- కలెక్టర్‌తో విద్యార్థులు జరిపిన చర్చలు విఫలం
- అధికారులతో అత్యవసరంగా భేటీ అయిన మంత్రి సబిత
బాసర, ప్రజాతంత్ర, జూన్ 15 : బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన రెండో రోజూ కొనసాగింది. ట్రిపుల్ ఐటీలో సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. రెగ్యులర్ వీసీ లేకపోవడం, ఫ్యాకల్టీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతునామని చెబుతున్నారు. నాసిరకం భోజనం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ లేదా కేటీఆర్ కాలేజీని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు నిరసన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. విద్యార్థులకు మద్ధతుగా ఆందోళనలో పాల్గొనడానికి వొచ్చిన తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ భేటీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నిర్మల్ జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నత విద్యామండలి అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో జరిపిన చర్చల సారాంశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకున్నారు. మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో కలెక్టర్ జరిపిన చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. సమస్యలకు సరైన పరిష్కారం చూపకపోవడంతో విద్యార్థులు చర్చల నుంచి బయటకు వొచ్చేశారు. కేవలం రూ.10లక్షల విలువైన పనులకు నిధులు కేటాయిస్తామని కలెక్టర్ చెప్పడం, సీఎం కేసీఆర్ క్యాంపస్‌ను సందర్శించే ప్రసక్తే లేదని స్పష్టం చేయడంపై స్టూడెంట్స్ అంసతృప్తి వ్యక్తం చేశారు. ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు.