కాంగ్రెస్ తెలంగాణను ముంచే పార్టీ
వోటు మీ ఆయుధం…అభివృద్ధి చేసే నాయకునికి వెయ్యాలి
రైతు బంధు, దళిత బంధు సృష్టించిందే కేసీఆర్
ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలంటే క్రాంతి కిరణ్‌ను గెలిపించండి
అందోల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 27: ‘ధరణి’ ద్వారా పట్టా దారులకే సర్వ హక్కులు కల్పించామని, భూమి పట్టాదారు హక్కులను మార్చడం ముఖ్యమంత్రికి కూడా సాధ్యం కాదని, 3 కోట్ల టన్నుల ఎరువులు ఉచితంగా రైతుల వ్యవసాయ సాగుకు అందించామని, తాము సచ్చినా, బతికినా రైతుల పక్షానే ఉంటామని, ‘ధరణి’ రైతులకు శ్రీరామా రక్షలా ఉంటదని, ఇప్పుడిప్పుడే తెలంగాణ కుదుట పడుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం ఆందోల్‌లో ప్రజా ఆశీర్వాద సభ జరిగింది. ఈ సందర్బంగా కేసీఅర్ మాట్లాడుతూ…జోగిపేటకు ఎప్పుడు వొచ్చినా పక్కన పెద్దలు మానిక్ రెడ్డి ఉండేవారని, తన మాటలు విన్న తరువాత గ్రామాల్లో ప్రజలు చర్చ చేసుకోవాలని అన్నారు. ఎలక్షన్స్ వొస్తే ఎమ్ జరుగుతది …పార్టీ కొక్కరు నిలబడుతారని అన్నారు. ఈ అభ్యర్థుల గురించి ఆలోచించాలి … వీరు ఏ పార్టీ వారో చూడాలని అన్నారు. మీ వోటు ఆయుధం …అభివృద్ధి చేసే నాయకునికి వెయ్యాలని కోరారు. బీఆర్‌ఎస్ పార్టీ చరిత్ర మీకు తెలుసని, కాంగ్రెస్ తెలంగాణను ముంచే పార్టీ అని అన్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం చేస్తే 60 మందిని బలి తీసుకున్న పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. దేశంలోని 33 పార్టీలు మద్దతు ఇస్తే కాంగ్రెస్ తెలంగాణను ప్రకటించిందని అన్నారు.
ప్రభుత్వం పెన్షన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే …. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం కోసమే ఈ పెన్షన్ పథకమని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత 5000 వేల పెన్షన్ అందిస్తామని అన్నారు. కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేసి 80 లక్షల మందికి కంటి అద్దాలు అందించామని తెలిపారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందిస్తే పన్నులు వసూలు చేస్తారని అన్నారు. దేశంలో నీటిపై పన్నులు వసూలు చెయ్యని పార్టీ ఒక్కటే అది బీఆర్‌ఎస్ పార్టీ అని అన్నారు. రైతు బంధు, దళిత బంధు సృష్టించేందే కేసీఆర్ అని అన్నారు. రైతు బంధు వెస్ట్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని తెలిపారు. కరెంట్‌పై కేసీఆర్ డబ్బులు వృథా చేస్తున్నాడు అని రేవంత్ రెడ్డి అంటున్నాడని, మూడు గంటల కరెంట్ రైతులకు సరిపోతుందా …లేక 24 గంటల కరెంట్ కావాలా ఆలోచించుకోండని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలి అంటే క్రాంతి కిరణ్ ను గెలిపించండని కోరారు. రైతు బంధును ఆపేస్తే బీఆర్‌ఎస్ ఒడిపోతదా..అది సాధ్యమేనా అని అన్నారు.
కేసీఆర్ బతికునంత కాలం బీఆర్‌ఎస్‌ను, తెలంగాణను ఏమి చెయ్యలేరని అన్నారు.తాను మంత్రిగా ఉన్నప్పుడు జోగిపేటలో తిరగని గల్లీ లేదని అన్నారు. తెలంగాణ ఏర్పడే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే ..అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వం అని అసెంబ్లీలో అంటే కాంగ్రెస్ దామోదర తోపాటు మిగతా మంత్రులు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ ఎందుకు తెలుగుదేశం పార్టీ పెట్టాడని అన్నారు. తెలంగాణలో అతి పేదవారు దళితులే అని తెలిపారు. సేవాలాల్ జయంతి రోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తామని ప్రకటించారు. క్రాంతి కిరణ్ గెలిచాక ఆందోల్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద గుర్తించి ఒకే సారి అందరికి దళిత బంధును అందిస్తామని అన్నారు. ఈ సభలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ఎంపీ బిబి పాటిల్, ఆందో ల్ బి ఆర్ ఎస్ అభ్యర్థి , ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తోపాటు ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.