రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ ..

ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేసిన మంత్రి హరీష్ రావు 
తెలంగాణ రైతుకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో   బిందు సేద్యం కోసం ఆదివారం  ఒకేరోజు 763 మంది రైతులకు స్ప్రింక్లర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..రైతుల కోసం ఏదైనా చేసే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులంటే కేసీఆర్ కు మక్కువ.. వడగండ్ల వానతో నష్ట పోయిన రైతులకు ఎకరాకు సీఎం కేసీఆర్ 10 వేలు అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి  హరీశ్ రావు పేర్కొన్నారు. రైతుల గురించి బీజేపీ మాట్లాడటమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని, నల్ల చట్టాలు తెచ్చి 800 మంది రైతుల ఉసురు తీసిందని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు బీజేపీ తీరుపై మండిపడ్డారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు రైతు బంధు, రైతు భీమా, నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని రాష్ట్ర మంత్రి హరీశ్ తెలిపారు.బీజేపీ వాళ్ల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేసి ఇస్తున్నారా. ? అంటూ సూటిగా ప్రశ్నించారు.   కేంద్రం మరోసారి యాసంగి వరి పంట కొనమని చేతులెత్తేసింది. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గింజ కొంటామని తేల్చి చెప్పారని, రైతులను కేసీఆర్ ఓదారిస్తే, బీజేపీ వంకర మాటలు మాట్లాడుతున్నదని ఎద్దేవాచేశారు. దేశంలో ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్రం తరహా పాలన కావాలని, సంక్షేమ పథకాలు కావాలని పక్క రాష్ట్రాలలో  ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. వడగండ్ల వానకు సీఎం కేసీఆర్ ఎకరాకు 10 వేలు ప్రకటిస్తే.. 10 వేలు చాలవని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సన్నాయి, నొక్కులు నొక్కతున్నారని, మీకు తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే, కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఇవ్వండని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 10 వేలు ఇస్తున్నారని, మీరు కేంద్రం నుంచి 10 వేలు ఇస్తే కలుపుకుని రైతుకు 20 వేలు ఇద్దామని రైతుల పక్షాన అండగా నిలుద్దామని బీజేపీ నేతలకు హుకుం జారీ చేశారు. కాలువల నిండా కాళేశ్వరం నీళ్లు, కడుపునిండా తాగునీళ్లు, 24 గంటల ఉచిత కరెంట్ తెలంగాణ రాష్ట్ర సర్కారు విధానాల వల్ల ఈ యాసంగిలో 56 లక్షల వరి నాట్లు వేశారని, అన్నపూర్ణగా పలికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 16 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేశారని చెప్పుకొచ్చారు. ఈ యాసంగిలో దేశం మొత్తం మీద 97 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 56 లక్షల ఎకరాలు సాగు అవుతున్నదని, రైతు బిడ్డ కేసీఆర్ ముందుచూపుతో వ్యవసాయంలో తెలంగాణ రైతు గెలిచి నిలిచాడని చెప్పారు. శివుడి జటాజూటం నుంచి గంగమ్మ తల్లి పరుగులు పెట్టినట్లు, కాళేశ్వరం నీళ్లు తెలంగాణ రైతు భూముల్లోకి పరవళ్లు తొక్కుతున్నాయని, నదికి కొత్త నడక నేర్పిన ఘనత కేసీఆర్ దేనని మంత్రి వివరించారు. తెలంగాణలో ఒకనాడు భూమి అమ్ముదామంటే కొనేవాడు లేరని, ఇప్పుడు కొందామంటే అమ్మేటోళ్లు లేరని, మరోవైపు తెలంగాణలో నాట్లు వేయడానికి పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వస్తున్నారని, తెలంగాణ పక్క రాష్ట్రాలకు, పక్క దేశాలకు అన్నం పెడుతున్నదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి మాటలు తప్ప చేతలు ఉండవని, బాయికాడ విద్యుత్ మీటర్లు పెడితే పైసలిస్తామని బీజేపీ మెలిక పెటిందని, పక్క రాష్ట్రాల వాళ్ళు మీటర్లు పెట్టి పైసలు తీసుకున్నారని, కానీ సీఎం కేసీఆర్ మీటర్లు వద్దే వద్దన్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం నీళ్లు కాలువల్లో పారడం లేదనంటున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలను ఆ కాలువల్లో ముంచితే నీళ్లు పారుతున్నాయా లేదా తెలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page