రైతులపై భస్మాసుర ‘హస్తం’

కొనుగోలు కేంద్రాలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు.. కనీస వసతులు కరువు
 కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా జాప్యమెందుకు..
 కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
 ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పోరాడతామని స్పష్టీకరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 23 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం దొడ్డు బియ్యాన్ని కొనేందుకు సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని  ప్రశ్నించారు. ధాన్యం కేంద్రాల్లో రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్వయంగా కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. గురువారం ఉదయం బీబీనగర్‌ మండలం రాఘవాపూర్‌, రుద్రవెల్లి గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన   పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు.

కొనుగోలు కేంద్రాలకు వొచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, వెయిటింగ్‌లో పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత 45 రోజుల నుంచి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు కనీస వసతులు లేవని, ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. ట్రాన్స్‌పోర్టు, బస్తాలు, బస్తా సుతిల్‌, హమాలి చార్జీలు ఇలా మొత్తం కేంద్రం రాష్ట్రానికి చెల్లిస్తుందని, రాష్ట్ర సర్కారు కొనుగోళ్ల కోసం ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుందని, రైతుల ధాన్యం కొనేందుకు రాష్ట్ర సర్కారుకు వొచ్చిన ఇబ్బంది ఏమిటని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు కొనుగోలు కేంద్రాల్లో తిరిగి కనీసం న్యాయం చేయడం లేదని, 45 రోజులుగా రైతుల ధాన్యం తీసుకొచ్చి సెంటర్లలో ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ ధాన్యం మొలకలొస్తుంటే ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గనిపించడం లేదని మండిపడ్డారు. రైతుల సమస్యల కంటే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికే ఎన్నికలే ముఖ్యమయ్యాయని, ఆఖరి గింజ వరకు కొంటామని కేంద్రం చెబుతుందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం వొచ్చాక మద్దతు ధర 60 శాతం పెంచిందని, సివిల్‌ సప్లయ్స్‌ డిపార్ట్‌ మెంట్‌ సహా ఐకేపీ వారికి కూడా కేంద్రమే కమిషన్‌ ఇస్తున్నదని చెప్పారు. నాడు వరి వేస్తే ఉరి అని కేసీఆర్‌ అంటే.. ఇప్పుడు దొడ్డు వడ్లు వేస్తే ఉరి అని రేవంత్‌ అంటున్నాడని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారని, అందులో రైతులకు సంబంధించిన గ్యారంటీలు ఏమైపోయాయని ప్రశ్నించారు. చెయ్యి గుర్తుకు వోటు వేసినందుకు రైతులకు చెయ్యి ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల మీద కాంగ్రెస్‌ ప్రభుత్వం బస్మాసుర హస్తం పెడుతున్నదని విమర్శించారు. రాహుల్‌ గాంధీ, రేవంత్‌ గ్యారంటీల పేరుతో ఊరూరా తిరిగారని, సోనియా సంతకం చేసిన గ్యారంటీలు ఊరూరా పంచారని, కానీ వారు ప్రకటించిన బోనస్‌ ఏమైందని, బోనస్‌ అంటే.. వడ్లు మొలకలు రావడమేనా..అని, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం..అంటూ కిషన్‌ రెడ్డి మండిపడ్డారు.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడంతో రైతులు అప్పు చెల్లించలేదని,  దీంతో కొత్తగా బ్యాంకులు లోన్లు ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు రైతులు పంటలు ఎలా సాగు చేయాలో రాహుల్‌ గాంధీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేవుడి మీద ఒట్లు వేస్తూ.. ఆగస్టు వరకు వాయిదాలు పెడ్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని రైతు రుణమాఫీ చేయాలని, దొడ్డు, సన్న రకాలని చూడకుండా అన్నింటికి రూ.500 బోనస్‌ ఇవ్వాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఒక వేళ ప్రభుత్వం సన్నరకం వడ్ల సాగును ప్రోత్సహించాలనుకుంటే.. వాటికి రూ.1000 బోనస్‌ ఇవ్వాలని, దొడ్డు వడ్లకు రూ.500 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఆరు గ్యారంటీల అమలును పక్కన పడేసి.. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు దిల్లీ టూర్లు, ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారని, ఇక్కడి సంపదను కొల్లగొడుతూ దిల్లీ పార్టీకి సూట్‌ కేసులు మోస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ కిసాన్‌ మోర్చా కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు అంతా కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులకు అండగా నిలవాలని, రైతుల పక్షాన పోరాడాలని కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సీజన్‌కు ముందే పంట పెట్టుబడి సాయం అందించాలని, లేదంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని కిషన్‌ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page