దశాబ్దకాలంగా అధికారానికి దూరమై తెలంగాణ ఇచ్చింది మేమేనని రెండు పర్యాయాలు మొత్తుకున్నా నమ్మని ప్రజలు ఈసారి ఎలాగైనా కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని తాపత్రయం పడ్డట్టు ఫలితాలను చూస్తే అర్థమైంది. కేసీఆర్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకుండా ఉండేందుకు కాంగ్రెస్ ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని బహిరంగంగా ప్రకటించారు. 2018లో జరిగిన ఎన్నికలలో వోటమికి గల కారణాలను వెతికి, పునరావృతం కావొద్దని, దూకుడు స్వభావం ఉన్న వ్యక్తిగా గుర్తించి పిసిసి అధ్యక్షులుగా అనుముల రేవంత్ రెడ్డిని నియమించారు. ఇక అక్కడ మొదలైంది కాంగ్రెస్ గూడుపుటాన్.. ఎవరికి వారే కుంపట్లు చూస్తే తెలంగాణలో అధికారం తెస్తారా? అనేది జాతీయ నాయకత్వానికే తలనొప్పిగా మారింది. సంగారెడ్డి ఎమ్యెల్యే జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకంగా తిరుగుబాటు చేసి ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఊడపీకేందుకు నోటిదూల కారణమైంది. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలో పరాజయం పాఠాలు నేర్చుకున్నామని కాంగ్రెస్ రేవంత్ బహిరంగంగానే వొప్పుకున్నారు. హుజురాబాద్ ఎన్నిక అంతా సీరియస్ తీసుకోక పోయినా మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి గెలుపు కోసం రేవంత్ మీద వేసుకొని ఓటమి పాలవ్వడంతో ఇక రేవంత్ రెడ్డి కంటతడి పెట్టినారు. ఒకానొక సమయంలో కాంగ్రెస్ కురువృద్దులు రేవంత్ పనైపోయినట్లుగా ప్రచారం చేసారు. స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్లుతున్నారన్న బలమైన ఆరోపణలు, వ్యతిరేకవర్గానిదే పై చేయి ఉన్నా కలత చెందలేదు. వరుసగా రెండు ఉప ఎన్నికల్లో ఓటమి అవకాశవాదులు అధికార పార్టీలోకి చేరిపోతున్నకేడర్ ను చూసి నిరుత్సాహం పడలేదు. కేసీఆర్ వ్యూహంలో రేవంత్ వ్యతిరేకులు చిక్కుకొని తిరుగుబాట్లను ప్రోత్సహిస్తున్నారనే భావం ఏర్పడిరది.
నాటి టీఆర్‌ఎస్ కు ప్రత్యమ్నాయంగా 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ బక్కమనిషిని ‘ఢీ’ కొట్టడానికి టీజేఎస్,టీడీపీ, సీపీఐ కల్సి మహాకూటమి ఏర్పాటు చేసుకొని రంగంలోకి దిగింది. ఇప్పుడు వొచ్చిన వేవ్ కంటే ఎక్కువగా కేసీఆర్ వోడిపోయినట్టే లెక్కలు వేసుకున్నారు. అన్నిటిలో కేసీఆర్ వోడిపోతారని సర్వత్రా ప్రతికూల వాతావరణం ఉందని ఒకటి,రెండు తప్ప అన్ని సర్వే సంస్థలు ముక్తకంఠంతో చెప్పగలిగినాయి. వీటికి ప్రాతిపదిక జనాభిప్రాయం కాదు. టీఆర్‌ఎస్ కు కష్టకాలం వచ్చిందని అశాస్త్రీయంగా వాదనలకు దిగినారు. ప్రజలకు మెరుగైన ప్రత్యామ్నాయాన్ని ఇవ్వగలమని కాంగ్రెస్ మ్యేనిఫెస్టో పదే పదే చెప్పినా, టీడీపీ అంటేనే ఆంధ్ర పార్టీ అని, కలువడం క్షమించదగిన విషయం కాదని కూటమిలో చంద్రబాబు కలయిక చావుదెబ్బతీసింది. తెలంగాణకు సంబంధించినంత వరకు చంద్రబాబును అవాంఛిత శక్తిగా ముద్ర వేశారు. అటువంటిది జాతీయ రాజకీయాల్లో తలబడేందుకు కాంగ్రెస్ కు ఎదో పెద్ద ప్రయోజనం ఉంటుందని తెలిసో..తెలియకో రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయంతో ఎన్నికల్లో ఎదురుగాలి తప్పలేదు. రాజకీయ పాఠాలు చెప్పే కోదండరాం సార్ కు టీడీపీతో చేతులు కలుపకూడదన్న విషయం ఎందుకు అర్థం కాలేదో ఎవ్వరికీ తెలియదు. తెలంగాణ మేమే ఇచ్చినాము అనే బలమైన తెలంగాణ వాదానికి ఉన్న శక్తిని నీరుగారుస్తుందని, ప్రతికూల ఫలితాలు వస్తాయని పసికట్టలేదు. కేసీఆర్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏ పార్టీ అయినా సరే నాలుగు వోట్లు సంపాదించడానికి అందరు ఒక్కటయ్యారు కానీ, వ్రతం చెడ్డ సుఖం దక్కలేదనేది జగద్విదితం.
