- డిజిపిని కలిసి ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు
- రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : పీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రేవంత్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ అనిల్ కుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బుధవారం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టి. రవీందర్ రావు, ఎల్.రమణ, తాతా మధు, శంభిపూర్ రాజు, దండె విఠల్ కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీని కలిశారు. రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో ముఖ్యమంత్రి పరిపాలనా కార్యాలయం, నివాసాన్ని గైన్రైడ్స్ పెట్టి పేల్చి వేయాల్సిందిగా కోరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. చట్ట సభల్లో సభ్యుడిగా ఉండి అధికార భవనాలను కూల్చివేయాల్సిందిగా కోరడమంటే , ఖచ్చితంగా ఇది చట్టవ్యతిరేక చర్యగా భావించాలని కోరారు.
రేవంత్ ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైన చర్యలను వెంటనే తీసుకోవాలని డీజీపీని కోరారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. ప్రగతి భవన్‌ను పేల్చాలన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శాసనసభ వి•డియా పాయింట్లో సుదర్శన్‌రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి, జానారెడ్డి సమర్థిస్తారా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌ను పేల్చాలన్న రేవంత్‌పై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలని, ఈ వ్యాఖ్యలపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. మహాత్మా గాంధీ మూల సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ మార్చుకుందా అని దుయ్యబట్టారు. ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ప్రభుత్వ ఆఫీస్ లని పేల్చాలని డిమాండ్ చేస్తారా అని నిలదీశారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి క్రిమినల్ మాదిరిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తే, రేవంత్ తోడో యాత్ర అంటున్నారని విమర్శించారు. ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పీసీసీ అధ్యక్షుడు సంఘ విద్రోహ శక్తులా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మావోయిస్టులను రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారా మావోయిస్టులపై కాంగ్రెస్ స్టాండ్ ఏమిటి? విధ్వంసమే విధానం అని చెబుతారా ? పేల్చేయడం? కుల్చేయడం అసాంఘిక శక్తుల మాట్లాడే మాటలని పేర్కొన్నారు.