్డి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.