కర్ణాటక ఎన్నికల తర్వాత అనూహ్యంగా బీజేపీ,బీఆర్‌ఎస్ ఒక్కటేనని, నమ్మి 20శాతం ఉన్న వోటు షేర్ అమాంతంగా 40శాతానికి ఎగబాకింది. అసమ్మతి వాదులను కూడగట్టుతూ పోటీ లేని దగ్గర అభ్యర్థులను ప్రకటించి తన మార్క్ చూపెట్టారు. ఖమ్మం జిల్లాలో, ఉప్పు, నిప్పుగా ఉన్న పొంగులేటి, తుమ్మలను ఒకే గూటికి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. నల్గొండ జిల్లాలో ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి లను సమన్వయం చేయడంలో కీలక భూమిక పోషించారు. వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్ లలో రెబల్స్ బెడద లేకుండా భరోసా కల్పించారు. ఇక పొత్తులకోసం భీష్మించుకొని కూర్చున్న సిపిఎం తప్పించి, సిపిఐలను వొప్పించే ప్రయత్నంలో సఫలీకృతం అయ్యారు. స్వతహాగా బలం లేకున్నా జనసమితి అధినేత కోదండరాం మద్దతు దోహదపడిరది. వైఎసార్సీటిపి ఆంధ్ర షర్మిళ పోటీ చేయకుండా, తీన్మార్ మల్లన్న మీడియా ద్వారా వోట్లు చీలకుండా నివారించి కేసీఆర్ ను వోడిరచడమే లక్ష్యంగా ఏకతాటి పైకి తెచ్చారు. వ్యతిరేక వోటు చీలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫలితాలు అనుకూలంగా రావడంతో అసలు కథ ఇప్పుడు మొదలైంది. మూలకున్న ముసలి కూడా నాకిస్తే వద్దంటానా? అని దీర్ఘాలు తీస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గౌరవప్రదమైన స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ మ్యేనిఫెస్టో అమలు చేయాలంటే సీఎం గా రేవంత్ రెడ్డి నే నియమించాలని మెజార్టీ ఎమ్మెల్యేలు ద్రువీకరించితే, నెలరోజులుగా సైలెంట్ గా ఉన్న ప్రత్యర్థులు విజయం సాధించడంతో పీఠం మాది అంటే మాదేనని టీడీపీ, కాంగ్రెస్ గ్రూపులుగా విడిపోయి నిర్ణయం ఢల్లీికి మారిందని, కాంగ్రెస్ అధిష్టానం కాలయాపన చేయకుండా తెరదించకపోతే రేవంత్ మద్దతు దారులు రాజీనామా చేస్తామని హెచ్చరించడం గమనార్హం. నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఢల్లీి కాంగ్రెస్ తీరు ఉందని ప్రజాస్వామ్య వాదులు అభిప్రాయపడ్డారు.
-డా. సంగనిమల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్,
సెల్ : 9866255355