- సోనియా ప్లకార్డులతో పోడియం వద్ద ప్రదర్శన
- కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ స్పీకర్ ఓమ్ బిర్లా
- సోనియా చట్టానికి అతీతురాలా అంటూ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం
- దేశవ్యాప్తంగా ధర్నాలకు దిగిన కాంగ్రెస్ శ్రేణులు
న్యూ దిల్లీ, జూలై 21 : లోక్‌సభలో గురువారం కూడా విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. అయితే ఇడిముందు సోనియా హజరవుతున్ననేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీనిని అవకాశంగా తీసుకుంది. సోనియా గాంధీ ఫోటోలు ఉన్న ప్లకార్డులను కాంగ్రెస్ నేతలు ప్రదర్శించారు. స్పీకర్ ఓమ్ బిర్లా చైర్ వద్ద సోనియా ఫోటోలతో నిరసన చేపట్టారు. నేషనల్ హెరాల్డ్‌తో లింకు ఉన్న మనీల్యాండరింగ్ కేసులో సోనియాను ఇవాళ ఈడీ విచారించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీలు ఈడీ తీరును ఖండిస్తూ ప్రదర్శన చేపట్టారు. ఈ సమయంలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి జోక్యం చేసుకున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏమైనా మానవాతీతురాలా అని నిలదీశారు. చట్టం కంటే తామే అధికులమని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. గందరగోళం మధ్య సభను కాసేపు వాయిదావేశారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్‌లో కేంద్ర వైఖరికి నిరసనగా ప్రదర్శన చేపట్టారు. సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని తప్పుపడుతూ పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు బైఠాయించారు. పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేసి తమ పార్టీ ప్రధాన కార్యాలయం వరకు వెళ్లారు. రాజకీయ కక్షతోనే కాంగ్రెస్ నాయకత్వాన్ని ఈడీ టార్గెట్ చేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఎదుట నిరసన చేపట్టారు. సోనియాకు సంఘీభావం తెలిపేందుకు ఇప్పటికే పార్టీ లీడర్లు, కార్యకర్తలు సోనియా ఇంటివద్దకు చేరుకొని మద్దతు ప్రకటించారు.