రైతు రుణ మాఫీపై కొత్త తంటా

  • ఇచ్చిన డబ్బులు మిత్తిలకే పోతున్నాయి
  • ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు
  • ప్రభుత్వం స్పందించి రైతులకు అండగా నిలవాలని డిమాండ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 26 : రైతు రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట తప్పి..ఆలస్యం చేయడం వల్ల రైతులకు కొత్త సమస్యలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు మండిపడ్డారు. ఏడు నెలల వడ్డీపై రైతులను బ్యాంకులు వేధిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్‌ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించిన రైతులకు అండగా నిలబడాలని మాజీ మంత్రి డిమాండ్‌ చేశారు. ఎక్స్‌ వేదికగా హరీష్‌ రావు స్పందిస్తూ.. డిసెంబర్‌ 9న రైతు రుణమాఫీ చేస్తామన్న మాట తప్పి, 7 నెలల తర్వాత ఆ పక్రియను ప్రారంభించడం వల్ల రైతులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ముందుగా ఏడు నెలల వడ్డీ చెల్లించాకే, రుణ మాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చెప్పిన రుణమాఫీ దేవుడెరుగు, వడ్డీ చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తుందని బాధపడుతున్నారని చెప్పారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి డిసెంబర్‌ నుంచి జూలై దాకా వడ్డీని తామే భరిస్తామని, రైతుల నుంచి వసూలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గం శివంపేట్‌ మండలానికి చెందిన ఒక రైతు క్రాప్‌ లోన్‌ను, రూ.9000 మిత్తి కట్టించుకున్నాకే క్లోజ్‌ చేశారన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలానికి చెందిన రైతులకూ ఇదే పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. తనకు రైతులు పంపిన విజ్ఞప్తులను ప్రభుత్వ పరిశీలనకు పంపుతున్నానని…పరిష్కరించాలని కోరుతున్నట్లు హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. లక్ష రూపాయల రుణాలు మాఫీ అని ప్రకటించినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం మొత్తం రుణాలు మాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి.

ఓ రైతులు లక్ష రూపాయల రుణం ఉండగా కేవలం మూడు వేలు మాత్రమే మాఫీ అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల బ్యాంకులు వడ్డీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో రైతులు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉండిపోయే పరిస్థితి ఏర్పడిరది. కాంగ్రెస్‌ పార్టీ ద్వంద్వ విధానం మరోమారు బయటపడిరదని హరీశ్‌రావు విమర్శించారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పూర్తిగా విఫలమైందని, ప్రైవేటు బీమా కంపెనీలకు లబ్ది చేకూర్చడానికే దాన్ని వాడుకుంటున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ జైరామ్‌ రమేశ్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం అదే పథకానికి రెడ్‌ కార్పెట్‌ పరిచి అమలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆక్షేపించారు. అదానీకి భాజపా దోచిపెడుతుందని రాహుల్‌ గాంధీ అంటే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అదానీతో రూ.వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంటోందన్నారు. దిల్లీ కాంగ్రెస్‌ చెబుతున్నది నిజమా? తెలంగాణ కాంగ్రెస్‌ చెబుతున్నది నిజమా?..ఏది వాస్తవమో స్పష్టత ఇవ్వాలని హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page